logo

చిన్న ఆసుపత్రుల సమస్యలు పరిష్కరించాలి

రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం మందికి అత్యంత చౌకగా అందుబాటులో వైద్యం చేస్తున్న చిన్న ఆసుపత్రులపై ప్రభుత్వం దృష్టిసారించి, వారి సమస్యలను పరిష్కరించాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సి.శ్రీనివాసరాజు పేర్కొన్నారు.

Published : 26 Sep 2022 06:11 IST

మాట్లాడుతున్న ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీనివాసరాజు

చీరాల పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రవ్యాప్తంగా 80 శాతం మందికి అత్యంత చౌకగా అందుబాటులో వైద్యం చేస్తున్న చిన్న ఆసుపత్రులపై ప్రభుత్వం దృష్టిసారించి, వారి సమస్యలను పరిష్కరించాలని ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ సి.శ్రీనివాసరాజు పేర్కొన్నారు. ఆదివారం చీరాల ఐఎంఏ శాఖను ఆయన, నాయకులు సందర్శించారు. తొలుత వైద్యులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలోని ఐఎంఏ హాలులో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాసరాజు మాట్లాడారు. కార్పొరేట్‌ ఆసుపత్రులకు నిబంధనల పేరుతో వసూలు చేస్తున్న పన్నులు, యూజర్‌ ఛార్జీలను చిన్న ఆసుపత్రులకు మినహాయించి, వాటిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రులపై దాడులు జరుగుతున్నాయని, వీటిని కట్టడి చేసేందుకు దృష్టిసారించాలని చెప్పారు. పోలీసులు ఇటువంటి ఘటనలకు పాల్పడుతున్న వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వీటితోపాటు కొన్ని సెక్షన్ల పేరుతో వైద్యులను పోలీస్‌స్టేషన్‌లకు రమ్మని పిలుస్తున్నారని, ఇది చాలా దారుణమన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఒక వైద్యుడిని అరెస్టు చేయాలంటే మొదటగా మెడికల్‌ హెల్త్‌ కోర్టులో అప్లై చేసిన తరువాత మాత్రమే అరెస్టు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేయడంతో పాటు వైద్యులకు ఐఎంఏ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఐఎంఏ రాష్ట్ర్ర సంయుక్త కార్యదర్శి జి.నందకిషోర్‌, ఐఎంఏ రాష్ట్ర ఫైనాన్స్‌ సెక్రటరీ ఎం.సుభాష్‌చంద్రబోస్‌, చీరాల అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్‌ అన్నె భవానీప్రసాద్‌, పి.శ్రీకాంత్‌, వైద్యులు ముద్దన నాగేశ్వరరావు, పోలవరపు వెంకటేశ్వరప్రసాద్‌, సైదుల చౌదరి, గోరంట్ల సుబ్బారావు, ఉమామహేశ్వరరావు, పీవీ ప్రసాద్‌, పుల్లారావు రవికిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని