logo

ఈ ‘బాదుడు’ పేరేమి!

రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు ప్రాంతంలోని ఓ సెలూన్‌ దుకాణం..  విద్యుత్తు శాఖ సిబ్బంది వచ్చి నిర్వాహకుడికి ఓ నోటీసు ఇచ్చారు.  ఏమిటిదని ప్రశ్నించగా మీరు వినియోగిస్తున్న విద్యుత్తు లోడ్‌  పెరిగినందున రూ.2500 డిపాజిట్‌ రుసుము కట్టాలని సూచించారు.

Updated : 23 May 2024 05:47 IST

విద్యుత్తు అదనపు వినియోగం పేరిట నోటీసులు 
ఇప్పటికే ఛార్జీలతో ఇబ్బందిపడుతున్నామన్న వినియోగదారులు
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, దేవీచౌక్‌

రాజమహేంద్రవరం పేపర్‌మిల్లు ప్రాంతంలోని ఓ సెలూన్‌ దుకాణం..  విద్యుత్తు శాఖ సిబ్బంది వచ్చి నిర్వాహకుడికి ఓ నోటీసు ఇచ్చారు.  ఏమిటిదని ప్రశ్నించగా మీరు వినియోగిస్తున్న విద్యుత్తు లోడ్‌  పెరిగినందున రూ.2500 డిపాజిట్‌ రుసుము కట్టాలని సూచించారు. తన దుకాణంలో ఒక ఫ్యాన్, ఏసీ మాత్రమే ఉన్నాయని.. 1 కేవీ నుంచి 2కేవీ లోడ్‌ పెరిగిందని చెప్పి ఇలా డిపాజిట్‌ కట్టమనడం ఏమిటని ఆయన వాపోయారు. ఇప్పటికే రూ.వేలల్లో బిల్లులు చెల్లిస్తున్నామని, ఇప్పుడు అదనపు బాదుడేమిటని ప్రశ్నించారు. మీకొక్కరికే కాదని అదనపు వినియోగం ఉన్నవారందరికీ ఇస్తున్నామని చెప్పి సిబ్బంది వెళ్లిపోయారు. 

ప్పటికే ట్రూఅప్, ఇతర ఛార్జీల పేరిట కొన్నేళ్లుగా వినియోగదారులపై భారం మోపి ముక్కుపిండి వసూలు చేస్తున్న ప్రభుత్వం.. తాజాగా అదనపు వినియోగం పేరిట కొందరికి నోటీసులు జారీ చేస్తూ హడలెత్తిస్తోంది. నోటీసులు అందుకున్న 30 రోజుల్లో చెల్లించకపోతే సరఫరా నిలిపేస్తామని సిబ్బంది స్పష్టం చేస్తున్నారు. రూ.వేలల్లో ఉన్న నోటీసులు చూసి.. ఇలా అయితే వ్యాపారాలు చేయలేమని, నష్టాల్లో ఉన్నామని చిరు వ్యాపారులు అంటున్నారు.


10,860 మందిపై కేసులు.. రూ.5.90 కోట్ల వసూళ్లే లక్ష్యం

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అధిక విద్యుత్తు వినియోగం పేరిట విద్యుత్తు శాఖ అధికారులు తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. రాజమహేంద్రవరం విద్యుత్తు సర్కిల్‌ పరిధిలో 1,79,157 కనెక్షన్లు ఉన్నాయి. వేసవిలో విద్యుత్తు వాడకం ఎలానూ పెరిగింది. ఇప్పుడిదే ఆ శాఖకు కల్పతరువుగా మారింది. అధికంగా వాడుతున్నవారి వివరాలు సేకరించారు. సిబ్బంది ఆయా ఇళ్లకు, వ్యాపారుల వద్దకు వెళ్లి తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 20,331 సర్వీసులను తనిఖీ చేసి 10,860 మంది అధిక విద్యుత్తు వాడుతున్నారన్న కారణంతో కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 10,742 మందికి నోటీసులు జారీ చేశారు. వీరంతా సుమారు రూ.5.90 కోట్ల మేర అదనంగా విద్యుత్తు సంస్థకు 30 రోజుల్లో చెల్లించాలని సూచించారు. ఇప్పటికే 3514 మంది రూ.1.90 కోట్ల మేర చెల్లించారు. ఏళ్ల తరబడి ఉన్న ఉపకరణాలే వినియోగిస్తున్నా ఇప్పుడే ఎందుకు నోటీసులు ఇస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ విధానాల వల్ల సంస్థ ఆదాయం పెరుగుతుందేమో గానీ, సామాన్యుడిపై భారం పడుతోందని వాపోతున్నారు.


అభ్యంతరాలుంటే చెప్పవచ్చట..

కేసులు, డిమాండ్‌ నోటీసుల జారీ విషయమై ఆ శాఖ ఉన్నతాధికారి వద్ద ప్రస్తావించగా.. వినియోగదారుడి బిల్లుల ఆధారంగా, అతను వినియోగించే లోడ్‌ మేరకు తనిఖీలు చేసి అనుమతి పొందిన మొత్తం కంటే ఎక్కువ వాడితే నోటీసులు ఇస్తున్నామన్నారు. వాటిలో అవాస్తవాలున్నా, ఆ స్థాయిలో వినియోగించడం లేదని నిరూపిస్తే దానిని రద్దు చేస్తామన్నారు. సరఫరాకు మించి వినియోగం ఉంటే సమస్యలు తలెత్తుతాయని, భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు, అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకే ఈ ప్రక్రియ చేపట్టామని చెప్పుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని