logo

స్వచ్ఛ సంకల్పం..నెరవేరని లక్ష్యం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్వహణ గాడితప్పడంతో స్వచ్ఛ సంకల్ప లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి సమర్థంగా అమలు జరుగుతున్నా.. అధిక శాతం గ్రామాల్లో మొక్కుబడిగా సాగుతుండగా.. అనే చోట్ల నేటికీ ప్రారంభానికి నోచుకోని దుస్థితి నెలకొంది.

Published : 02 Oct 2022 04:20 IST

న్యూస్‌టుడే, సామర్లకోట గ్రామీణం, సర్పవరం జంక్షన్‌

గోంచాలలో నిరుపయోగంగా కేంద్రం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చెత్త నుంచి సంపద కేంద్రాల నిర్వహణ గాడితప్పడంతో స్వచ్ఛ సంకల్ప లక్ష్యం నెరవేరడం లేదు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఇవి సమర్థంగా అమలు జరుగుతున్నా.. అధిక శాతం గ్రామాల్లో మొక్కుబడిగా సాగుతుండగా.. అనే చోట్ల నేటికీ ప్రారంభానికి నోచుకోని దుస్థితి నెలకొంది. దీంతో ఏళ్ల క్రితం ఉన్నత లక్ష్యంలో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా ఇంటింటా తడి, పొడి చెత్త సేకరణకు చెత్త బుట్టలు, రిక్షాల పంపిణీ జరుగుతున్నా క్షేత్ర స్థాయిలో ఈ కేంద్రాలు మాత్రం సక్రమంగా పని చేయడం లేదు.

* సామర్లకోట మండలంలో 18 పంచాయతీలు ఉండగా ఉండూరు, జి.మేడపాడు, అచ్చంపేట తదితర 9 గ్రామాల్లో సక్రమంగా వీటి నిర్వహణ సాగుతోంది. వేట్లపాలెం, కాపవరంలో స్థల సమస్య, పవరలో బెస్‌మెంట్‌ స్థాయి నిర్మాణం, కొత్తూరులో నిర్మాణం జరగలేదు. వి.కె.రాయపురం పైకప్పు లేదు. మాధవపట్నంలో పంచాయతీ అభ్యంతరం, గొంచాల, పండ్రవాడల్లో నాడెప్‌ నిర్మాణాలు చేయాల్సి ఉండటం, రోడ్డు నిర్మాణం, మరమ్మతులు చేయాల్సి ఉంది.

* కాకినాడ గ్రామీణ మండలంలో 18 గ్రామాలుండగా 6 మాత్రమే పని చేస్తున్నాయి. మరో 7 కేంద్రాలు ప్రారంభం కావాల్సి ఉంది. రేపూరు, తిమ్మాపురంలో అంచనాల దశలో ఉన్నాయి. తూరంగి, కొవ్వూరు, ఇంద్రపాలెంలో స్థల సమస్య నెలకొంది. ప్రతి గ్రామంలో చెత్త సేకరణకు తొట్టి రిక్షాలు, వాహనాలను స్వచ్ఛ సంకల్పంలో భాగంగా అందించినా క్షేత్ర స్థాయిలో షెడ్లు లేకపోవడంతో చెత్త సమస్యకు పరిష్కారం లభించడం లేదు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

కాకినాడ జిల్లా పరిధిలో 385 పంచాయతీలుండగా 223 చెత్త నుంచి సంపద కేంద్రాలున్నాయి. మిగతా చోట్ల వసతులు, సామగ్రి సమకూరక ప్రారంభానికి నోచుకోలేదు. షెడ్లు ఉండి విద్యుత్, రోడ్లు, నీటి సదుపాయం కావాల్సినవి 48 ఉండగా, స్థలాలు అందుబాటులో లేక నిర్మాణాలు జరగనివని 32, స్థలం ఉన్నా నిర్మాణం జరగనివి, అసంపూర్తిగా ఉంటూ వినియోగంలోనికి రానివి 114 ఉన్నాయి. దీంతో ఆయా చోట్ల స్వచ్ఛ సంకల్ప లక్ష్యం నీరుగారుతోంది.

పూర్తిస్థాయిలో నిర్వహణ జరిగేలా చర్యలు

కాకినాడ డివిజన్‌ పరిధిలో 11 షెడ్లకు మౌలిక వసతులు కల్పన, చిన్నపాటి మరమ్మతులు చేయాల్సి ఉంది. చెత్త నుంచి సంపద కేంద్రాల్లో పనులు పూర్తి చేసి పూర్తి స్థాయిలో అమలు చేయాలని జిల్లా కలెక్టర్, డ్వామా పీడీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అన్నింటినీ అందుబాటులోకి తీసుకొచ్చి నిర్వహణ బాధ్యతలను కార్యదర్శులకు అప్పగిస్తాం. - అమ్మాజీ. డీఎల్‌పీవో. కాకినాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని