logo

ఫ్యాను పార్టీలో ఉక్కపోత

వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్‌ ఎక్కుతున్నారు.

Published : 23 Apr 2024 05:48 IST

ప్రతి నియోజకవర్గం లోనూ తెదేపాలోకి వలసల వెల్లువ

ఈనాడు, చిత్తూరు: వైకాపాలో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. ఐదేళ్లలో ఆ పార్టీలో గౌరవం దక్కలేదని, ప్రజలకు ఏం చేయలేకపోయామనే భావనతో ఉన్న నాయకులు, కార్యకర్తలు విసిగివేశారి సైకిల్‌ ఎక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీలో రోజురోజుకు ఉత్సాహం పెరుగుతుండగా, అధికార పార్టీ శ్రేణులను నిస్తేజం ఆవరించింది. వైకాపా అభ్యర్థులు, నాయకులు భరోసా ఇస్తున్నా, ఆర్థిక లబ్ధి చేకూరుస్తామని చెప్పినా ద్వితీయ శ్రేణి నేతలు, కార్యకర్తలు లెక్క చేయడం లేదు. ఇప్పటివరకు అనుభవించిన అవమానాలు, కష్టాలు చాలని కరాఖండిగా చెబుతూ ఫ్యాను పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు.

జగన్‌ పాలన ఆసాంతం.. అరాచకాలు, దౌర్జన్యాలు, వేధింపులు, కేసులతో ప్రతిపక్ష శ్రేణులు, సామాన్యులను ఇబ్బంది పెట్టారు. దళితులు, బడుగు, బలహీనవర్గాలపై దాడులు పెరిగాయి. వీటన్నింటినీ అధికార పార్టీలోని నేతలే కొందరు సహించలేకపోయారు. అప్పటికప్పుడు పార్టీని వీడితే తమపైనా కక్ష సాధించడం ఖాయమని మిన్నకుండిపోయారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత అసంతృప్తులంతా బయటకొచ్చి వైకాపా అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు.

మంత్రి పెద్దిరెడ్డి మాటనూ లెక్క చేయకుండా

పుంగనూరు, రొంపిచెర్ల, పులిచెర్ల, చౌడేపల్లె మండలాల వైకాపా నేతలు స్వచ్ఛందంగా తెదేపాలో చేరుతున్నారు. పుంగనూరు తెదేపా అభ్యర్థి చల్లా బాబు ఏ మండలంలో పర్యటిస్తున్నారో తెలుసుకుని అక్కడకు వెళ్లి మరీ తెదేపా తీర్థం పుచ్చుకుంటున్నారు. వైకాపాను వీడవద్దని పలువురికి మంత్రి పెద్దిరెడ్డి సూచించినా పట్టించుకోవడం లేదు. ఐదేళ్లు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని, ఇప్పుడే మేం గుర్తొచ్చామా? అని రాయబారానికి వచ్చిన నాయకులను నిలదీస్తున్నారు. పులిచెర్ల మండలంలోని ఓ ఎస్సీ నాయకుడికి మళ్లీ అధికారంలోకి వస్తే పనులు అప్పగిస్తామని, ఇప్పటికిప్పుడు కొంత నగదు సర్దుబాటు చేస్తామని చెప్పినా వైకాపాలో ఉండేది లేదని తేల్చిచెప్పారు.  

పలమనేరులో వెంకటేగౌడ వైఖరి నచ్చక

గత ఎన్నికల్లో పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ 32,246 ఓట్ల ఆధిక్యంతో మాజీ మంత్రి అమరనాథరెడ్డిపై గెలుపొందారు. అయిదేళ్లు తిరిగేసరికి ఆయన పరిస్థితి తలకిందులైంది. ఐదు మండలాల్లోనూ వైకాపా, శాసనసభ్యుడిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. తెదేపాకు వలసల తాకిడి పెరిగింది. పెద్దపంజాణి మాజీ ఎంపీపీ, విశ్రాంత ఐజీ రెడ్డెప్పరెడ్డి తమ్ముడు విజయభాస్కర్‌రెడ్డిని పెద్దిరెడ్డి, ఆయన కుమారుడు మిథున్‌రెడ్డి ఇంటికి వచ్చి నచ్చజెప్పినా ఆయన అమరనాథరెడ్డి వైపే మొగ్గుచూపారు. చంద్రబాబు సమక్షంలో తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.


నగరిలో నగదు ఆశచూపినా..

మంత్రి రోజా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరి నియోజకవర్గంలో మొదటి నుంచే సిగపట్లు మొదలయ్యాయి. ముఖ్యమంత్రి జగన్‌ స్వయంగా అసంతృప్తులకు నచ్చజెప్పాలని యత్నించి విఫలమయ్యారు. ఈ క్రమంలో మంత్రే స్వయంగా కొందరితో మాట్లాడుతున్నారు. పార్టీని వీడేవారికి స్థాయిని బట్టి రూ.లక్ష మొదలు రూ.5-10 లక్షల వరకు ఇస్తున్నట్లు  ప్రచారం జోరుగా సాగుతోంది. పలువురు తమకు డబ్బు వద్దంటూ తెదేపాలో చేరతామని స్పష్టం చేశారు. మూడు రోజుల కిందట వైకాపా బీసీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలుమలై, డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ లక్ష్మీపతి.. సైకిల్‌ ఎక్కి రోజాకు ఝలక్‌ ఇచ్చారు.

  • చిత్తూరులో ఇప్పటికే కొందరు వైకాపా నేతలు మాపాక్షి మోహన్‌, నగరపాలక సంస్థ కో- ఆప్షన్‌ సభ్యుడు కోలా కిరణ్‌ తదితరులు తెదేపా గూటికి చేరారు. కొందరు కార్పొరేటర్లు  తెదేపా అభ్యర్థి గురజాల జగన్‌కు సహకరిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఏఎస్‌ మనోహర్‌, సీకే బాబు మద్దతు ఇవ్వడంతో తెదేపా కేడర్‌కు కొత్త జోష్‌ వచ్చింది. 
  • పూతలపట్టు, గంగాధర నెల్లూరు వైకాపాలో అసమ్మతి స్వరాలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు అంతర్గతంగా తెదేపా అభ్యర్థులు మురళీమోహన్‌, వీఎం థామస్‌ విజయానికి కృషి చేస్తున్నారు. మరికొందరు కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎంఎస్‌ బాబు, రమేష్‌ పక్షాన ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని