logo

జగన్‌ మాటిస్తే.. నీటి మూటే!

సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్‌ నొక్కారు.

Published : 24 Apr 2024 07:01 IST

మిగ్‌జాం పరిహారంపై వైకాపా సర్కారు పరిహాసం
ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, ముమ్మిడివరం

వరిచేలో పనలు తేలుతూ ఇలా..

‘‘రైతులను అన్నివిధాలా ఆదుకుంటున్న ప్రభుత్వం మాది. విపత్తుల సమయంలో రైతులు పండించిన పంటలకు నష్టం వాటిల్లితే తరువాత పంట వేయడానికి ముందే పెట్టుబడి రాయితీ అందిస్తాం. మిగ్‌జాం తుపాను వల్ల పంట నష్టపోయిన రైతులకు సంక్రాంతికి ముందే పెట్టుబడి సాయం అందిస్తాం.’’

-ముఖ్యమంత్రి జగన్‌


సీఎం చెప్పిన మాట ప్రకారం సంక్రాంతి వెళ్లిపోయింది.. ఉగాది దాటేసింది. ఇవేవీ ప్రభుత్వానికి గుర్తులేకపోయినా ఎన్నికల నగారా మోగుతుందనే విషయం జ్ఞప్తికి వచ్చింది. ఖజానాలో కాసులు లేకున్నా రైతులకు తుపాను పరిహారం అంటూ హడావుడిగా మార్చి 6న బటన్‌ నొక్కారు. అరకొర మినహాయిస్తే సింహభాగం రైతుల ఖాతాల్లో ఇంతవరకు నగదు జమకాలేదు. ఖరీఫ్‌లో తుపాను నష్టాలు మిగల్చడంతో రబీ సాగు పెట్టుబడికి డబ్బులు లేక అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన దుస్థితి కర్షకులది. జగన్‌ దృష్టిలో రైతులకు అండగా ఉంటానంటే.. అప్పులపాల్జేయడమేనా.. ఇదేనా మాపై చూపించే ప్రేమ.. అంటూ రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

చేతికందిన పంట నీటి పాలు

రైతులకు అండగా ఉండేందుకు ఆర్బీకేలు ఏర్పాటు చేశామని సీఎం మొదలుకుని.. వైకాపా గల్లీస్థాయి నాయకుడి వరకు ఢంకా కొట్టి చెప్పారు. విపత్తుల సమయంలో వీటివల్ల ఒనగూరింది లేదు. పంట చేతికొచ్చిన సమయంలో మిగ్‌జాం తుపానుతో పూర్తిగా నీట మునిగి నష్టాలు మిగిల్చింది. వరి..ఉద్యాన పంటలైన అరటి, కూరగాయలు, బొప్పాయి, పసుపు, పూలతోటలు, తమలపాకులు, పొగాకు సైతం తీవ్రంగా దెబ్బతిన్నాయి. సకాలంలో నష్టపరిహారం(పెట్టుబడి రాయితీ) ఇచ్చి ప్రభుత్వం ఆదరవుగా నిలుస్తారనుకుంటే అదీ లేకపోయింది.


సాయం అందలేదు..
 -నీరుకొండ వివేకానంద, తాళ్లపూడి మండలం

అయిదెకరాలు సాగు చేశా. అందులో కౌలుకు తీసుకున్న నాలుగెకరాలు తుపానుకు పోయింది. ఎకరాకు రూ.20 వేలు కౌలు, రూ.30 వేల చొప్పున పెట్టుబడి పెట్టా. రూ.5 వేలు కూడా రాలేదు. ప్రభుత్వం ఎటువంటి సాయం చేయలేదు. దాళ్వాలో పెట్టుబడి పెట్టలేక ఎకరా మాత్రమే సాగు చేశాం.

ముంపుతో పంట నష్టపోయిన రైతులు, సీఎం జగన్‌ బటన్‌ నొక్కినా ఖాతాల్లో జమవ్వని పెట్టుబడి సాయం ఒక్కసారి పరిశీలిస్తే..

  • జిల్లా: తూర్పు వరి(హెక్టార్లలో): 10,487.02
  • నష్టపోయిన రైతులు: 15,615
  • రావాల్సిన పెట్టుబడి సాయం(రూ.కోట్లలో): 14.81
  • ఉద్యాన పంటలు(హెక్టార్లలో): 1367.47
  • నష్టపోయిన రైతులు: 2,925
  • రావాల్సిన పెట్టుబడి సాయం: 3.02 కోట్లు
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని