logo

బిల్లు.. ఇల్లు ఘొల్లు

గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లింపులో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా కక్ష పూరితంగా వ్యవహరించింది.

Published : 01 May 2024 04:43 IST

తెదేపా హయాంలో గృహాలు మంజూరు
పైౖసా విదల్చని వైకాపా ప్రభుత్వం

తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ ఇంటికీ ఇప్పటికీ బిల్లులివ్వలేదు

 న్యూస్‌టుడే, కాకినాడ నగరం : గత తెదేపా ప్రభుత్వ హయాంలో ఎన్నికల ముందు మంజూరైన గృహాలకు బిల్లుల చెల్లింపులో అనంతరం అధికారంలోకి వచ్చిన వైకాపా కక్ష పూరితంగా వ్యవహరించింది. గృహ రుణాలు మంజూరు కావడంతో అప్పట్లో అప్పులు చేసి నిర్మాణాలు తలపెట్టుకున్నారు. ఇందులో కొన్ని పూర్తికాగా, మరికొన్ని వివిధ దశలకు చేరుకుని అసంపూర్తిగా మిలిగిపోయాయి. ఈలోపు ప్రభుత్వం మారడంతో ఆ గృహాలకు నిధుల విడుదల ఆగిపోయింది. దీంతో అయిదేళ్లుగా లబ్ధిదారులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ కాళ్లేరిగేలా తిరుగుతూనే ఉన్నారు.

వైకాపా వచ్చాక ఆశలు గల్లంతు..

2019 ఎన్నికల ముందు తెదేపా ప్రభుత్వం పేదలకు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకునేందుకు గృహ రుణాలను మంజూరు చేసింది. ఎన్టీఆర్‌ అర్బన్‌, ఎన్టీఆర్‌ గ్రామీణ్‌ పథకాల కింద వీటిని చేపట్టారు.  పట్టణాల్లో రూ.2.50 లక్షలు, గ్రామాల్లో రూ.2 లక్షల చొప్పున గృహ రుణాలను మంజూరు చేశారు. అందులో భాగంగా కాకినాడ జిల్లా పరిధిలో పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కలిపి 15,795 ఇళ్లు  మంజూరయ్యాయి. గృహ రుణాలు మంజూరై పునాదులు మొదలెట్టిన నిర్మాణాలకు ముందుగా లబ్ధిదార్ల ఖాతాలకు ఒక్కో రూపాయి చొప్పున జమ అయ్యాయి. ఆర్థిక సాయం అందుతుందని నిర్ధారించుకున్న  లబ్ధిదార్లు అప్పులు చేసి మరీ నిర్మాణాలు ప్రారంభించారు. కాస్తోకూస్తో స్తోమత ఉన్నవారు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేశారు. మిగతా వారిలో కొందరు పునాదుల వరకు, మరికొందరు గుమ్మాల ఎత్తు వరకు, ఇంకొందరు లింటల్‌ స్థాయి వరకు నిర్మాణాలు చేపట్టారు. తక్కువ మంది పనులు మొదలుపెట్టకుండా ఆగిపోయారు. ఈ లోపు ప్రభుత్వ మారడంతో గృహ లబ్ధిదార్ల సొంతింటి కల కలగానే మిగిలిపోయింది. గత తెదేపా ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు వైకాపా ప్రభుత్వం నిధుల మంజూరును నిలుపుదల చేసింది.

ఊరించారు.. ఉసూరుమనిపించారు..

ఏడాది కిందట గడపడగపకు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లిన ఎమ్మెల్యేలకు పాత గృహ లబ్ధిదార్ల నుంచి పెద్దఎత్తున వినతిపత్రాలు వచ్చాయి. కొన్నిచోట్ల ఎమ్మెల్యేలను నిలదీయడం.. తమ గోడును వారికి వెళ్లగక్కడం జరిగింది. దీంతో గృహ నిర్మాణ సమీక్షలో కొందరు ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణాలు తలపెట్టిన లబ్ధిదార్లకు బకాయిలు చెల్లించాలని కోరారు. దీనిపై స్పందించిన సీఎం వారికి ఎంతో కొంత సాయం చేద్దామన్నట్లు గృహనిర్మాణ శాఖ ఉన్నతాధికారుల ద్వారా ప్రకటన ఇప్పించారు. అనంతరం దాని ఊసే మరిచారు.


అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాం..

ఎన్టీఆర్‌ అర్బన్‌ గృహ నిర్మాణం కింద సొంత స్థలంలో ఇల్లు నిర్మాణానికి గత ప్రభుత్వంలో రుణం మంజూరైంది. పునాది పనులు పూర్తి కాగానే బ్యాంకు ఖాతాలో రూ.1 జమ చేశారు. ఈ లోపు సొంత డబ్బులతో పనులు పూర్తి చేసుకున్నాం. ఈ లోపు ప్రభుత్వం మారిపోయింది. అయినా ధీమాతో పనులు పూర్తిచేసుకున్నాం. ప్రభుత్వం మారితే బల్లులు నిలుపుదల చేయడం ఏమిటి? పేదలను ఇబ్బంది పెట్టటం తగదు.

కొవ్వూరు అయ్యమ్మ, దుమ్ములపేట


ఒక బిల్లు మాత్రమే మంజూరు..

గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ అర్బన్‌ గృహ నిర్మాణ పథకం కింద మా అక్క, నేను ఉమ్మడిగా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నాం. మా అక్క పేరిట ఇంటికి ముందుగా బాగానే బిల్లు మంజూరైంది. నా పేరిట ఎన్నికల ముందు గృహ రుణం మంజూరైంది. రూపాయి జమ చేశారు.  ఆ ధీమాతో ఇంటి నిర్మాణాన్ని పూర్తిచేసుకున్నాం. ఇప్పటికీ పైసా బిల్లు రాలేదు.

ఎరిపిల్లి నూకరాజు, శ్రీరామసెంటర్‌, కాకినాడ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని