logo

బినామీ రుణ బాగోతంపై సీఐడీ గురి

 గండేపల్లి సొసైటీ బినామీ రుణాల కుంభకోణంపై సీఐడీ దృష్టిసారించింది. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బినామీలకు అప్పులు ఇచ్చి రూ.22.07 కోట్లు నిధులు దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసిన సీఐడీ బృందం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి

Published : 21 Jan 2022 04:42 IST

 

ఈనాడు - కాకినాడ: గండేపల్లి సొసైటీ బినామీ రుణాల కుంభకోణంపై సీఐడీ దృష్టిసారించింది. ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో బినామీలకు అప్పులు ఇచ్చి రూ.22.07 కోట్లు నిధులు దుర్వినియోగం చేసిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రాథమిక విచారణ పూర్తిచేసిన సీఐడీ బృందం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయానికి ప్రాథమిక నివేదిక పంపింది. అక్కడ్నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో విచారణకు రంగంలోకి దిగనుంది. గతేడాది డిసెంబరులో అంతర్గత విచారణ ప్రారంభించిన రాజమహేంద్రవరానికి చెందిన సీఐడీ అధికారులు.. తాజాగా ఈనెల 19న గండేపల్లి సొసైటీని సందర్శించారు. ఈ కుంభకోణంపై విచారణ జరిపి ప్రభుత్వానికి నివేదిక అందించిన పెద్దాపురం డివిజనల్‌ సహకార అధికారి అచ్యుత రాధాకృష్ణరావును ప్రశ్నించి పలు వివరాలు సేకరించారు. గండేపల్లి సొసైటీ ఇన్‌ఛార్జి సీఈవో, ఆడిటర్‌, పర్యవేక్షకులు ఇతర సిబ్బందిని విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రుణాలు పొందేందుకు వినియోగించిన నకిలీ పత్రాలు, ఇతర అనుమానిత దస్త్రాలు సేకరించిన సీఐడీ పక్షం రోజుల్లో పూర్తిస్థాయి విచారణకు సిద్ధం కానున్నట్లు సమాచారం.

బదిలీ అయ్యాక కదలిక..: రుణ కుంభకోణం వెలుగుచూసిన తర్వాత.. పీఏసీఎస్‌ చట్టంలోని సెక్షన్‌ 51 ప్రకారం విచారణ జరిపారు. నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన బ్యాంకు, సంఘం సిబ్బందితోపాటు పూర్వ అధ్యక్షులు తదితర 19 మంది పాత్ర గుర్తించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గతేడాది గండేపల్లి పోలీసు స్టేషన్లో కేసు నమోదయింది. రూ.కోట్ల కుంభకోణం కావడం.. అక్రమాలు మరిన్ని వెలుగుచూసే ఆస్కారం ఉండడంతో ఈ కేసును పోలీసులు సీఐడీకి రెండు నెలల కిందట బదిలీ చేశారు.

అక్రమార్కుల్లో గుబులు: డీసీసీబీ పరిధిలోని రుణాల కుంభకోణంలో సూత్రధారులు, పాత్రధారులు బొక్కేసిన సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో విలువైన భూములు కొన్నారనే ప్రచారం సాగింది. శాఖాపరమైన చర్యలు ఎదుర్కొన్నవారు రాజకీయ దన్నుతో పోస్టింగులకు ప్రయత్నిస్తున్నారన్న వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో సీఐడీ ఈ కుంభకోణం మూలాలపై లోతుగా దృష్టిసారించడంతో ఆయా వర్గాల్లో గుబులు రేగుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని