logo

అనిశా వలలో అవినీతి తిమింగలం

అవినీతి నిరోధకశాఖ వలలో తిమింగలం చిక్కింది.. ఐస్‌ ఫ్యాక్టరీ రాయితీ సొమ్ము మంజూరు చేయడానికి లంచం డిమాండ్‌ చేసిన కాకినాడ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ టి.మురళి, రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.

Published : 23 May 2024 05:10 IST

సబ్సిడీ తేదీ మార్చేందుకు రూ.2 లక్షల డిమాండ్‌
పట్టుబడ్డ జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం మురళి

పట్టుబడిన నగదుతో జనరల్‌ మేనేజర్‌ మురళి

కాకినాడ గ్రామీణం (సర్పవరం జంక్షన్‌): అవినీతి నిరోధకశాఖ వలలో తిమింగలం చిక్కింది.. ఐస్‌ ఫ్యాక్టరీ రాయితీ సొమ్ము మంజూరు చేయడానికి లంచం డిమాండ్‌ చేసిన కాకినాడ జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్‌ మేనేజర్‌ టి.మురళి, రూ.2లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.. ముందస్తు స్వచ్ఛంద పదవీ విరమణ కోసం దరఖాస్తు చేసుకున్న ఆయనకు ఉన్నతాధికారులు అనుమతించడంతో.. ఈ నెల 31న విరమణ చేయాల్సి ఉంది. ఈలోపే ఏసీబీకి పట్టుబడటం సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే.. కాకినాడ నగరానికి చెందిన పెమ్మాడి శ్రీనివాసకుమార్‌ 2021లో తన భార్య పేరున సర్పవరం ఆటోనగర్‌ ఏపీఐఐసీ పారిశ్రామిక ప్రాంతంలో శ్రీముఖి ఐస్‌ ఫ్యాక్టరీని స్థాపించారు. కాకినాడ జిల్లా పరిశ్రమల కేంద్రంలో ఇంటెన్సివ్‌ సబ్సిడీ విడుదల తేదీని జూన్‌ 2021కు బదులుగా మే 2021గా తప్పుగా నమోదు చేశారు. దీంతో వారికి రావాల్సిన రాయితీ మొత్తం మంజూరు కావడం లేదు. తప్పును సరిదిద్దడానికి టి.మురళిని సంప్రదించగా తేదీ మార్చడానికి రూ.2.50 లక్షలు డిమాండ్‌ చేసి రూ.2 లక్షలకు ఒప్పుకొన్నారు. లంచం ఇవ్వకపోతే ఐస్‌ ఫ్యాక్టరీ సీజ్‌ చేసేలా చేస్తానని బెదిరించాడు. సొమ్మును తీసుకునేందుకు బుధవారం ఉదయం నుంచి రాత్రి వరకు తిప్పి.. చివరకు రాత్రి కాకినాడ నగరంలోని జీఆర్‌టీ గ్రాండ్‌ హోటల్‌ వద్దకు పిలిచాడు.

కారు డిక్కీ తెరచి..: హోటల్‌ వద్ద కారు డిక్కీ తెరచుకుని ఎదురుచూసిన టి.మురళి.. శ్రీనివాస్‌కుమార్‌ ఇచ్చిన లంచం డబ్బు తీసుకోగా.. మాటేసిన ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు బృందం రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని రమణయ్యపేటలోని కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ జరిపారు. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ శ్రీహరిరాజు మీడియాతో మాట్లాడుతూ.. విచారణ చేస్తున్నామన్నారు.

చివరి క్షణాల్లో దండుకుంటూ..: మురళి కాకినాడలో 2022 ఏప్రిల్‌ నుంచి విధులు నిర్వహిస్తున్నారు. ఈనెల 31 నాటికి స్వచ్ఛంద పదవీ విరమణ చేయాల్సి ఉండగా.. రాయితీల మంజూరుకు భారీగా దండుకున్నట్లు సమాచారం. ఎన్నికల కాలాన్ని అక్రమార్జనకు అనుకూలంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు