logo

చోదక పరీక్ష... స్థలమే సమస్య

స్థల సమస్య కారణంగా శాశ్వత సైంటిఫిక్‌(శాస్త్రీయ) డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం జిల్లాలో అడుగు ముందుకు పడటంలేదు. రవాణా శాఖకు సొంత స్థలాలు లేకపోవడం సమస్యగా మారింది.

Published : 04 Feb 2023 05:25 IST

న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం (రాజమహేంద్రవరం)

తాత్కాలిక ఏర్పాట్లతో డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్న రాజానగరం సమీపంలోని స్థలం ఇదే

స్థల సమస్య కారణంగా శాశ్వత సైంటిఫిక్‌(శాస్త్రీయ) డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ల నిర్మాణం జిల్లాలో అడుగు ముందుకు పడటంలేదు. రవాణా శాఖకు సొంత స్థలాలు లేకపోవడం సమస్యగా మారింది. దీంతో ఏళ్ల తరబడి తాత్కాలిక, ప్రైవేటు స్థలాల్లో చోదకులకు డ్రైవింగ్‌ పరీక్షలు కొనసాగిస్తూ మమ అనిపించేస్తున్నారు.
జిల్లా రవాణా అధికారి(డీటీవో) కార్యాలయం పరిధిలో డ్రైవింగ్‌ లైసెన్సులు(డీఎల్‌) జారీకి ప్రస్తుతం రెండుచోట్ల వాహన చోదకులకు డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలోని పది మండలాలకు చెందిన చోదకులకు రాజానగరం వద్ద జిల్లా పరిషత్‌కు చెందిన స్థలంలో, కొవ్వూరు డివిజన్‌లో తొమ్మిది మండలాల్లోని చోదకులకు కొవ్వూరు రవాణా శాఖ యూనిట్‌ కార్యాలయం సమీపంలోని ఒక ప్రైవేటు స్థలంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసి డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు.  ఈ రెండు డివిజన్ల పరిధిలోని దరఖాస్తుదారులకు డ్రైవింగ్‌ లైసెన్సుల జారీకి ప్రస్తుతం ప్రతిరోజూ 145 మంది ఆన్‌లైన్‌లో స్లాట్‌లు ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రెండు డివిజన్లలో కలిపి ప్రస్తుతం రోజుకు 80 నుంచి 100 మంది చోదకులు డ్రైవింగ్‌ పరీక్షలకు హాజరవుతున్నట్లు రవాణా అధికారులు చెబుతున్నారు.

డివిజన్లలో ఇదీ పరిస్థితి...

రాజమహేంద్రవరం డివిజన్‌ పరిధిలోని దరఖాస్తుదారులకు డ్రైవింగ్‌ పరీక్షల నిమిత్తం గతంలోనే రాజానగరం వద్ద ఆరు ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించినప్పటికీ పూర్తిగా రవాణా శాఖకు అప్పగించకపోవడంతో తాత్కాలిక ట్రాక్‌ ఏర్పాట్లు చేసి డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తూ వచ్చారు. ఏడీబీ రోడ్డు విస్తరణ, అక్కడ పైవంతెన నిర్మాణం నిమిత్తం మూడేళ్ల కిందట మళ్లీ ఇక్కడి ఆరు ఎకరాల స్థలంలో రెండెకరాలను జిల్లా పరిషత్తు తీసుకుని ఆర్‌అండ్‌బీ శాఖకు అప్పగించింది. ఈ స్థలంలో ప్రస్తుతం తాత్కాలిక ఏర్పాట్లు చేసి డ్రైవింగ్‌ పరీక్షలను కొనసాగిస్తున్నప్పటికీ వర్షం వస్తే బురదగా మారడంతో ఇటు చోదకులు, అటు సిబ్బందికి ఇబ్బందులు పడక తప్పడంలేదు. ఈ స్థలాన్ని పూర్తిగా తమకు అప్పగిస్తే శాశ్వత సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ నిర్మాణ పనులు చేపడతామని ఇటీవల రవాణా అధికారులు కోరినప్పటికీ ప్రస్తుత అవసరాల దృష్ట్యా ఇవ్వడానికి కుదరదని సంబంధిత అధికారులు తేల్చి చెప్పడంతో ప్రత్యామ్నాయంగా స్థల సేకరణపై రవాణా అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

కొవ్వూరు డివిజన్‌లోనూ డ్రైవింగ్‌ పరీక్షలకు శాశ్వత శాస్త్రీయ ట్రాక్‌ నిర్మాణానికి ఇబ్బందులు తప్పడంలేదు. అక్కడి రవాణా యూనిట్‌ కార్యాలయం సమీపంలోని ప్రైవేటు స్థలంలో ప్రస్తుతం డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహిస్తుండగా శాశ్వత టెస్టింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి స్థలం కోసం అన్వేషిస్తున్నారు.


స్థలాల సేకరణకు ప్రయత్నాలు

కె.ఎస్‌.ఎం.వి.కృష్ణారావు, జిల్లా రవాణా అధికారి

శాశ్వత సైంటిఫిక్‌ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ల నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్న మాట వాస్తవమే. ప్రస్తుతం డ్రైవింగ్‌ పరీక్షలు కొనసాగిస్తున్న రాజానగరం వద్ద ఉన్న నాలుగు ఎకరాలను రవాణా శాఖకు కేటాయించాలని అడిగాం. ఇచ్చే పరిస్థితి లేకుంటే ప్రత్యామ్నాయంగా సమీపంలోనే అయిదెకరాల స్థలాన్ని సేకరించడంపై దృష్టి సారించాం. కొవ్వూరులోనూ డ్రైవింగ్‌ టెస్టింగ్‌ ట్రాక్‌ నిర్మాణానికి ప్రభుత్వ స్థలాన్ని అడుగుతున్నాం. అంశాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకెళ్లాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని