logo

నివురుగప్పిన నిప్పులా విభేదాలు

పల్నాడు పల్లెల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షనిజం కోరలు చాస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యాక్షనిజంతో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. రాజకీయ ఆధిపత్యం సాగుతున్న మాచర్ల, గురజాల నియోజకవర్గాల

Published : 15 Jan 2022 00:57 IST

పల్నాడులో కోరలు చాస్తున్న ఫ్యాక్షనిజం

మాచర్ల, న్యూస్‌టుడే: పల్నాడు పల్లెల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న ఫ్యాక్షనిజం కోరలు చాస్తోంది. దీంతో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఒక్కప్పుడు ఫ్యాక్షనిజంతో గ్రామాలకు గ్రామాలే తుడిచి పెట్టుకుపోయాయి. రాజకీయ ఆధిపత్యం సాగుతున్న మాచర్ల, గురజాల నియోజకవర్గాల పరిధిలో ప్రస్తుతం పట్టపగలు జరుగుతున్న దాడులు భీతిగొల్పుతున్నాయి. మాచర్లలో గతంలో బుద్దా వెంకన్న, బోండా ఉమాపై జరిగిన దాడి తర్వాత అనేక సంఘటనలు పల్నాడులో చోటుచేసుకున్నాయి. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, దాచేపల్లి, మాచవరం మండలాలతోపాటు, పలుచోట్ల పగలే దాడులు జరగడం గమనార్హం. తెదేపాతోపాటు, వైకాపాలో ఉన్న ఆధిపత్య విభేదాలు హత్యలకు దారితీస్తున్నాయి. దుర్గి మండలం ఆత్మకూరు, జంగమహేశ్వరపాడులో 2019 ఎన్నికల తర్వాత తెదేపాకు చెందిన పలువురు గ్రామాలను వదిలివెళ్లారు. ఇప్పటికీ జంగమహేశ్వరపాడులో చాలా గృహాలకు తాళాలు వేసి ఉంటున్నాయి. పోలీసుల పహారా కొనసాగుతోంది. వెల్దుర్తి మండలం కొత్తపుల్లారెడ్డి గూడెంలో వైకాపాలో చేరిన తెదేపా నాయకులకు, వైకాపాలో ఎప్పటి నుంచో ఉంటున్న నేతల మధ్య ఆధిపత్య పోరు వివాదం రెండు హత్యలు, గృహ దహనాలకు దారితీసింది. తాజాగా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో తెదేపా నేత చంద్రయ్య హత్య జరిగింది. 
ఆధిపత్యం కోసం..
మాచర్ల, న్యూస్‌టుడే: జిల్లాలో సమస్యాత్మక ప్రాంతాలు పల్నాడులోనే అధికం. ఆధిపత్యం కోసం దాడులు, ప్రతిదాడులు చేసుకోవడం ఇక్కడ పరిపాటైంది. అధికార పార్టీ నేతలు ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో పెత్తనం చేసేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఈ పరిస్థితుల్లో పల్నాడులోని పోలీస్‌స్టేషన్లలో విధులు నిర్వహించేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదు. గురజాల డివిజన్‌ పరిధి మాచర్ల, గురజాల నియోజకవర్గాలోని తొమ్మిది మండలాల్లోని  పోలీస్‌స్టేషన్లలో పలు గ్రామాలు సమస్యాత్మకంగానే ఉన్నాయి. ప్రతికార దాడులు పట్టపగలే జరుగుతుండటం, వీటిపై పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో నేరాల సంఖ్య పెరుగుతోంది. సంఘటన జరిగే ప్రాంతాలు పోలీస్‌స్టేషన్లకు సమీపంలోనే ఉంటున్నా, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు వివాదాలకు కారణమవుతోంది. సమస్యాత్మక ప్రాంతాల్లో ఉన్న స్టేషన్లలో సిబ్బంది కొరత ఉంటోంది. మాచర్ల పోలీస్‌స్టేషన్‌ పరిశీలిస్తే సీఐతోపాటు, నలుగురు ఎస్సైలు ఉండాలి. ప్రస్తుతం ఇద్దరు మహిళా ఎస్సైలు, ఒకరు పదోన్నతిపై వచ్చిన ఎస్సై ఉన్నారు. ఇక్కడ బదిలీపై వెళ్లిన ఎస్సై స్థానంలో ఇంతవరకు మరొకరిని  నియమించలేదు. ఇక వెల్దుర్తి మండలం నియోజకవర్గానికి చాలా కీలకం. ఇక్కడ సున్నితగ్రామాలు చాలా ఉన్నాయి. నాలుగు నెలలుగా ఈ మండలం చూసే ఎస్సై లేకపోవడం గమనార్హం.  

నిఘా నీడలో గుండ్లపాడు 
తెదేపా నేత తోట చంద్రయ్య(42) హత్య జరిగిన వెల్దుర్తి మండలం గుండ్లపాడులో పోలీసులు భద్రతా విధులు నిర్వహిస్తున్నారు. గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులకు అవకాశం లేకుండా పోలీసు బలగాలు మోహరించాయి. వీధుల వెంట పోలీసులు తిరుగుతూ జనం గుమిగూడకుండా పంపిస్తున్నారు. తెదేపా, వైకాపా నాయకుల నివాసాలు వద్ద భద్రతా ఏర్పాట్లు చేశారు.


గుండ్లపాడులో మకాం వేసిన పోలీసు బలగాలు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని