Andhra news: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రెండ్రోజుల పాటు ఏపీలో వర్షాలు: వాతావరణశాఖ

బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు.

Published : 23 May 2024 20:11 IST

అమరావతి: బంగాళాఖాతంలో అల్పపీడనం క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు. శుక్రవారం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతోందని వాతావరణ విభాగం తెలిపింది. ఈ నెల 26 తేదీ సాయంత్రానికి అది మరింత బలపడి తుపానుగా మారుతుందని స్పష్టం చేసింది. ఈశాన్యంగా కదులుతూ మధ్య బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నప్పటికీ దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ముప్పేమీ లేదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. శుక్రవారం నాటికి వాయుగుండంగా మారనున్న బలమైన అల్పపీడనం కారణంగా రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర తీర ప్రాంత జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. 

బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన దృష్ట్యా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లాలతోపాటు కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, సత్యసాయి జిల్లాల్లో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం, అనకాపల్లి, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని