logo

జగనన్న పీఆర్సీ.. తీరని ద్రోహం

ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్‌కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్‌ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

Published : 23 Apr 2024 02:54 IST

రివర్స్‌ ఫిట్‌మెంట్‌తో ఉద్యోగులకు నష్టం
భృతి అడిగితే భృత్యుల్లా చూసిన ప్రభుత్వం

ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ఎంతసేపు వెట్టిచాకిరీ చేయించుకున్నారే తప్ప ఈ ఐదేళ్లలో ఏనాడూ తమపక్షాన నిలబడింది లేదని.. నిజానికి జగనన్న పాలనలో వాలంటీర్‌కు ఇచ్చిన విలువకూడా ఇవ్వలేదని.. నెరవేరని హామీలు, రివర్స్‌ పీఆర్సీనే అందుకు నిదర్శనమన్న ఆవేదన ప్రభుత్వ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది.

గత ప్రభుత్వాలన్నీ మధ్యంతర భృతి కంటే పీఆర్‌సీని ఎక్కువ ప్రకటించిన దాఖలాలు ఉన్నాయి. కానీ ఏపీ చరిత్రలోనే తొలిసారిగా జగన్‌ సర్కారు రివర్స్‌ ఫిట్‌మెంట్‌ ఇచ్చి ఉద్యోగుల నోట్లో మట్టికొట్టింది. మధ్యంతర భృతి 27 శాతం కంటే ఫిట్‌మెంట్‌ 4 శాతం తగ్గించి 23 శాతం ఇచ్చిన ఘనత కేవలం జగన్‌కే దక్కుతుంది. 2022 జనవరి ఉద్యోగుల చీకటి రోజులుగా చెప్పొచ్చు.. మాకు జీతాలొద్దు.. ఏమొద్దు అని మొత్తుకుంటున్నా ప్రభుత్వం వారి ఖాతాల్లో ఫిట్‌మెంట్‌తోపాటు వేతనాలు జమ చేసింది. డీఏ బకాయిలు ఇవ్వకపోవడంతో నష్టపోతున్నామని గొంతు చించుకుని మరీ ఉద్యోగులు అరిచినా వారి మాటలు చెవికెక్కలేదు. మరీ దారుణమేమంటే చనిపోయిన, ఉద్యోగ విరమణ చేసిన వారికి జీతాలు జమవ్వగా ఆలస్యంగా గుర్తించిన రాష్ట్ర ఆర్థికశాఖ చేసిన తప్పును సరిదిద్దుకుంది.


గతం కంటే ఘోరంగా..

గత ప్రభుత్వాలు హెచ్‌ఆర్‌ఏ పాయింట్లు గ్రామీణ, పట్టణ, పురపాలక, పట్టణాల్లో నివసించే వారీగా వర్గీకరించాయి. దాని ప్రకారం 12తో మొదలు 14, 16, 20, 24, 30 పాయింట్లుగా పేర్కొన్నాయి. పెరుగుతున్న ఇంటి అద్దెల కారణంగా నానా ఇబ్బందులు పడుతున్నామని జగన్‌ ముందు వాపోతే వాటిని తగ్గించి పుండు మీద కారం చల్లే చర్యలు చేపట్టారు. దాంతో ఉద్యోగులు మోసాన్ని పసిగట్టి నిరసనలు తెలపడంతో చివరకు 8ని పదిగా మార్చారు. 12కు పెంచాలన్న ఉద్యోగుల ఆవేదనలు తాడేపల్లి ప్యాలెస్‌కు చేరలేకపోయాయి.


  • తిరుపతి నగరంలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి తనకు వచ్చే 30 శాతం హెచ్‌ఆర్‌ఏలో ఇంటి అద్దె చెల్లిస్తూ హాయిగా ఉద్యోగం చేసుకుంటుండగా, 15 శాతం మాత్రమే జమకావడం చూసి ఖంగుతిన్నారు. జగనన్న రివర్స్‌ పీఆర్సీ మహిమ బోధపడింది.
  • శ్రీకాళహస్తిలో పనిచేసే ఓ ప్రభుత్వ ఉపాధ్యాయిని తన హెచ్‌ఆర్‌ఏ నగదుతో ఇంటి అద్దె చెల్లిస్తున్న తరుణంలో ఉన్నట్టుండి తన ఖాతాలో నగదు తక్కువ జమకావడం చూసి ఆమెకు మాట రాలేదు. ప్రభుత్వం చేసిన మోసం అప్పటికిగానీ అర్థం కాలేదు.
  • చంద్రగిరిలోని ఓ ప్రభుత్వ ఉద్యోగి ఏడాదిన్నర కిందట పదవీ విరమణ చేశారు. తనకు బకాయిలు అందకపోవడంపై అధికారులను గట్టిగా అడిగేశారు. ఉద్యోగ విరమణ సమయానికి పీఆర్‌సీ అమలు కాకపోవడమే కారణం అంటూ చెప్పడంతో ఆయన ఆవేదన అంతాఇంతా కాదు.

బకాయిలు ఇవ్వకుండా జాప్యం

- కేశవులు, విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు

గత ఎన్నికల సభల్లో జగన్‌మోహన్‌రెడ్డి చెప్పిన మాటలు నమ్మి ఉద్యోగులు మోసపోయారు. వారంలో సీపీఎస్‌ రద్దుచేసి పాత పింఛను విధానం తెస్తామన్నారు. నాకు 2018 డీఏ, పీఆర్‌సీ బకాయిలు రాకుండా ప్రభుత్వం జాప్యం చేస్తోంది.


ఉద్యోగులు నమ్మి మోసపోయారు

- గుండ్లపల్లి ఆంజనేయులు, బీటీఏ రాష్ట్ర నేత

గత సర్కారు 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వగా అంతకుమించి ప్రయోజనం కలిగేలా చూస్తామని, బకాయిలు మొత్తం తీరుస్తామని హామీ ఇచ్చారు. 27 శాతం మధ్యంతర భృతి ప్రకటించగానే ఫిట్‌మెంట్‌ భారీగా ఉంటుందని ఉద్యోగులు ఆశపడ్డారు. అందులోనూ 4 శాతం కోతవేసి తీరని అన్యాయం చేశారు. చదువు చెప్పే ఉపాధ్యాయులతో చేయరాని పనులు చేయించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని