logo

డిసెంబరులో... గృహ ప్రవేశాలెలా?

పట్టణాల్లోని పేదోళ్లకు సొంతిల్లు కల సాకారం చేయాలనే ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి డిసెంబరులో లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని మున్సిపల్‌ యంత్రాంగం తెగ హడావుడి చేసింది.

Published : 29 Nov 2022 04:51 IST

కొన‘సాగు’తున్న టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల పనులు

ఈనాడు, గుంటూరు

పొన్నూరులో రంగులకు నోచుకోని నిర్మాణాలు, చుట్టూ చెట్ల పొదలు

ట్టణాల్లోని పేదోళ్లకు సొంతిల్లు కల సాకారం చేయాలనే ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి డిసెంబరులో లబ్ధిదారులతో గృహ ప్రవేశం చేయిస్తామని మున్సిపల్‌ యంత్రాంగం తెగ హడావుడి చేసింది. ప్రస్తుతం టిడ్కో ఇళ్లనే ప్రాధాన్యాంశంగా తీసుకుని కమిషనర్లు నిత్యం ఆ పనుల పురోగతిపై సమీక్ష చేస్తున్నారు. లబ్ధిదారులు ఇంకెవరైనా డబ్బులు చెల్లించకపోతే ఆ మొత్తాన్ని వసూలు చేయాలని లక్ష్యాలు విధించడంతో ప్రస్తుతం ఏ మున్సిపాల్టీలో చూసినా టిడ్కో ఇళ్ల పంపిణీకి సంబంధించిన కసరత్తు, హడావుడే కనిపిస్తోంది. ఉమ్మడి గుంటూరులో గుంటూరు నగరపాలక, తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట, నరసరావుపేట మున్సిపాల్టీల్లోని ఇళ్లను తొలి దశలో లబ్ధిదారులకు పంపిణీ చేసే యోచనలో యంత్రాంగం ఉంది. ఇంతకు ముందే మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్‌ కార్పొరేషన్‌లో గృహ ప్రవేశాలు చేయించారు. అత్యధికంగా గుంటూరులో 7200 పై చిలుకు ఇళ్లు నిర్మిస్తున్నారు. ముహూర్త గడువు దగ్గరపడుతున్నా మౌలిక వసతుల కల్పన పనులు ఆమడదూరంలో ఉన్నాయి. ఏ టిడ్కో సముదాయాల్లో చూసినా పూర్తి స్థాయిలో తాగునీరు, డ్రైనేజీ, రహదారుల నిర్మాణం వంటివి చేపట్టలేదు. ఈ సదుపాయాలు కల్పించకుండా ఎలా గృహ ప్రవేశాలు చేస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. గుంటూరు నగరపాలకలో గోరంట్ల కొండమీద రిజర్వాయర్లు నిర్మించి నీళ్లు ఇవ్వడానికి నిర్దేశిత వ్యవధిలోపు పనులు పూర్తికావని తక్కెళ్లపాడు ఫిల్టరేషన్‌ నుంచి ఇన్నర్‌రింగు రోడ్డు మీదుగా పైపులైన్లు వేసి నీళ్లు అందించటానికి పనులు చేస్తున్నారు. ఈ పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

గుంటూరులోని గడ్డిపాడు రైల్వే ట్రాకు వద్ద భూమి లోపలి నుంచి వేస్తున్న పైపులైన్‌

ఆయా పట్టణాల్లో ఇదీ పరిస్థితి

అడవితక్కెళ్లపాడులో 4200 పూర్తయ్యాయి. వెంగళాయపాలెంలో 3242 నిర్మాణాలు చేపట్టగా అవి ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. ప్రస్తుతానికి డిసెంబరు నాటికి అడవితక్కెళ్లపాడులోని ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. లబ్ధిదారులకు నీళ్లు ఇవ్వటానికి కొండపై సర్వీస్‌, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణాలు రెండు చేపడుతున్నారు. ఒక్కోటి 14 లక్షల లీటర్ల సామర్థ్యంతో కూడుకున్నవి. వీటిల్లో సర్వీస్‌ రిజర్వాయర్‌ పనులు 80 శాతం వరకు వచ్చాయి. కొండమీద నుంచి నీళ్లు ఇవ్వటం సాధ్యం కాదని చెప్పి తక్కెళ్లపాడులోని ఫిల్టరేషన్‌ ప్లాంటు నుంచి పైపులైన్ల ద్వారా తాత్కాలికంగా నీళ్లు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఆటోనగర్‌, మహాత్మాగాంధీనగర్‌ రోడ్డులోని  వాటికి పైపులైన్ల కనెక్షన్లు అనుసంధానం చేయాలి.

తెనాలి

స్థానిక ప్రజలకు చినరావూరు, ఫులెకాలనీలో ఇళ్ల నిర్మాణాలు ప్రతిపాదించారు. రెండు కాలనీల్లో కలిపి 1856 ఇళ్లు నిర్మించాల్సి ఉండగా ఇప్పటివరకు 838 మాత్రమే అన్ని హంగులతో పూర్తయ్యాయి. వాటిని మాత్రమే లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్‌ చేశారు. మౌలిక వసతులు మాత్రం ఇంకా అరకొరగానే ఉన్నాయి. చినరావూరులో పూర్తయిన ఇళ్ల వద్ద కూడా సిమెంటు రోడ్లు నిర్మించలేదు. నివాసితులకు నీళ్లు సరఫరా చేయడానికి రిజర్వాయర్లు కట్టలేదు.  విద్యుత్తు మీటర్లు ఏర్పాటు చేయలేదు. రహదారి నిర్మాణం చేపట్టకపోవడంతో కాల్వ కట్ట మీద నుంచే ఈ నివాసాల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది.

పొన్నూరు

పొన్నూరు పట్టణ వాసులకు నిడుబ్రోలులో నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు 2306 పూర్తయ్యాయి. ఇంకా కొన్ని నిర్మాణాలు పూర్తికాలేదు. ప్రస్తుతం వాటి పనులు చేస్తున్నారు. కొన్ని ఇళ్లల్లో మరుగుదొడ్లకు అవసరమైన బేసిన్లు, సింకులు ఏర్పాటు చేయలేదు. వంట గదిలోనూ పనులు పూర్తి స్థాయిలో చేయలేదు. అరకొరగా ఇంటి తలుపులు పెట్టేసి రంగులు వేశారు. ఇక ఆరుబయట మౌలిక సదుపాయాల విషయానికి వస్తే డ్రైనేజీ కాల్వలు నిర్మించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని