logo

హస్తకళలూ.. విస్తుపోయాయి

హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్‌.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్‌ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు.

Published : 25 Apr 2024 03:16 IST

నాలుగేళ్లలో కలగానే.. ‘హస్తకళా గ్రామం’

నిధులురాక పర్యాటకశాఖ అతిథి గృహం సమీపంలో నిలిచిన భవనాలు

హస్తకళా గ్రామం అన్నారు. అన్ని హస్తకళలను ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి కళాకారులకు చేయూత.. మార్కెటింగ్‌.. పర్యాటకులను ఆకర్షించి ఆశించిన రీతిలో మార్కెటింగ్‌ వసతి తదితర ప్రయోజనాలంటూ హామీలు గుప్పించారు. కరపత్రాలు వేసుకున్నారు. తీరా క్షేత్రస్థాయిలో మాత్రం నిర్మించిన నిర్మాణాలు శిథిలమైపోతున్నా.. కళాకారులకు ఒనగూరిన ప్రయోజనం మాత్రం శూన్యమే

శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: హస్తకళలకు కాణాచిగా శ్రీకాళహస్తి ఎంతో ప్రాభవాన్ని సంతరించుకుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన హస్తకళల అభ్యున్నతి కోసం కేంద్ర జౌళీశాఖ శ్రీకాళహస్తి పట్టణానికి సమీపంలో హస్తకళ గ్రామం ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఆమేరకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

అవకాశాలు పుష్కలంగా ఉన్నా..

శ్రీకాళహస్తి కలంకారీతోపాటు ఇక్కడి కొయ్యబొమ్మలకు ఎంతో గుర్తింపు సంతరించుకుంది. ఏర్పేడులోని మాధవమాల, పాపానాయుడుపేట, కేవీబీపురంలోని కర్లపూడి, బీఎన్‌కండ్రిగలోని పల్లమాలతో పాటు తిరుపతి గ్రామీణ ప్రాంతాల్లో వెదురుతో తయారుచేసే ఎన్నో వస్తువులకు ఇక్కడ డిమాండ్‌ ఏర్పడుతోంది. చేనేత వస్త్రాలకు గుర్తింపు లభిస్తోంది. పర్యాటకుల ఆసక్తికి తగ్గట్టుగా హైదరాబాదులోని హైటెక్‌ సిటీ తరహాలో ఇక్కడ హస్తకళల గ్రామం (క్రాఫ్ట్‌ విలేజ్‌) ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రూ.9.55 కోట్లు నిధులతో ఇక్కడ పర్యాటకులను అమాంతం ఆకట్టుకునే విధంగా భవన నిర్మాణాలు చేపట్టాలని సంకల్పించింది.

కనిపించని ఎమ్మెల్యే చొరవ..

నిధుల్లేక ఆగిపోయిన హస్తకళా గ్రామం పనులు పురోగతి విషయమై ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి చొరవ శూన్యమనే చెప్పాలి. శాసనసభలో నవ్వులు పూయిస్తూ ప్రత్యేకతను చాటుకున్న ఎమ్మెల్యే అభివృద్ధి ఆగిపోవడం గురించి సభలో ప్రస్తావించకపోవడం, నిధులు తీసుకురావడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ ప్రణాళిక లేకుండా ఈ భవన నిర్మాణాలు నిర్మించడం, ప్రస్తుతం ఆరు వరుసల రహదారి ఏర్పాటుతో ఈ నిర్మాణాలకు రావాలంటే పర్యాటకులు మరింత ఇబ్బందులు పడాల్సి ఉండటంతో హస్తకళాకారులు ఈ ప్రాజెక్టు పురోభివృద్ధిపై ఆశలు వదులుకున్నారు.

ఎక్కడ వేసిన గొంగడి అక్కడే..

ఇక్కడి భవనాల నిర్మాణాలకు 2020 ఫిబ్రవరి నెలలో పనులు ప్రారంభించారు. ఆర్‌అండ్‌బీ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. కేటాయించిన నిధుల్లో నిర్మాణ పనులకు ప్రభుత్వం రూ.7.5 కోట్లు నిర్ణయించింది. ఇందులో తొలి విడతగా రూ.4.77 కోట్లు నిధులు మంజూరు చేసింది. ఈ నిధులతో భవన నిర్మాణాలు చేపట్టారు. వసతుల కల్పనకు మరింత నిధులు మంజూరు చేయాల్సి ఉంది. అనుకున్న ప్రకారం 2022 జూన్‌ నాటికి పనులు పూర్తిచేయాల్సి ఉంది. నిధులు మంజూరు కాకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని