logo

అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె పెరిగింది

చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటుచేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Published : 07 Dec 2022 02:51 IST

న్యూస్‌టుడే, వెంకట్‌నగర్‌(కాకినాడ)

కాకినాడలో అద్దె భవనంలో సాగుతున్న అంగన్‌వాడీ కేంద్రం

చిన్నారులు, బాలింతలు, గర్భిణులకు పౌష్టికాహారం అందించేందుకు ఏర్పాటుచేసిన అంగన్‌వాడీ కేంద్రాలకు అద్దె పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయిదు నెలలుగా మధ్యాహ్న భోజన పథకం కూడా అమలు చేస్తుండటంతో అక్కడికి వచ్చేవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అద్దెల మాట అటుంచితే పట్టణ, నగర ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చిన అద్దెలు సరిపోక తమ సొంత నగదును అంగన్‌వాడీ సిబ్బంది చెల్లించేవారు. ఇప్పుడు అద్దె రుసుములు పెంచడం కాస్త ఊరటనిచ్చే అంశమని వారు అంటున్నారు.

భవనాలు పూర్తయితే  తప్పనున్న భారం

కాకినాడ జిల్లాలో మొత్తం 10 ప్రాజెక్టులకు 1,986 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో సొంత భవనాల్లో 706, అద్దెవి 1,107, అద్దె లేనివి 173 ఉన్నాయి. అద్దె కేంద్రాలు రూరల్‌ ప్రాజెక్టులో 767, అర్బన్‌ పరిధిలో 340 ఉన్నాయి. నాడు-నేడు పనుల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మరో 98 కేంద్రాలు నిర్మించేందుకు సన్నాహాలు చేశారు. పెద్దాపురం ప్రాజెక్టు పరిధిలో మొత్తం 26 కేంద్రాలు కేటాయించారు. పిఠాపురం ప్రాజెక్టు పరిధిలో 25 కేంద్రాలు, రంగంపేట ప్రాజెక్టు పరిధిలో 7, సామర్లకోట ప్రాజెక్టు పరిధిలో 2, శంఖవరం ప్రాజెక్టు పరిధిలో 6, తాళ్లరేవు ప్రాజెక్టు పరిధిలో 9, తుని ప్రాజెక్టు పరిధిలో 23 కేంద్రాల్లో పనులు చేపట్టారు. ఇవి అందుబాటులోకి వస్తే చాలా వరకు అద్దె భారం తగ్గనుంది.

శంఖవరంలో నిర్మాణ దశలో..


పెంపు ఇలా...

అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త అద్దెలను నిర్దేశిస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గ్రామీణ ప్రాంతాలకు ఒక రేటు, పట్టణాలు, కార్పొరేషన్లకు వేర్వేరు ధరలను నిర్ణయించింది.


ఉత్తర్వులు అందాయి....

అంగన్‌వాడీ కేంద్రాల అద్దెలు పెంచుతూ ఉత్తర్వులు అందాయి. జిల్లాలో 1,107 కేంద్రాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. త్వరలోనే నిబంధనల ప్రకారం పెంచిన అద్దెలు చెల్లించేలా చర్యలు తీసుకుంటాం.

కొండా ప్రవీణ, పీడీ, ఐసీడీఎస్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని