logo

ఆర్టీసీకి పెళ్లిసందడి

ప్రసుత్త నెలలో ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నెల 17 వరకు పెళ్లి ముహూర్తాలు ఉండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు.

Published : 05 Dec 2022 06:16 IST

రాజమహేంద్రవరం ప్రధాన బస్టాండ్‌

వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం), న్యూస్‌టుడే: ప్రసుత్త నెలలో ఆర్టీసీకి ప్రయాణికుల రద్దీ పెరిగింది. ఈ నెల 17 వరకు పెళ్లి ముహూర్తాలు ఉండటమే దీనికి కారణమని అధికారులు చెబుతున్నారు. జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం ప్రధాన బస్టాండ్‌ నుంచి వివిధ ప్రాంతాలకు సాధారణ రోజుల్లో రోజుకు 15 వేల నుంచి 20 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు. టికెట్‌ సర్వీసు ద్వారా ఈ డిపోనకు సగటున రోజువారీ రాబడి రూ.18 లక్షల వరకు ఉంటుంది. ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు ఉండటంతో ప్రయాణికుల సంఖ్య 25 వేల వరకు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఈ నెల 2న టికెట్‌ సర్వీసు ద్వారా రూ.20.35 లక్షలు రాబడి రాగా 3న రూ.28 లక్షలు వచ్చింది. పెళ్లిళ్ల కోసం ప్రత్యేక బస్సులను కూడా ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. పెళ్లిళ్ల నిమిత్తం ఇప్పటివరకు 40 బస్సులు బుక్కయినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఇక్కడి డిపో నుంచి 9 బస్సులను వివాహ కార్యక్రమాలకు పంపించినట్లు తెలిపారు.

గత నెల రాబడి రూ.6.02 కోట్లు

గత నెలలో కార్తిక మాసం సందర్భంగా పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక యాత్ర బస్సులు నడపడం ద్వారా రాజమహేంద్రవరం ఆర్టీసీ డిపోనకు రాబడి పెరిగింది. సహజంగా నెలకు షెడ్యూల్‌ సర్వీసుల ద్వారా 5.51 కోట్లు రాబడి రాగా నవంబరులో షెడ్యూల్‌ సర్వీసులతోపాటు శబరిమలై, పంచభూతలింగ దర్శనం పేరిట 11 యాత్ర బస్సులు, పంచారామాలకు మరో 30 బస్సులు నడపడం ద్వారా రాబడి రూ.6,02,86,000 వచ్చింది. కార్తికం ముగిసిన తర్వాత రద్దీ బాగా తగ్గినప్పటికీ ప్రస్తుతం పెళ్లి ముహూర్తాలు ఉండటం ఈ నెల 2 నుంచి ప్రయాణికుల రద్దీ పెరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని