logo

అన్నవరం అభివృద్ధికి చర్యలు ఇలా..

అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు సులభతర దర్శనం, సేవలు అందించేందుకు వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణకు ఈవో ఆజాద్‌ తెలిపారు.

Published : 10 Jun 2023 04:14 IST

కమిషనర్‌కు ఈవో నివేదిక

అన్నవరం దేవస్థానం

అన్నవరం, న్యూస్‌టుడే: అన్నవరం సత్యదేవుని దర్శనానికి వచ్చే భక్తులకు సులభతర దర్శనం, సేవలు అందించేందుకు వివిధ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు దేవాదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణకు ఈవో ఆజాద్‌ తెలిపారు. దేవస్థానంలో చేపట్టిన అభివృద్ధి పనులపై సంబంధిత ఇంజినీరింగ్‌ అధికారులు, వేద పండితులు, అర్చకులతో విజయవాడలో కమిషనర్‌ గురువారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఇక్కడి అభివృద్ధి కార్యక్రమాలపై ఈవో ఒక నివేదిక అందజేశారు. శుక్రవారం ఇక్కడ ‘న్యూస్‌టుడే’కు ఆ వివరాలు వెల్లడించారు.  

మూడో ఘాట్‌ రోడ్డు : ట్రాఫిక్‌  నియంత్రణకు సత్యగిరి నుంచి నేరుగా కొండ దిగువకు వెళ్లే విధంగా మూడో ఘాట్‌ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టారు. ఈ రోడ్డును గిరి ప్రదక్షిణ రోడ్డుకు అనుసంధానం చేయడం వల్ల విజయవాడ, విశాఖపట్నం మార్గాల్లో వెళ్లే భక్తులకు సౌకర్యంగా ఉంటుంది.

ప్లాస్టిక్‌ నిషేధం: జులై 1 నుంచి తిరుమల తరహాలో అన్నవరంలోనూ ప్లాస్టిక్‌ నీళ్ల సీసాలు నిషేధించి ప్రత్యామ్నాయంగా గాజు లేదా స్టీలు సీసాలు వాడేవిధంగా చర్యలు చేపడుతున్నారు.  

* పడమటి రాజగోపురం వద్ద గైడ్ల దందా, దళారీ వ్యవస్థ నిరోధానికి చర్యలు చేపట్టారు.

* భక్తులకు నాణ్యమైన సత్యదేవుని గోధుమ నూక ప్రసాదం అందజేస్తారు.

* దేవస్థానానికి చెందిన 66 ఎకరాల ఖాళీ భూమిలో మారేడు, జమ్మి మొక్కలు నాటే ప్రణాళిక అమలు చేస్తున్నారు.

* జాతీయ రహదారిపై నమూనా ఆలయం: జాతీయ రహదారిపై దేవస్థానానికి చెందిన 4.80 ఎకరాల భూమిలో ఆక్రమణలు తొలగించి అక్కడ నమూనా ఆలయం, ప్రసాద విక్రయ కేంద్రం, దుకాణాలు, మరుగుదొడ్లు, పార్కింగ్‌ ఏర్పాటుకు రూ.4.67 కోట్ల వ్యయం కాగల పనులకు టెండర్లు పిలిచారు.

* రోడ్డు, రైలు మార్గాల్లో అన్నవరం మీదుగా ప్రయాణించే సమయంలో భక్తులకు కనువిందు చేసేలా రత్నగిరిపై శంఖు, చక్ర, నామాలను సుమారు రూ.70 లక్షలతో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక సిద్ధమైంది.  

ఏకగవాక్ష విధానం : సత్యదేవుని సన్నిధిలో వివాహాలు, ఉపనయనాలు, ఇతర శుభకార్యాలకు భక్తుల సౌకర్యార్థం ఏకగవాక్ష విధానం అమల్లోకి తెస్తున్నారు.  భక్తులకు మండపాలు, వసతి గదులు భజంత్రీలు, పురోహితులు, పందిళ్ల్లు, భోజనాలు తదితరాలన్నీ దేవస్థానమే గుత్తేదార్ల ద్వారా ఏర్పాటు చేయించడానికి చర్యలు చేపట్టారు.

రత్నగిరిపై ప్రతిపాదించిన శంఖు, చక్ర, నామాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని