logo

ఇచ్చినవే అమలుకాక.. కొత్తవి గుప్పించలేక..

ముఖ్యమంత్రి జగన్‌ హామీలిచ్చి మడమ తిప్పేయడంలో ఆరితేరారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా గతంలో చేసిన బాసలు సైతం విస్మరించి మరికొన్ని ప్రకటించి వెళ్లిపోయేవారు.

Updated : 01 May 2024 05:43 IST

 హామీలు, సమస్యల జోలికి వెళ్లని ముఖ్యమంత్రి
 తాజా పర్యటనలపై సొంత పార్టీలోనే పెదవి విరుపు

ఈనాడు, రాజమహేంద్రవరం: ముఖ్యమంత్రి జగన్‌ హామీలిచ్చి మడమ తిప్పేయడంలో ఆరితేరారు. జిల్లాకు వచ్చినప్పుడల్లా గతంలో చేసిన బాసలు సైతం విస్మరించి మరికొన్ని ప్రకటించి వెళ్లిపోయేవారు. ఈసారి సిద్ధం పేరిట కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం వచ్చినపుడు చేతులు ఊపేందుకు పరిమితమవగా సోమవారం పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేటలో నిర్వహించిన సభలో ప్రతిపక్షాలను విమర్శించి వెళ్లిపోయారు. ఇది ఆ పార్టీ నేతలను సైతం నైరాశ్యంలోకి నెట్టేసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల తరువాత సీఎం రెండు దఫాలు ఉమ్మడి జిల్లాలో పర్యటించారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సమయంలో ప్రజల నుంచి స్పందన లేక జనసమీకరణకు స్థానిక అభ్యర్థులు ఆపసోపాలు పడ్డారు. కొత్తపేట నియోజకవర్గం పరిధిలో మనిషికి రూ.200, వాహన పెట్రోలుకు రూ.200 కూపన్‌.. రాజమహేంద్రవరం గ్రామీణం, నగరం పరిధిలో ఒక్కొక్కరికి రూ.200 ఇచ్చారు. కాకినాడ సభకూ అదే పరిస్థితి. బస్సు యాత్రలో సైగలతో సరిపెట్టిన జగన్‌.. కాకినాడ సభలో కేవలం మ్యానిఫెస్టోలోని అంశాలు వివరిస్తూ ప్రజలను ఓటర్లుగానే చూశారు. జిల్లాలోని ప్రధాన సమస్యలు, గతంలో ఇచ్చిన హామీలు ప్రస్తావించలేదు.

కొబ్బరి ఊసెత్తలేదు

గత అయిదేళ్లలో వరదలు, మత్స్యకార దినోత్సవం, నాడునేడు రెండో దశ ప్రారంభం తదితర సందర్భాల్లో కోనసీమలో పర్యటించిన ఆయన రూ.వందల కోట్ల పనులకు శంకుస్థాపనలు చేసినా ఒక్కటీ పూర్తవలేదు. కొబ్బరి కార్మికుల కష్టాలు, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంపై గతంలో మొసలి కన్నీరు కార్చిన జగన్‌.. ప్రభుత్వం ఏర్పడిన తరువాత పట్టించుకోలేదు. కొబ్బరి పరిశోధనా కేంద్రం ఉన్న అంబాజీపేటలో సోమవారం కొబ్బరి గురించే మాట్లాడలేదు. స్పందన లేక ఉపాధి కూలీలతో అర్ధగంట పనిచేయించి, మస్తరు వేసి ఆటోల్లో తీసుకొచ్చేశారు. వాహనాలకు రూ.200 వరకు పెట్రోల్‌ కూపన్లు ఇచ్చారు. 80 మీటర్ల పొడవున్న రోడ్డునే వేదికగా చేసుకుని జనంతో నింపేందుకు పాట్లు పడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని