logo

చంద్రబాబు పర్యటన జయప్రదానికి పిలుపు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనను అంచనాలకు మించి జయప్రదం చేయాలని తెదేపా నేతలు పిలుపునిచ్చారు.

Published : 07 Dec 2022 04:21 IST

మాట్లాడుతున్న తెనాలి శ్రావణ్‌కుమార్‌

పట్టాభిపురం(గుంటూరు), న్యూస్‌టుడే: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు జిల్లా పర్యటనను అంచనాలకు మించి జయప్రదం చేయాలని తెదేపా నేతలు పిలుపునిచ్చారు. ఈనెల 8న జిల్లాలోని పొన్నూరులో జరిగే ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రోడ్‌షోలు, బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈనేపథ్యంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి సన్నాహక సమావేశం జిల్లా పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగింది. జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ మాట్లాడుతూ ‘లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ప్రగతి పథంలో చంద్రబాబు పయనింపజేస్తే.. పాలన చేతగాక జగన్‌ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేశారు. సంపద సృష్టించడం చేతగాక ప్రజలపై పన్నుల భారం మోపుతూ అప్పులు చేసి అరకొరగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. మిగిలింది దారి మళ్లించి అందినకాడికి దోచుకుంటున్నారు. మద్యం పాలసీ, ఇసుక విధానం, ఉపకార వేతనాల పంపిణీ, పరిశ్రమల ఏర్పాటులో విఫలం.. ఇలా జగన్‌ వైఫల్యాలు చాంతాడు కంటే ఎక్కువగానే ఉంటాయి. ఈ దుస్థితి నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమం ద్వారా ప్రజల్లో చైతన్యం నింపేందుకు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పొన్నూరులో జరిగే కార్యక్రమాలు జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే ప్రజలందరూ చంద్రబాబుకు మద్దతు పలకాలి’.. అని కోరారు. కొండెపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ‘ఈనెల 8న పొన్నూరు, 9న చీరాల, 10న బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉంటుంది. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు చంద్రబాబు పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేయాలి. జగన్‌ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారు. ఏ ఒక్కరూ సంతోషంగా లేరు. రాష్ట్రం బాగుపడాలంటే జగన్‌ రెడ్డి పోవాలి.. చంద్రబాబు రావాలి’.. అని పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ ప్రణాళిక, ముందుచూపు లేకపోతే పరిపాలన ఎంత చెత్తగా ఉంటుందో జగన్‌ నిరూపించారన్నారు. రాక్షస పాలన నాశనమై రామ రాజ్యం రావాలంటే చంద్రబాబుకు పట్టం కట్టాలన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్‌ మాకినేని పెదరత్తయ్య, ఇన్‌ఛార్జులు మహమ్మద్‌ నసీర్‌, జూలకంటి బ్రహ్మారెడ్డి, మంగళగిరి సమన్వయకర్త నందం అబద్దయ్య, నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, తెదేపా నాయకులు మద్దిరాల మ్యాని, పోతినేని శ్రీనివాసరావు, ఎం.వి.వి.సత్యనారాయణ, షేక్‌ కరిముల్లా, భీమినేని వందనాదేవి, సింహాద్రి కనకాచారి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని