logo

మళ్లీ విధ్వంస రచన!

నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు.

Published : 18 Apr 2024 02:41 IST

నిష్పక్షపాతంగా వ్యవహరిస్తేనే నామినేషన్ల ఘట్టం ప్రశాంతం
పుంగనూరుపై దృష్టి పెట్టాలంటున్న ప్రతిపక్షాలు

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పుంగనూరు మండలం ఆరడిగుంట ఎంపీటీసీˆ స్థానానికి నామినేషన్‌ వేసేందుకు వచ్చిన తెదేపా అభ్యర్థి పత్రాలు లాక్కుని పరుగులు తీస్తున్న వైకాపా  మద్దతుదారు (పాతచిత్రం)

ఈనాడు, చిత్తూరు: నాలుగేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు నామినేషన్లే వేయనీయకుండా వైకాపా నేతలు దాడులు, దౌర్జన్యానికి దిగి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇలాకా పుంగనూరులో ఏకంగా 85 సర్పంచ్‌, 848 వార్డుస్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చౌడేపల్లె మండలంలో ఒకట్రెండు సర్పంచి స్థానాలకు మాత్రమే ఎన్నిక జరిగిదంటే ఏవిధంగా అరాచకాలు జరిగాయో స్పష్టంగా అర్థమవుతోంది. ప్రస్తుతం నామినేషన్ల దాఖలుకు పెద్దగా అడ్డంకులు ఉండవని భావిస్తున్నా వైకాపా శ్రేణులు ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికి దాడులకు దిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెదేపాలో క్రియాశీలక వ్యక్తులపై కేసులు బనాయించి పోలింగ్‌కు దూరం చేయవచ్చనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా పుంగనూరు పట్టణంలో హేమాద్రి అనే కార్యకర్తపై జరిగిన దాడే ఇందుకు నిదర్శనం. కూటమి తరఫున రాజంపేట ఎంపీˆ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టారు. ఈ నేపథ్యంలో పుంగనూరు నియోజకవర్గంలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కేంద్ర బలగాలను రప్పిస్తామని పేర్కొన్నారు.

ఆర్వోలూ పారదర్శకంగా ఉంటేనే..

నామపత్రాల సమర్పణ సందర్భంలో ఆర్వోలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఉండాలి. అభ్యర్థులు ఇంకా ఏమైనా పత్రాలు సమర్పించాలా? అనే వివరాలు తెలియజేసేందుకు నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ తిరస్కరించాల్సి వస్తే కారణాలు స్పష్టంగా తెలియజేయాలి.

  • ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో ఎన్నికలు జరుగుతున్నందున గత తప్పిదాలు పునరావృతం కావని ప్రజలు భావిస్తున్నా ఏమూలనో చిన్న సందేహం వెంటాడుతోంది. యంత్రాంగం నిష్పక్షపాతంగా వ్యవహరించకుంటే ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించనుంది. ప్రధానంగా పుంగనూరు నియోజకవర్గంపై అధికార యంత్రాంగం దృష్టి సారించాలనే డిమాండ్‌ అన్నివర్గాల నుంచి వస్తోంది.

ఒత్తిళ్లకు పోలీసులు తలొగ్గకుండా ఉంటేనే

ఇప్పటికీ పోలీసులు.. అధికార పార్టీ అభ్యర్థులకే సహకరిస్తున్నారు. నామపత్రాలు దాఖలుకు వైకాపా అభ్యర్థులు ర్యాలీగా వెళ్తున్నప్పుడు పోలీసులు కట్టుతప్పకుండా చర్యలు తీసుకోవాలి. రిటర్నింగ్‌ అధికారి (ఆర్వో) కార్యాలయ ఆవరణకు ముందే వారిని నిలువరించాలి ఒకే సమయంలో అటు వైకాపా, ఇటు ప్రతిపక్ష అభ్యర్థులు నామినేషన్లకు వస్తే అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. కవ్వింపు చర్యలకు పాల్పడే వారిని నిలువరించాలి. అన్నింటి కన్నా ముఖ్యంగా ఇప్పటికైనా అభ్యర్థులపై ఉన్న క్రిమినల్‌ కేసుల వివరాలు అందించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని