logo

జగనన్నకు చెప్పినా.. నిరాశే!

తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన  పొలాన్ని పక్కనే ఉన్న వ్యక్తులు ఆక్రమించారని గుడిపాల మండలం నారగల్లుకు చెందిన ఓ మహిళ గత నెల 27న 1902కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు.

Published : 15 Jun 2023 03:17 IST

* తమ పూర్వీకుల నుంచి సంక్రమించిన  పొలాన్ని పక్కనే ఉన్న వ్యక్తులు ఆక్రమించారని గుడిపాల మండలం నారగల్లుకు చెందిన ఓ మహిళ గత నెల 27న 1902కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. రెండు వారాలు గడుస్తున్నా అధికారులు చర్యలు తీసుకోలేదని ఆమె వాపోతున్నారు.

* గ్రామంలో నీటి సమస్య ఉందని పుంగనూరు మండలానికి చెందిన ఓ వ్యక్తి నాలుగు రోజుల కిందట 1902 నంబరుకు ఫోన్‌ చేసినా సమస్యను పరిష్కరించలేదు. ఎప్పటిలోగా నీటి ఎద్దడిని తీరుస్తారని అడిగినా.. కొంతకాలం పడుతుందని అంటున్నారే తప్ప నిర్దిష్టంగా ఎలాంటి హామీ ఇవ్వలేదని ఆయన వాపోతున్నారు.

* గంగవరం మండలం ఉల్లికుంట నుంచి గండ్రాజుపల్లెకు వెళ్లే మార్గం అధ్వానంగా ఉందని గండ్రాజుపల్లెకు చెందిన ఓ వ్యక్తి ఫోన్‌ చేసినప్పటికీ పంచాయతీరాజ్‌ శాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

ఈనాడు, చిత్తూరు: ‘మీ సమస్య పరిష్కారం.. మాకు ప్రాధాన్యతాంశం’ అంటూ ప్రభుత్వం ఘనంగా ప్రకటించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 1902కు ఫోన్‌ చేస్తే తమ సమస్య పరిష్కారమైందని, సంతృప్తిగా ఉన్నామని చెప్పేవారి సంఖ్య జిల్లాలో తక్కువగా ఉంది. సంక్షేమ పథకాలు, ప్రభుత్వ సేవలకు సంబంధించిన అంశాలు మొదలుకుని వ్యక్తిగతంగా ఎదుర్కొంటున్న సమస్యలు చెప్పి సకాలంలో పరిష్కారాన్ని పొందవచ్చని సర్కారు చెబుతున్నప్పటికీ ఆచరణలో మాత్రం కనిపించడం లేదు.

అమలు తీరు ఘోరంగా..

సమస్యలను బాధ్యతగా తీరుస్తామని గొప్పగా చెప్పిన ప్రభుత్వం అమలులో ఘోరంగా విఫలమైంది. రెవెన్యూ సంబంధిత అంశాలైతే అధిక భాగం అపరిష్కృతంగానే ఉంటుండటంతో ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. రహదారులు అస్తవ్యస్తంగా ఉన్నాయనే ఫిర్యాదులు వస్తున్నా వాటికి మరమ్మతులు చేయడంలేదని ఫోన్‌ చేసిన వ్యక్తులు ఘంటాపథంగా చెబుతున్నారు. మరోవైపు వర్షాకాలం మొదలుకావడంతో ఇప్పట్లో వీటిని బాగు చేసే పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంది.

ఆరంభం ఘనంగా..

‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం మే 9న లాంఛనంగా ప్రారంభించింది. సంక్షేమ పథకాలు, రేషన్‌ కార్డులు, ఆరోగ్యశ్రీ సేవలు, రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమున్నా 1902కు టోల్‌ ఫ్రీ నంబరుకు ఫోన్‌ చేస్తే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఐవీఆర్‌ఎస్‌, ఎస్‌ఎంఎస్‌ ద్వారా అర్జీదారులకు ఎప్పటికప్పుడు సందేశాలు వస్తాయి. సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో నేరుగా వెబ్‌సైట్‌లోకి వెళ్లి చూడవచ్చని సీఎం స్పష్టం చేశారు.

342 మందిలో 71 మందే సంతృప్తి

ఈ నెల అయిదు నుంచి 11 వరకు జిల్లావ్యాప్తంగా 438 మంది 1902కు ఫోన్‌ చేశారు. ఇందులో అత్యధికంగా 154 ఫిర్యాదులు రెవెన్యూ, 59 పోలీసు, 31 సర్వే, పంచాయతీరాజ్‌ శాఖకు సంబంధించి 29 ఉన్నాయి. అత్యధికంగా పెద్దపంజాణి మండలం నుంచి 40, గంగాధరనెల్లూరు 32, చిత్తూరు నగరం 31, వెదురుకుప్పం మండలం నుంచి 28 మంది సమస్యలు తెలియజేశారు. నిండ్ర, విజయపురం మండలాల నుంచి కేవలం ఒక్కరే ఫిర్యాదు చేశారు. వీరిలో 342 మందికి కాల్‌ సెంటర్‌ సిబ్బంది ఫోన్‌ చేసి సమస్యల పరిష్కారంపై ఆరా తీసేందుకు యత్నించగా 193 మంది స్పందించలేదు. మిగిలిన 149 మందిలో 71 మంది సంతృప్తి వ్యక్తం చేయగా 78 మంది అసంతృప్తిగా ఉన్నామని బదులివ్వడం గమనార్హం.

11వ తేదీ వరకు వచ్చిన ఫిర్యాదులు: 438
సంతృప్తి వ్యక్తం చేసిన వారు: 71 మంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని