logo
Published : 30/11/2021 06:29 IST

ఏలేరు, పీబీసీకి పూర్తిస్థాయిలో సాగునీరు

వివరాలు వెల్లడిస్తున్న మంత్రి కన్నబాబు.. వేదికపై మంత్రి వేణు తదితరులు

ఈనాడు - కాకినాడ: రబీలో ఏలేరు... పిఠాపురం బ్రాంచి కెనాల్‌కు (పీబీసీ) పూర్తిస్థాయిలో సాగునీరు ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కలెక్టరేట్‌లో సోమవారం జిల్లా నీటిపారుదల సలహా మండలి సమావేశం కలెక్టర్‌ హరికిరణ్‌ అధ్యక్షతన నిర్వహించారు. తూర్పు-మధ్య డెల్టాల్లో రబీ 1431 ఫసలీలో పంటలకు సాగునీటి సరఫరా.. ప్రజలకు తాగునీటి సరఫరా, కాలవలు తెరిచే, మూసే తేదీలపై సమావేశంలో చర్చించారు.

అధికారుల లెక్క

ధవళేశ్వరం ఇరిగేషన్‌ సర్కిల్‌ ఎస్‌ఈ బి.రాంబాబు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా గోదావరి డెల్టాల్లో నీటి లభ్యత, సీలేరు, ఇతర వనరుల ద్వారా జలాల సమీకరణ, సాగు ప్రణాళికను వివరించారు. జిల్లాలో 4,36,533 ఎకరాలకు రబీలో నీరందించాల్సి ఉందని, అందులో 1,33,214 ఎకరాల్లో నీటి ఎద్దడి ప్రాంతాలు ఉన్నాయని వివరించారు. రబీలో రోజూ 9వేల క్యూసెక్కులు అవసరమన్నారు. పోలవరం ప్రాజెక్టులో నీటిని నిల్వచేసి అవసరమైనప్పుడు విడుదలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదావరిలో నీటి లభ్యత తక్కువగా ఉండడంతో సీలేరు నుంచి జనవరి, ఫిబ్రవరి, మార్చిలో రోజుకు 4వేల క్యూసెక్కుల నీరు సరఫరా చేసేలా జెన్‌కోను కోరాలని సూచించారు.

మంత్రి కన్నబాబు మాటల్లో..

రబీకి డిసెంబరు 15న నీరు విడుదలచేయాలని.. ఏప్రిల్‌ 15-20 మధ్యలో కాలువలు మూసేయాలని తాత్కాలిక నిర్ణయం తీసుకున్నాం. ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రితో ఉన్నతస్థాయి సమావేశంలో తేదీలు ఖరారు చేస్తాం.

అధికారుల అంచనా ప్రకారం గోదావరిలో నీటి లభ్యత 74 శాతం ఆయకట్టుకే ఉంది. ఉభయగోదావరి జిల్లాల్లో 8.96 లక్షల ఎకరాల ఆయకట్టుకు 90 టీఎంసీలు అవసరం. గోదావరి.. సీలేరు జలాలు అన్నీకలిపినా తాగు- సాగునీటి అవసరాలు చూస్తే నీటి లభ్యత ఇబ్బందిగా ఉంది.

వంతుల వారీగా నీరిస్తే కొంత పొదుపు చేయవచ్చనే అంచనాతో నీటి విడుదల రోజు నుంచి వారాబందీ అమలు చేస్తాం. సమర్థ నీటి యాజమాన్యంతో ఇబ్బందులు లేకుండా చూస్తాం. రబీ వేగంగా ప్రారంభించేలా చూడాలి.

కాలువల్లో క్రాస్‌బండ్లు వేసి నీటిని అదనంగా ఇవ్వాలని.. ఎక్కడ మోటార్లుపెట్టి తోడాలో అంచనా వేస్తున్నాం. శివారు, ఎత్తయిన ప్రాంతాల్లో 1.10 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు వేసేలా అవగాహన కల్పిస్తాం.

కంట్రోల్‌రూమ్‌ ఏర్పాటు.. డెల్టాలవారీగా కీలక శాఖలతో సమన్వయ కమిటీలు వేసి సాగునీటి ఇబ్బందులు లేకుండా చూస్తాం. నిరుడు నివర్‌ తుపానులో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.46 కోట్లు, లివర్‌లో రూ.3 కోట్లు ఇచ్చామని.. బీమా కింద జిల్లాలో రూ.219 కోట్లు ఇచ్చాం.

ప్రతిపక్ష వాణి

రైతుల్ని ఆదుకోవాలని కోరుతున్న ఎమ్మెల్సీ చిక్కాల

రబీలో శివారుప్రాంతాలతోపాటు బోర్లపై ఆధారపడే వారికి సాగునీటి విషయంలో అన్యాయం జరగకుండా చూడాలని తెదేపా ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వేగుళ్ల జోగేశ్వరరావు కోరారు. తాజాగా దెబ్బతిన్న పంటలకు పరిహారం ఇవ్వాలని, రంగుమారిన ధాన్యం కొనుగోలుపై రైతులకు స్పష్టమైన భరోసా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక పర్యవేక్షణ కమిటీల ఏర్పాటుతో అందరికీ సాగునీరు అందేలా చూస్తామని మంత్రి, కలెక్టర్‌ తెలిపారు.

కాలువలపై ఆక్రమణలు తొలగింపు..గుర్రపుడెక్క, పూడిక తొలగింపు. వారాబందీ అమలుకు కీలక శాఖల పర్యవేక్షణ.హైలెవల్‌ పాచ్‌లో ఉన్న 1.1 లక్షల ఎకరాలను మ్యాపింగ్‌చేసి క్రాస్‌ బండ్లు, ఆయిల్‌ ఇంజిన్లతోసాగునీరివ్వాలని నిర్ణయించారు.

ప్రముఖుల రాక

మావేశంలో మంత్రి వేణు, జడ్పీ ఛైర్మన్‌ వేణుగోపాలరావు, విప్‌లు దాడిశెట్టి రాజా, చిర్ల జగ్గిరెడ్డి, ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు, తోట త్రిమూర్తులు, ఎమ్మెల్యేలు సత్తి సూర్యనారాయణరెడ్డి, దొరబాబు, చిట్టిబాబు, జక్కంపూడి రాజా, పొన్నాడ వెంకట సతీష్‌,చంటిబాబు, పర్వత, వ్యవసాయ సలహా మండలి కమిటీ ఛైర్మన్‌ సాయి, జేసీలు సుమిత్‌, భార్గవ్‌ తేజ, చీఫ్‌ ఇంజినీర్లు పుల్లారావు, సుధాకర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

Read latest East godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని