logo

వరద బాధితులకు కుచ్చుటోపీ

‘‘2022 జులై 26న గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలైన ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు.

Published : 05 May 2024 03:56 IST

పక్కా ఇళ్లు మంజూరుకాక లబ్ధిదారుల విలవిల

‘‘2022 జులై 26న గోదావరి వరదల సమయంలో లంక గ్రామాలైన ఊడిమూడిలంక, జి.పెదపూడిలంక, అరిగెలవారిపేట, బూరుగులంక గ్రామాల్లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పర్యటించారు. ఆ సమయంలో వరదలు, అధిక వర్షాలకు దెబ్బతిన్న ఇళ్లస్థానే పక్కాఇళ్లు నిర్మిస్తామని వీటిని వెంటనే మంజూరు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. ఆ హామీ మాటలకే పరిమితమైంది.’’

పి.గన్నవరం, న్యూస్‌టుడే

లంకల గన్నవరంలో పునాదిదశలో నిలిచిపోయిన గృహనిర్మాణం

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వరద బాధితులకు కుచ్చుటోపీపెట్టారు. ఆయన ఇచ్చిన హామీల పరంపరంలో నమ్మి తీరా అమలు కాకపోవటంతో లబోదిబోమంటున్నవారిలో గోదావరి వరద బాధితులుకూడా ఉన్నారు. 2022 గోదావరి ఉద్ధృతి వరదలు, అధిక వర్షాలకు అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో పలువురి పూరిళ్లు నేలమట్టం అయ్యాయి. పక్కా ఇళ్లు కట్టి ఇస్తామని ముఖ్యమంత్రి హామీ ఇవ్వటంతో నిజమని నమ్మిన అనేకమంది పేదలు పడిపోయిన పూరిళ్లను తొలగించి పునాదులు వేసుకుని... అరకొరగా పక్కాఇళ్లు నిర్మించుకున్నారు. తీరా బిల్లులకోసం ఎదురుచూస్తుంటే ఇంకా మంజూరుకాలేదనే సమాధానం హౌసింగ్‌ అధికారుల నుంచి రావటంతో వారు లబోదిబోమంటున్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాలమేరకు దిగువస్థాయి హౌసింగ్‌ అధికారులు జిల్లాలో నియోజకవర్గాలవారీ ఇళ్లు మంజూరు చేయాల్సిన వారి వివరాలను పంపి అపుడే 20 నెలలు కావస్తున్నా నేటికీ అతీగతీలేకుండా పోయింది. జిల్లావ్యాప్తంగా ఈ బాపతు బాధితులు 1802 మంది వరకు ఉన్నారు. ఒక్క పి.గన్నవరం నియోజకవర్గంలో సుమారు 400 మంది ఉన్నారు. వీరు పక్కాఇళ్లనిర్మాణాలు మొదలుపెట్టి బిల్లులకోసం ఎదురు చూస్తున్నారు. బిల్లులకోసం ఈ బాధితులు హౌసింగ్‌ అధికారులను అడుగుతుంటే ఇంకా మంజూరు కాలేదని వారు సమాధానం చెబుతున్నారు.

ముఖ్యమంత్రి మాట నమ్మి...

ముఖ్యమంత్రి హామీ నేపధ్యంలో తప్పకుండా మంజూరు ఉత్వర్వులు వస్తాయి ఈ లోగా నిర్మాణాలు మొదలుపెట్టుకోవాలని హౌసింగ్‌ అధికారులు బాధితులకు చెప్పటంతో వారు ఇళ్ల నిర్మాణాలు మొదలు పెట్టారు. కొంతమంది ఆర్థికస్థోమత లేక పునాదుల దశలోనే ఆపేశారు. ఎక్కువమంది అప్పోసొప్పోచేసి శ్లాబులువేసుకుని అసంపూర్ణంగా ఉన్నఇళ్లలోకి ప్రవేశించి నివాసం ఉంటున్నారు. బిల్లులు వస్తే గుమ్మాలు, కిటికీలు పెట్టుకుంటామని... అప్పుచేసిన డబ్బులు తీర్చుకుంటామని పాపం ఈ బాధితులు వాపోవుతున్నారు. ఇలాంటివారిపట్ల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి  కనికరం లేకుండా వ్యవహరించడం బాధాకరం.


వరదకు కూలిపోయింది

గోదావరి వరదలకు మా పూరిల్లు కూలిపోయింది. పక్కా ఇల్లు మంజూరుచేస్తామని అధికారులు చెప్పడంతో ఇంటి నిర్మాణం మొదలు పెట్టాం. ఇది జరిగి 20 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఒక్క బిల్లుకూడా ఇవ్వలేదు. అప్పులు చేసి ఇంటి నిర్మాణం పూర్తిచేశాం. ఇంకా చాలా పనులు మిగిలి ఉన్నాయి. ప్రభుత్వం పక్కాఇల్లు మంజూరు చేస్తుందని ఎదురు చూస్తున్నాం.

నక్కా రామలక్ష్మి, కందాలపాలెం


నేటికీ బిల్లు ఇవ్వలేదు

మాది పూర్తిగా గోదావరివరద తాకిడి గ్రామం. 2022 వరదలకు పూరిల్లు దెబ్బతింది. వరద బాధితులకు పక్కాఇల్లు మంజూరు చేస్తామని చెప్పడంతో అప్పులుచేసి నిర్మాణం మొదలుపెట్టాం. తీరా నేటికీ బిల్లురాలేదు. ఇంటి నిర్మాణం సగం వరకు పూర్తయ్యింది. అలాంటి ఇంటిలోనే ఉంటున్నాం. హౌసింగ్‌ అధికారులను అడుగుతుంటే ఇంకా మంజూరు కాలేదని చెబుతున్నారు. ఎన్నికలు కూడా వచ్చేశాయి. ఇంకెపుడు మంజూరు చేస్తారు.

బద్దే వెంకటరమణ, గుడ్డాయిలంక

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని