logo

వైద్యో.. జగనో.. ప్రాణాలు హరీ..!

ఆర్టీసీ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలో విలీనమైతే తమ బతుకులు బాగుపడతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఆశ పడ్డారు. విలీనం కోసం ఉద్యమాలు చేశారు

Published : 02 May 2024 05:11 IST

భారమైన వైద్య సేవలు
ఆర్టీసీ ఉద్యోగుల కన్నీటి వేదన

న్యూస్‌టుడే, పెనుమూరు, బంగారుపాళ్యం: ఆర్టీసీ సంస్థ ప్రభుత్వ రంగ సంస్థలో విలీనమైతే తమ బతుకులు బాగుపడతాయని ఆర్టీసీ ఉద్యోగులు ఆశ పడ్డారు. విలీనం కోసం ఉద్యమాలు చేశారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఇందుకు సీఎం జగన్‌సైతం ఆర్టీసీని ప్రభుత్వ రంగంలో విలీనం చేసి ఉద్యోగులకు మంచి చేస్తానని నాడు హామీ ఇచ్చారు.. విలీనం బాగానే ఉన్నా అసలు కథ ఇక్కడే మొదలైంది.. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో రివర్స్‌ గేర్‌ వేసి నట్టేట ముంచింది.. కార్పొరేషన్‌గా ఉన్నపుడు కంటే ఇప్పుడు వైద్య సౌకర్యాల కోసం నానా తంటాలు పడాల్సి వస్తోందని, నగదు రహిత సేవలు మృగ్యమయ్యాయని వారు వాపోతున్నారు.

సౌకర్యాలు కరవు..

గతంలో ఆర్టీసీ ఉద్యోగులకు ఆరోగ్యపరంగా ఎన్నో సౌకర్యాలు ఉండేవి. విలీనం తరవాత వాటిలో చాలావరకు కోత పెట్టారు. దీంతో ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైతే పక్క రాష్ట్రాల్లోలా మేలు జరుగుతుందని భావించిన ఉద్యోగులకు చివరకు నిరాశే మిగులింది. గతంలో ఉద్యోగి అనారోగ్యానికి గురైతే వైద్య పరీక్షలతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో సాయం అందించేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. నిబంధనల పేరుతో పరిమితి విధించారు. దీంతో శస్త్రచికిత్సలు చేసుకోవాలంటే ఆర్థిక ఇబ్బందులు తప్పడం లేదు.

చాలీచాలని మందులు..

ప్రభుత్వంలో విలీనం చేసిన తరవాత ఉద్యోగులు అనారోగ్యానికి గురైతే చాలీచాలని మందులే ఇస్తున్నారు. దీంతో సొంత డబ్బు వెచ్చించి మందులు కొనుక్కోవాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పంధించి ఆర్టీసీ ఉద్యోగులకు అవసరమైన మందులు పూర్తిస్థాయిలో అందించేందుకు చర్యలు తీసుకోవాలి.

రాజగోపాల్‌, కండక్టర్‌

కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో సదుపాయం కల్పించాలి..

ఆర్టీసీ ఉద్యోగులు విలీనమైతే పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో మాదిరి మెరుగైన వైద్య సేవలు, ఇతరత్రా సౌకర్యాలు ఉంటాయని భావించాం. వైద్యసేవల పరంగా పక్క రాష్ట్రాల్లో ఉన్న సౌకర్యాలు ఇక్కడ కల్పించడం లేదు. శస్త్రచికిత్సలు, పరీక్షల విషయంలో కొన్ని ఆసుపత్రులు పరిమితులు విధిస్తున్నాయి. మరికొన్ని ఆసుపత్రులు నిరాకరిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు బయటకు చెప్పుకోలేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు.

రవీంద్రనాయుడు, కండక్టర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని