logo

అపురూప వారధులకు ఆదరణ కరవు

గోదావరి జిల్లాల సస్యశ్యామల సాకారానికి సారథులీ అద్భుత వారధులు. ఆనాటి, ఈనాటి సాంకేతికతకు సజీవ సాక్ష్యాలు సేతువులు. గోదావరి నడుమ ఒయ్యారాలు ఒలికిస్తూ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం పొందాయి.

Updated : 23 May 2024 05:42 IST

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: గోదావరి జిల్లాల సస్యశ్యామల సాకారానికి సారథులీ అద్భుత వారధులు. ఆనాటి, ఈనాటి సాంకేతికతకు సజీవ సాక్ష్యాలు సేతువులు. గోదావరి నడుమ ఒయ్యారాలు ఒలికిస్తూ చరిత్ర పుటల్లో ప్రత్యేక స్థానం పొందాయి. గోదావరి అంటే ఎవరికైనా మదిలో ఈ వంతెనలే మెదులుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా కొవ్వూరు-రాజమహేంద్రవరం మధ్య నాలుగు వంతెనలు సుదీర్ఘ కాలంగా సేవలందిస్తున్నాయి. అయితే వీటి ప్రాభవాన్ని పెంచేందుకు ఆ స్థాయిలో తీసుకుంటున్న చర్యలు మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రద్ధచూపడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

అద్భుత అనుసంధానం..

తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలను అనుసంధానం చేయడానికే నదిపై వంతెనలు అద్భుత రీతిలో నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేని రోజుల్లో పటిష్టంగా నిర్మించిన వారధ]ులు ఇప్పటి తరం వారిని ఆశ్చర్యపరుస్తున్నాయి. అయితే భద్రత, నిర్వహణ, సేవల కొనసాగింపు అంశాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆరోపణలొస్తున్నాయి. ఎంతో గొప్పగా చెప్పుకునే వీటిపై ప్రయాణానికి అనువుగా లేక, చివరికి ప్రాభవాన్ని, భద్రతనే ప్రశ్నించేస్థాయికి చేరాయి. ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తేనే ఈ మణిహారాలు మరింతగా వెలుగొందుతాయి.

డబుల్‌ ట్రాక్‌గా మార్చి..

సింగిల్‌ ట్రాక్‌గా ఉన్న ఈ మార్గంలో రైళ్ల రాకపోకల రద్దీ దృష్ట్యా హేవలాక్‌ వంతెనను నిర్మించారు. 1997 నాటికి ఈ వంతెనకు వందేళ్లు పూర్తవ్వడంతో ఆ వంతెనకు విశ్రాంతినిచ్చి అప్పటికే నిర్మించిన బాణాకార (ఆర్చ్‌ బ్రిడ్జి) రైలు వంతెనపై రైళ్ల రాకపోకలు అనుమతిస్తున్నారు. దీంతో గోదావరి నదిపై 1970 నుంచి డబుల్‌ ట్రాక్‌పై రాళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి.


అతిపెద్ద  వంతెన..

రాజమహేంద్రవరంలోని రోడ్‌ కం రైలు వంతెన

ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్ద రోడ్‌ కం రైలు వంతెనగా ఇది గుర్తింపు పొందింది. మూడో పంచవర్ష ప్రణాళిక కాలంలో 1974లో భరత్‌భరీ ఉద్యోగ్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మించింది. 2.2 కిలోమీటర్ల పొడవైన వంతెన 44 స్పాన్ల (స్తంభాలు)పై 435 జాయింట్లతో నిర్మాణమైంది. ఈ వంతెన వైబ్రేటింగ్‌ రకానికి చెందినది.

మూణ్ణాళ్ల ముచ్చటే..

రోడ్‌ కం రైలు వంతెన భద్రత దృష్ట్యా అత్యవసర పనులంటూ గతేడాదిలో 45 రోజుల పాటు రాకపోకలను నిలిపివేశారు. ర.భ. శాఖ ఆధ్వర్యంలో రూ.2.1 కోట్లతో వంతెన పొడవునా సెకండరీ జాయింట్లకు మరమ్మతులు చేసి రహదారిని నిర్మించారు. భారీ వాహనాలను  అనుమతించకుండా పల్లెవెలుగు బస్సులనే తిప్పుతున్నారు. రైల్వే శాఖ, ర.భ.శా సంయుక్తంగా దాదాపు రూ.30 కోట్లతో పూర్తిస్థాయిలో పనులు చేయాల్సి ఉంది. వంతెనపై దీపాలున్నా వెలగవు. 


బాణాకార  వంతెన..

బాణాకార వంతెన (ఆర్చ్‌ బ్రిడ్జి) 

పాతవంతెన (హేవలాక్‌) శిథిలస్థితికి చేరుతున్న సందర్భంలో చెన్నై-హౌరా రైలు మార్గంలో రెండు మార్గాలను కొనసాగించాలంటే గోదావరి నదిపై మూడో రైలు వంతెన అవసరమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా 320 అడుగుల పొడవున బౌస్టింగ్‌ ఆర్చ్‌ వంతెన మాదిరిగా ఈ వంతెనను నిర్మించారు. నదిలో 28 పిల్లర్లను నిర్మించి వాటిపై 28 ప్రీ స్ట్రక్చర్డ్‌ డెక్‌లను (సిమెంటు చప్టాలు) ఏర్పాటుచేశారు. ఈ చప్టాలను తిరిగి ఆర్చిల రూపంలో ఉన్న ఇనుప నిర్మాణాలతో అనుసంధానించారు. 1997 మార్చి 12 నుంచి దీనిపై రాకపోకలు ప్రారంభించారు.

గతానుభవాలతో మేల్కొన్నారు..

2016 ఆగస్టులో ఆర్చ్‌ వంతెనపై 19వ స్తంభం వద్ద దీనా హేంగరు ఒంగిపోయింది. నిపుణులతో కలిసి డీఆర్‌ఎం, రైల్వే బోర్డు సలహాదారు ఎన్‌.కె.సిన్హా, ఆర్‌.డి.ఎస్‌.ఒ. (లక్నో) ఈ హేంగర్, వంతెనను పరిరక్షించారు. ఒంగిన హేంగరును తొలగించి అదే స్థానంలో కొత్తగా మరొకటి అమర్చారు. ఆ సందర్భంలో రైళ్ల వేగాన్ని 90 కిలోమీటర్ల నుంచి 20 కిలోమీటర్లకు కుదించి పనులు పూర్తిచేశారు. 


తొలి  రైలు వంతెన..

హేవలాక్‌ వంతెన

గోదావరిపై తొలి రైలు వంతెనను సర్‌ ఆర్థర్‌ కాటన్‌ పర్యవేక్షణలో 1887లో నిర్మాణం ప్రారంభించారు. దీనికి వాల్టన్‌ అనే ఇంజినీరు సారథ్యం వహించారు. బ్రిటిష్‌ మేజర్‌ జనరల్‌ హేవలాక్‌ పేరును వంతెనకు నామకరణం చేశారు. 2.95 కిలోమీటర్ల పొడవు, 56 స్తంభాలతో నిర్మించిన వంతెన నూరేళ్లు పూర్తిచేసుకోవడంతో 1997లో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. దీని ఇనుమును వేలం ద్వారా విక్రయించాలని రైల్వే శాఖ చేసిన ప్రయత్నాలపై పెద్దఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.


పర్యాటకంగా  తీర్చిదిద్దేనా..

పర్యాటకంగా అభివృద్ధి చేస్తే (ఊహాచిత్రం) ఇలా..

పాదచారులతో పాటు ఉదయం యోగ, వ్యాయామం చేసుకునేవారికి వంతెనను అనుకూలంగా తీర్చిదిద్ది రాత్రి బజారు, అఖండ గోదావరి ప్రాజెక్టులో లంకలను అనుసంధానం చేసి పర్యాటక అతిథి భవనాలను నిర్మించాలన్న సంకల్పం ఏళ్లు గడుస్తున్నా నెరవేరడం లేదు. రూ.110 కోట్లతో చేసిన ప్రతిపాదనలు పట్టాలు ఎక్కడం లేదు. ఆయా పనులు జరిగితే యువతకు ఉపాధితో పటు రాజమహేంద్రవరం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతుంది.


గామన్‌.. నాలుగో  మణిహారం

నాలుగు వరుసల వంతెన (గామన్‌ వంతెన)

నిర్మాణం, నిర్వహణ, బదిలీ పద్ధతిలో నాలుగు లైన్ల వంతెనను గామన్‌ ఇండియా సంస్థ నిర్మించింది. 2006లో ప్రారంభించి 2015 అక్టోబరు 1న వాహనాలను అనుమతించారు. 14 కిలోమీటర్ల పొడవుతో 100 టన్నుల బరువు సామర్థ్యంతో ఈ వంతెన రూపుదిద్దుకుంది. దీని నిర్మాణంతో విజయవాడ నుంచి విశాఖకు 50 కిలోమీటర్ల మేర దూరం తగ్గింది. వారధిపై 52వ యాక్షన్‌ జాయింట్‌ వద్ద బేరింగ్‌ కుగింది. 28వ స్తంభం వద్ద ఫ్రిక్షన్‌ సరిగా లేదని గుర్తించి ఆ బేరింగ్‌ను మార్చాల్సి వచ్చింది. ఈ పనులతో దాదాపు 45 రోజులకు పైగా ఒకవైపే రాకపోకలు సాగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని