logo

అలసి తిరుగుతున్నాం... ఆలకించండి మహాప్రభో!

ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... స్థానిక అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఉన్నతాధికారులకు చెప్పుకొంటే పరిష్కారం దొరుకుతుందనే ఆశలో వ్యయప్రయాసలు పడి కలెక్టరేట్‌లో స్పందనకు సోమవారం వచ్చారు. వీరిలో రెండు, మూడుసార్లు వచ్చినవారూ ఉన్నారు. కనీసం కలెక్టరేట్‌లో విన్నవిస్తే పరిష్కారమవుతాయనుకుంటే ఇక్కడా కూడా

Published : 28 Jun 2022 02:20 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం

కలెక్టర్‌ సమావేశ మందిరం బయట నిరీక్షిస్తున్న అర్జీదారులు

ఒక్కొక్కరిదీ ఒక్కో సమస్య... స్థానిక అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయారు. ఉన్నతాధికారులకు చెప్పుకొంటే పరిష్కారం దొరుకుతుందనే ఆశలో వ్యయప్రయాసలు పడి కలెక్టరేట్‌లో స్పందనకు సోమవారం వచ్చారు. వీరిలో రెండు, మూడుసార్లు వచ్చినవారూ ఉన్నారు. కనీసం కలెక్టరేట్‌లో విన్నవిస్తే పరిష్కారమవుతాయనుకుంటే ఇక్కడా కూడా అదే పరిస్థితి ఉండటంతో కొందరు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సమస్యలకు సత్వరం పరిష్కారం లభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను వేడుకుంటున్నారు.


ఏడుసార్లు విన్నవించినా..

ఈమె పేరు సూరి సత్యవతి. దేవరపల్లి మండలం యాదవులు గ్రామం. తనకున్న 2.3 ఎకరాల సీలింగ్‌ భూమిని కౌలుకు ఇచ్చారు. ఎనిమిదేళ్లుగా కౌలు చెల్లించకపోగా తన భూమిని కొందరు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఈమె చెబుతున్నారు. అధికారులు పట్టాదారు పాసు పుస్తకం జారీ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నట్టు చెబుతున్నారు. భర్త చనిపోయారని, భూమి ఒకటే తనకు ఆధారమని న్యాయం చేయాలని కోరుతూ అనేకసార్లు అర్జీ అందించినప్పటికీ  ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నాలుగు సార్లు ఏలూరు కలెక్టరేట్‌కు వెళ్లి అర్జీ అందించానని, కొత్త కలెక్టరేట్‌ వచ్చాక ఇక్కడికి మూడుసార్లు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.


రుణం తీర్చినా పట్టాలు ఇవ్వడంలేదు

ఇంటి రుణం తీర్చేసినా పట్టాలను అధికారులు ఇవ్వడం లేదంటూ కోరుకొండకు చెందిన బి.సత్యవతి, రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌టీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మూడేసి సెంట్లు చొప్పున ప్రభుత్వం ఇళ్లస్థలాలు ఇచ్చిందని, లోను తీసుకుని ఇళ్లు నిర్మించి అందులో ఉంటున్నట్లు వీరు చెబుతున్నారు. రుణం రూ.4,250 ఇప్పటికే తీర్చివేసి, తమ ఇంటి పట్టాలు తమకు ఇప్పించాలని అనేకసార్లు హౌసింగ్‌ కార్యాలయానికి వెళ్లి అధికారులను కోరినప్పటికీ ఫలితం లేకపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం ఇక్కడి అధికారులైనా స్పందించి తమ పట్టాలు తమకు అందిస్తారనే ఆశతో వచ్చినట్లు వారు చెప్పారు.


జీవనాధారం కోల్పోయి..

ఈమె పేరు రవణమ్మ. చిన్న కొడుకు నూకరాజు బీటెక్‌ చదివాడు. భర్త చనిపోయాక అతని ఉద్యోగం నూకరాజుకు రావడంతో నిడదవోలు మున్సిపల్‌ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేసేవాడు. ఈ ఏడాది జనవరిలో నూకరాజూ చనిపోవడంతో పెద్ద కొడుకు గురుమూర్తికి ఆ ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలంటూ మున్సిపల్‌ కార్యాలయానికి తిరిగినప్పటికీ ఎవరూ పట్టించుకోవడంలేదని రవణమ్మ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు కుటుంబానికి ఉపాధి చూపి ఆదుకోవాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని