logo

భరోసాకు విలువలేదు.. బరకమూ ఇవ్వలేదు..

మాది రైతు ప్రభుత్వం. వారికి అన్ని విధాలుగా మేలు చేసేందుకే రైతు భరోసా కేంద్రాలు తెస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు తదితర అన్ని రకాల సేవలు అందిస్తాం.

Published : 08 May 2024 06:41 IST

అన్నదాతను ఆదుకోలేని జగన్‌

ముమ్మిడివరంలో ధాన్యం రాశి చేసేందుకు కర్షకుల తిప్పలు

మాది రైతు ప్రభుత్వం. వారికి అన్ని విధాలుగా మేలు చేసేందుకే రైతు భరోసా కేంద్రాలు తెస్తున్నాం. ఎరువులు, పురుగుమందులు తదితర అన్ని రకాల సేవలు అందిస్తాం.

ప్రతి సందర్భంలోనూ కర్షకులను ఆకర్షించేలా సీఎం జగన్‌ చెప్పే మాటలివి.

అన్నదాత ప్రశ్న.. మిగిలిన సేవలమాటెలా ఉన్నా.. తుపానులు తదితర విపత్తుల సమయంలో ధాన్యం రాశులను రక్షించుకునేందుకు బరకాలెందుకు ఇవ్వడం లేదు.న్యూస్‌టుడే, ముమ్మిడివరం, అమలాపురం

డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో రబీ సీజన్‌లో 1.84 లక్షల ఎకరాల్లో వరి సాగు చేపట్టగా.. సుమారు 80శాతం కోతలు పూర్తయ్యాయి. చేతికొచ్చిన పంటను మాసూళ్లు చేసుకుని కళ్లంలో ఆరబెట్టుకుంటున్న తరుణంలో వాతావరణంలో మార్పు అన్నదాతల గుండెల్లో గుబులు రేపుతోంది. మంగళవారం జిల్లాలో కురుసిన అకాల వర్షాలకు  మిగ్‌జాం నష్టం తలచుకుని కర్షకులు భయాందోళనకు గురవుతున్నారు.

ఐదేళ్లుగా ఒక్కటిస్తే ఒట్టు..

విపత్తుల సమయంలో రైతులు పండించిన పంటలు గట్టుకు వచ్చినా.. ధాన్యం రాశులపై కప్పడానికి బరకాలు అవసరం. తెదేపా హయాంలో 50 శాతం రాయితీపై సుమారు 40 వేలకుపైగా బరకాలు అందించారు. వైకాపా సర్కారు నిలిపేసింది. దీంతో రైతులు రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు వెచ్చించి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

రైతులను మభ్యపెట్టే ప్రయత్నం..

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చి 6న ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మిగ్‌జాం తుపాను కారణంగా నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీని విడుదల చేయడానికి బటన్‌ నొక్కారు. రైతుల ఖాతాలకు నగదు మాత్రం వేయలేదు. ఇప్పుడు ఈసీ అడ్డుచెప్పడంతో ఏదో ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నట్లుగా ముఖ్యమంత్రి గగ్గోలుపెట్టడం విడ్డూరం. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు సంబంధించి 21,008 ఎకరాల్లో 19,849 మంది రైతులకు రూ.17.85 కోట్ల నష్టం వాటిల్లింది. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 1162.843 హెక్టార్లలో 3530 మంది రైతులకు రూ.2,39,69,411 పెట్టుబడి రాయితీని విడుదల చేశారు. సంక్రాంతి నాటికి రైతులకు పంట నష్టపరిహారం అందిస్తామని గొప్పలు చెప్పిన జగన్‌.. ఎన్నికల ముందు బటన్‌ నొక్కి రైతులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు.

ఖరీఫ్‌ సీజన్‌లో భారీ నష్టం..

ఖరీఫ్‌ సీజన్‌లోనూ రైతన్నలకు ఇదే పరిస్థితి తలెత్తింది. మిగ్‌జాం తుపాను ప్రభావంతో వరి చేలు నేలకొరిగి ముంపు బారినపడడంతో ధాన్యం మొలకలు వచ్చి రైతులు వాటిని అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడ్డారు. రైతుభరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా.. వర్షానికి తడిచిన ధాన్యం కొనడానికి సవాలక్ష కొర్రీలు పెట్టారు. చివరకు దళారులకు అయినకాడికి అమ్ముకోవాల్సిన దుస్థితి వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని