logo

ఏమబ్బా.. కాస్త చూసుకుపోండి

‘ఏమబ్బా.. పోస్టల్‌ బ్యాలెట్‌కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు.

Updated : 25 Apr 2024 06:25 IST

పోస్టల్‌ బ్యాలెట్‌పై ఉన్నతాధికారుల ఒత్తిడి

తిరుపతి (నేరవిభాగం), న్యూస్‌టుడే: ‘ఏమబ్బా.. పోస్టల్‌ బ్యాలెట్‌కు ఫారం - 12 ఇచ్చావా.. ఏంటి పరిస్థితి.. కాస్త చూసుకుపోండి.. తెలుసుకదా ఎవరికి ఓటు వేయాలో..’ ఇదీ కొందరు పోలీసు అధికారులు తమ సిబ్బందితో అంటున్న మాటలు. సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీసులు తమ ఓటుహక్కు వినియోగించుకునేందుకు పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయాన్ని ఎన్నికల కమిషన్‌ కల్పిస్తోంది. ఎవరికి ఏనియోజకవర్గంలో ఓటుఉన్నా.. పనిచేసే ప్రాంతంలో ఓటుహక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఈసీ కల్పిస్తోంది. తిరుపతి జిల్లాలో యూనిఫామ్‌ సర్వీసెస్‌ (పోలీసులు, హోంగార్డులు), వైద్య, ఉపాధ్యాయ, ఎస్వీయూ, ఆర్టీసీ తదితర ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు 18 వేలమంది వరకు ఉన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన నోడల్‌ అధికారుల వద్ద ఫారం - 12 దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈనెల 26 వరకు గడువు ఉండగా మే 5న ప్రభుత్వ ఉద్యోగులకు.. పోలీసు సిబ్బందికి మే 7న పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ జరగనుంది. అయితే కొన్నిశాఖల్లోని ఉన్నతాధికారులు తమ సిబ్బంది ఓటింగ్‌ విషయంలో ఒత్తిడి తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇదివరకటిలా కాకుండా ఎన్నికల సంఘం నేరుగా ఉద్యోగ ఓటరుకే పోస్టల్‌ బ్యాలెట్‌ అందజేసి.. అప్పటికప్పుడు ఓటు వేయించేలా చర్యలు చేపట్టినా ఒత్తిళ్లు కొనసాగుతున్నాయనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా పోలీసుశాఖలో ఈతీరు ఉన్నట్లు ఆరోపణలున్నాయి.

పోలింగ్‌ తగ్గించే కుట్ర

ప్రభుత్వ ఉద్యోగులు అధికార పార్టీకి వ్యతిరేకమనే ప్రచారంతో పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ తగ్గించే కుట్ర జరుగుతోందనే ఆరోపణలు సైతం ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ఆయా శాఖలకు సంబంధించిన నోడల్‌ అధికారులు పెద్దగా చొరవచూపకపోవడం గమనార్హం. కొన్ని శాఖల్లో కలెక్టరేట్‌కు వెళ్లి ఫారం - 12 తెచ్చి.. అందజేయాలని చెప్పినట్లు సమాచారం. దీనిపై ఉద్యోగ సంఘాలు పెద్దగా చొరవచూపడం లేదనే విమర్శలున్నాయి. నోడల్‌ అధికారులు విధులకు వెళ్లే ఉద్యోగుల వివరాల మేరకు ఫారం - 12 తప్పక తీసుకోవాల్సి ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని