logo

వైకాపా నేత.. ఇదేం మేత?

వైకాపా ప్రభుత్వంలో సామాన్య రైతులనూ వదలడం లేదు. పొలంలో మెరక చేసుకుంటున్న కర్షకులను అధికార పార్టీ నేతకు చెందిన వ్యక్తులు వచ్చి మైనింగ్‌ రుసుము చెల్లించాలని ఒత్తిడి చేసిన వైనమిది. 

Published : 23 May 2024 05:25 IST

మైనింగ్‌ రుసుము కట్టాలంటూ ఆయన సంస్థ ఉద్యోగుల హుకుం 
పొలాల్లో మట్టి మెరక చేసుకుంటున్న  రైతులపై తీవ్ర ఒత్తిడి

కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న రైతులు

కొత్తపల్లి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వంలో సామాన్య రైతులనూ వదలడం లేదు. పొలంలో మెరక చేసుకుంటున్న కర్షకులను అధికార పార్టీ నేతకు చెందిన వ్యక్తులు వచ్చి మైనింగ్‌ రుసుము చెల్లించాలని ఒత్తిడి చేసిన వైనమిది. 

వ్యవసాయ సీజన్‌ కావడంతో కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం నాగులాపల్లిలో పలువురు రైతులు తమ పొలాలను మెరక చేసుకోవాలని నిర్ణయించి మట్టిని తీసి పనులు చేపడుతున్నారు. ఆ సమయంలో నలుగురు వ్యక్తులు వారి వద్దకు వచ్చారు. ‘‘మేము మైనింగ్‌ శాఖ నుంచి వచ్చాం. పొలంలో మట్టి తరలించాలంటే రుసుము చెల్లించాలి.’’ అంటూ అడ్డుకున్నారు. తాము మట్టి అమ్మకోవడం లేదని, తమ పొలంలోంచే తీసి పల్లంగా ఉన్న చోట వేసుకుంటున్నామని రైతులు తెలిపారు. అయినా సరే రుసుము కట్టాల్సిందేనంటూ వాహనాలు నిలిపేసి రైతులను ఇబ్బందిపెట్టారు. సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. దీంతో రైతులు సాయంత్రం వరకు పడిగాపులు కాసి చివరకు ఆ నలుగురితో సహా కొత్తపల్లి తహసీల్దార్‌ కార్యాలయానికి చేరుకున్నారు. అధికారులు విచారిస్తే వారు మైనింగ్‌శాఖకు చెందిన వారు కాదని తేలింది.


వారి ఇష్టారాజ్యమా..

ఈ గుర్తింపు కార్డుతో వచ్చారు

ఆ బ్యాచ్‌ వద్ద ‘సుధాకర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ సంస్థ పేరుతో గుర్తింపు కార్డులు లభ్యమయ్యాయి. ఈ సంస్థ జిల్లాలో ఓ వైకాపా నేతకు చెందినది.. రెండేళ్ల క్రితం కూడా బొండు ఇసుక తోలకాల వ్యవహారంలో ఈ బ్యాచ్‌ ఆగడాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం మట్టి విషయంలో కూడా రైతుల నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు రూ.320 చొప్పున రుసుము చెల్లించాలని పట్టు పట్టారు. కొత్తపల్లి తహసీల్దార్‌ ఎం.సుందరరాజు మాట్లాడుతూ.. ఆ నలుగురు మైనింగ్‌ శాఖకు సంబంధం లేని వ్యక్తులన్నారు. ప్రభుత్వ శాఖ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్నవారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు సూచించామన్నారు. అనుమతుల్లేకుండా పొలంలో మట్టి తవ్వినందుకు రైతులపైనా చర్యలు తీసుకోవాలనీ ఫిర్యాదులో పేర్కొన్నారు.

రైతులను అడ్డుకున్న వైకాపా నేతకు చెందిన వ్యక్తులు 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు