logo

ఉత్తిదే.. ‘ఇంటికే వైద్యం’ అందదే!

ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు.  కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది.

Updated : 18 Apr 2024 05:21 IST

ఎత్తిపోయిన ‘ఫ్యామిలీ డాక్టర్‌’
సిబ్బందే వైద్యులు.. ప్రజారోగ్యంతో చెలగాటం

ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ ప్రచారాలు మార్మోగాయి. వైద్యులే గ్రామానికి వచ్చి నాడి పట్టి.. రోగాన్ని గుర్తించి.. మందులిస్తారని డప్పుకొట్టి మరీ చెప్పారు.  కొత్త వైద్యం కోసం ప్రజలు ఎన్నో ఆశలతో ఎదురుచూసేకోద్దీ అవన్నీ ఉత్తుత్తేనని తేలిపోయింది. వైద్యులు లేకపోయినా.. సిబ్బందే వైద్యుల అవతారమెత్తి వైద్య సేవలు అందించడం.. మందులు లేవనే సమాధానాలు రావడంతో ప్రజలు విసుగెత్తిపోయారు. ఉచిత వైద్యం కన్నా.. ప్రైవేటు వైద్యమే మిన్న అనే భావనతో జేబుకు చిల్లులు పెట్టుకుని వైద్య సేవలు పొందుతున్నారు.

  • థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నా. ప్రైవేటు ఆస్పత్రికి వెళితే.. రూ.వేలు ఖర్చు అవుతుండడంతో ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమాన్ని ఆశ్రయించాను. వైద్యులు పరీక్షలు చేసినంత వరకు సంతోషంగా ఉన్నా.. ఆఖరుగా మందులు లేవని చెప్పడం నిరాశగా మారింది. విధి లేకుండా మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి మందులు వాడుతున్నా.

కోమల, గుడిపాల మండలం

  • కూలికి వెళితేనే పూటగడుస్తుంది. చంటి బిడ్డకు జ్వరమని పని మానుకుని వైద్య శిబిరానికి వెళితే.. సిరప్‌ లేదన్నారు. కూలికి పోయి ఉన్నా వచ్చిన డబ్బుతో ప్రైవేటు వైద్యం పొందుండేవాళ్లం. ప్రస్తుతం కూలి దొరకలేదు, ఉచిత వైద్యం దొరకలేదు. అప్పు చేసి ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లే పరిస్థితి ఎదురైంది.

మహేశ్వరి, పుత్తూరు

న్యూస్‌టుడే, చిత్తూరు(వైద్యం), పుత్తూరు: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ డాక్టర్‌ ప్రోగ్రాం(కుటుంబ వైద్య కార్యక్రమం) జిల్లాలో మొక్కుబడిగా మారింది. ఈ కార్యక్రమాన్ని ఆర్భాటంగా ప్రారంభించి.. గ్రామాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో స్థానిక రాజకీయ నాయకులు, జిల్లా అధికారులు, వైద్యాధికారులు హడావుడి చేసినా ఊహించిన ఫలితాలు లేవు. దీంతో అధికారులు కార్యక్రమాన్ని తేలిగ్గా తీసుకోగా.. ప్రజలు మొహమాటం లేకుండా విస్మరించి ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించే పరిస్థితి. గతేడాది ఆర్భాటంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ఆద్యంతం లోపాల పుట్టే.

కొరవడిన సమాచారం..

గ్రామాల్లో వైద్య శిబిరాలు నిర్వహించే ముందురోజు ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు ఆయా గ్రామంలోని ప్రతి ఇంటికి శిబిరం జరిగే విషయాన్ని తెలియజేయాలి. అలాంటి వైద్య శిబిరం సమాచారం అన్ని ఇళ్లకు అందలేదనే విషయం అందరికీ తెలిసిందే. ఉత్తుత్తిగా జరిగే కార్యక్రమంలో వైద్యలను సంప్రదించినా.. మళ్లీ ప్రైవేటు ఆస్పత్రికి వెళితేనే రోగం నయమయ్యే పరిస్థితి. దీంతో చాలామంది ఫ్యామిలీ డాక్టర్‌ కార్యక్రమం వైపు మొగ్గుచూపక పోతున్నారు.

మందులా.. అవెక్కడ?

మూర్ఛ, థైరాయిడ్‌కు మందుల కొరత ఉంది. కంటి సమస్యలకు వినియోగించే కంటి చుక్కల మందు, చిన్న పిల్లలకు దగ్గు మందు, పారాసిట్‌మాల్‌ సిరప్‌, పాంటాప్‌, యాంటీ బయోటిక్‌, మరికొన్ని అందుబాటులో లేవు. బీపీ, మధుమేహం సమస్యలకు ప్రజలు మందులను అడిగినా కొన్ని రోజులకే ఇచ్చేసి చేతులెత్తేస్తున్నారు. జిల్లా అంతటా ఇదే సమస్య ఉందని అధికారులకు తెలిసినా తెలియనట్లే ఉన్నారు.

వైద్యులు డుమ్మా

పీహెచ్‌సీలో ఉన్న ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఆస్పత్రిలో, మరొకరు క్షేత్రస్థాయిలో 104 వాహనాలతో పాటు వెళ్లి ముందుగా గుర్తించిన ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి. వైద్యులతో పాటు ఎంఎల్‌హెచ్‌పీ, ఏఎన్‌ఎం, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ అందుబాటులో ఉండి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు సుమారు 16 రకాల పరీక్షలు చేసి, 86 రకాల రోగాలకు వైద్య సేవలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. ఆపై కొందరు వైద్యులే ఈ కార్యక్రమానికి డుమ్మా కొట్టే పరిస్థితి నెలకొంది. కొన్నిచోట్ల వైద్యులు ఉదయమే వెళ్లి కొద్దిసేపటికే వెనుదిరిగితే.. అక్కడి సిబ్బందే శిబిరాన్ని నడిపించారు. మరికొన్నిచోట్ల వైద్యులు రాకున్నా అక్కడి డేటా ఎంట్రీ ఆపరేటరే వైద్యుల ఖాతాలో లాగిన్‌ అయి రోగులకు పరీక్షలు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని