logo

మొదటి రోజు విలపింఛెన్‌దారులు

ప్రభుత్వ తీరుతో నెల మొదటిరోజే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగమాగమైంది. అధికశాతం మందికి అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు,

Published : 02 May 2024 05:08 IST

53,206 మందికే అందజేత
బ్యాంకులకు సెలవుతో మిగిలినవారికి అందని నగదు

వరదయ్యపాళెం: పింఛను కోసం సచివాలయానికి చేరుకున్న వృద్ధులు

తిరుపతి (బైరాగిపట్టెడ, భవానీనగర్‌), న్యూస్‌టుడే: ప్రభుత్వ తీరుతో నెల మొదటిరోజే సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ ఆగమాగమైంది. అధికశాతం మందికి అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే పింఛన్లు అందించారు. సచివాలయ సిబ్బంది బుధవారం ఉదయం నుంచే లబ్ధిదారుల ఇంటివద్దకు వెళ్లి పింఛన్‌ మొత్తం అందించారు. మిగిలిన వారికి బీడీటీ పద్ధతిలో బ్యాంకు ఖాతాలకు వేస్తామని ప్రకటించగా కార్మిక దినోత్సవం బ్యాంకులకు సెలవు కావడం తోడు లబ్ధిదారులు ఇళ్లకే పరిమితం అయ్యారు. డబ్బులు జమయినట్లు చరవాణులకు సమాచారం రాలేదని కొందరు లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివరకు ఎదురుచూసినా నిరాశే మిగిలింది. పింఛనర్లు గురువారం బ్యాంకులకు వరుసకట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం వక్రబుద్ధితో ఆలోచిస్తూ తప్పు ప్రతిపక్ష పార్టీలపై వేసే నెపంతో నగదు బదిలీ ఆలస్యం చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్న అనుమానాలూ ఉన్నాయి.

వైకాపా నేతల చేతుల్లో జాబితాలు

మరోవైపున వాలంటీర్లను పంపిణీకి దూరం పెట్టామంటున్న ప్రభుత్వం లోలోపల కుతంత్రాలు పన్నుతూనే ఉంది. తిరుపతి నగరంలో చాలా ప్రాంతాల్లో వాలంటీర్లు, వైకాపా నాయకులు సచివాలయాల వద్ద కనిపించారు. పింఛనుదారులు ఎక్కడెక్కనున్నారో అంటూ జాబితాలు పట్టుకునిమరీ వెతకడం కనిపించింది. దీనిపై ఉన్నతాధికారులు, సచివాలయ సిబ్బంది మౌనం దాల్చడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి.

ఇంటింటా పంపిణీ 77.53%

జిల్లాలో 69,522 మంది దివ్యాంగులు, వయోవృద్ధుల్లో 53,206 (76.53%) మందికి సచివాలయ సిబ్బంది ఇళ్లవద్దకే వెళ్లి నగదు అందించారు. మిగిలిన వారికి గురువారం అందజేయనున్నారు. 2,00,868 మంది ఖాతాలకు నగదు జమచేయాల్సి ఉండగా వారిలో బ్యాంకు ఖాతాలు మనుగడలో లేనివారికి, సాంకేతిక కారణాలతో నగదు బదిలీ కానివారికి సచివాలయంలోనే అందజేస్తామని సిబ్బంది చెబుతోంది. అయితే ఆ వివరాలతో కూడిన జాబితా వచ్చాకే అది వీలవుతుందని, అప్పటివరకు ఎదురుచూపులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పంపిణీ తనిఖీ చేసిన కలెక్టర్‌

రామచంద్రాపురం, న్యూస్‌టుడే: సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ బుధవారం ప్రారంభం కావడంతో పంపిణీ తీరును కలెక్టర్‌ ప్రవీణ్‌ కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. మండలంలోని సి.రామాపురం గ్రామంలో వృద్ధులకు, విభిన్న ప్రతిభావంతులకు, మంచానికే పరిమితమైన వారికి సచివాలయ సిబ్బంది పెన్షన్‌ పంపిణీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మంచానికే పరిమితమైన ప్రత్యేక ప్రతిభావంతుడు మహేష్‌ కుమార్‌కు పింఛను అందించారు. ఇన్‌ఛార్జి పీడీ ప్రభావతి, ఎంపీడీవో ప్రత్యూష, డీఆర్డీఏ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

ఖాతా లేదు.. పింఛనెలా సారూ..!

చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరు కె.విజయ. తిరుపతి ఖాదీకాలనీలో ప్రతినెలా పింఛను తీసుకుంటున్నారు. ఈనెల వార్డు సచివాలయ ఉద్యోగులు దివ్యాంగులు, నడవలేని స్థితిలో ఉన్నవారికి మాత్రమే ఇంటి వద్దకే వెళ్లి పింఛను అందిస్తున్నారు. తాను ఒంటరి మహిళనని.. బ్యాంకు ఖాతా లేదని తన పరిస్థితి ఏమిటంటూ 42వ వార్డు సచివాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో నేరుగా ఇస్తామని సిబ్బంది చెప్పడంతో వెనుదిరిగారు.

ఈనాడు, తిరుపతి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని