logo

నిధులివ్వాలని ప్రజాప్రతినిధుల గోడు

అధికార పార్టీ సభ్యులైనా తమకు అరకొర నిధులేనంటూ విమర్శలు.. అభివృద్ధి పనులపై ప్రజలు నిలదీస్తున్నారంటూ ఆక్రందనలు.. మండలాల్లో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం ఆవేదనలు.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల డుమ్మా.. ఇవీ శనివారం గుంటూరు జడ్పీ సర్వసభ్య సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు.

Updated : 05 Feb 2023 05:18 IST

జడ్పీ సర్వసభ్య సమావేశంలో ప్రశ్నించిన స్వపక్ష సభ్యులు
బడ్జెట్‌ ఆమోదం
గుంటూరు, న్యూస్‌టుడే

సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ ఛైర్‌పర్సన్‌ హెనీ క్రిస్టినా, చిత్రంలో ఎమ్మెల్సీలు ఉమ్మారెడ్డి, జంగా కృష్ణమూర్తి, గుంటూరు కలెక్టర్‌ వేణుగోపాల్‌

ధికార పార్టీ సభ్యులైనా తమకు అరకొర నిధులేనంటూ విమర్శలు.. అభివృద్ధి పనులపై ప్రజలు నిలదీస్తున్నారంటూ ఆక్రందనలు.. మండలాల్లో అధికారులు ప్రొటోకాల్‌ పాటించడం ఆవేదనలు.. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల డుమ్మా.. ఇవీ శనివారం గుంటూరు జడ్పీ సర్వసభ్య సమావేశంలో చోటు చేసుకున్న పరిణామాలు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ కత్తెర హెనీ క్రిస్టినా అధ్యక్షతన  సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. మంత్రులు అంబటి రాంబాబు, మేరుగ నాగార్జున, విడదల రజినిల్లో ఒక్కరూ హాజరు కాలేదు. జడ్పీ 2023-24 వార్షిక బడ్జెట్‌ని ప్రవేశ పెట్టాలని ఇన్‌ఛార్జి గణాంక అధికారి జి.శ్రీనివాసరావును జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఆహ్వానించారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు జోక్యం చేసుకుని జిల్లాపరిషత్తు సమావేశం ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రాతిపదికన జరుగుతోందని, ఇక్కడ చర్చించిన అంశాలను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించి సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుందన్నారు. బాపట్ల, పల్నాడు జిల్లాల కలెక్టర్లు సమావేశానికి రాకపోవటాన్ని తీవ్రంగా పరిగణించాలన్నారు.

* ఏవో శ్రీనివాసరావు బడ్జెట్‌ ప్రవేశ పెట్టారు. నాదెండ్ల జడ్పీటీసీ సభ్యులు కాట్రగడ్డ మస్తాన్‌రావు మాట్లాడుతూ జడ్పీటీసీ సభ్యులకు సంబంధం లేని నిధులను కూడా బడ్జెట్‌లో చూపారని, వాటి వివరాలు తమకు తెలియచేస్తే ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. చప్పట్లు కొట్టి హర్షం వ్యక్తం చేయాలని ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా సూచించినా సభ్యుల నుంచి అంతగా స్పందన రాలేదు.

ఎవరి గోడు వారిది..

* రొంపిచర్ల జడ్పీటీసీ సభ్యుడు పిల్లి ఓబుల్‌రెడ్డి, భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు తిరువీధుల ఉదయభాస్కరితో పాటు పలువురు మాట్లాడుతూ గత ఏడాదిలో కేవలం రూ.5 లక్షల నిధులు మాత్రమే జడ్పీటీసీ సభ్యులకు కేటాయించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి పనులకు నిధులేవి? అని ప్రజలు ప్రశ్నిస్తుంటే వారికి ఏం సమాధానం చెప్పలేకపోతు న్నామన్నారు.  అంతా ఒకే పార్టీకి చెందిన వారిమైనా నిధులు కేటాయించపోవడం ఏమిటన్నారు. తమ బాధను ఎవరికి చెప్పుకోవాలని, ప్రతిపక్ష పార్టీ అధికారంలో ఉంటే వారిపై యుద్ధం చేసే వాళ్లమని.. ఇక్కడ అంతా ఒకే గూటి పక్షులం. మీరే అర్థం చేసుకుని జడ్పీటీసీ సభ్యులకు నిధులు కేటాయించాలని కోరారు. ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు వారు అభివృద్ధి పనుల గురించి వారు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామన్నారు.

* అచ్చంపేట జడ్పీటీసీ సభ్యుడు తుమ్మా విజయప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ప్రాధాన్య భవన నిర్మాణాలు చేసిన వారికి బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని, త్వరగా బిల్లులు విడుదల అయ్యేలా చూడాలని కోరారు.

* నకరికల్లు మండలంలో జేజేఎం కింద నిర్మించిన తాగునీటి పథకాల్లో ఫిల్టర్‌ బెడ్ల నిర్మాణాలకు రూ.25 లక్షలు అవసరమవుతున్నందున ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అనుమతులు పొందాలని జడ్పీటీసీ సభ్యుడు జె.హరీష్‌ సూచించారు.

*బొల్లాపల్లి జడ్పీటీసీ సభ్యురాలు రామావత్‌ భీమ్లీబాయి మాట్లాడుతూ వరికపూడిశెల పథకం నిర్మిస్తే సాగు, తాగునీరు ఇబ్బందులు తొలగుతాయన్నారు.


మధ్యాహ్న భోజనం అధ్వానం

జడ్పీ పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకంలో ఆహార పదార్థాలు అధ్వానంగా ఉన్నాయని జడ్పీ ఉపాధ్యక్షురాలు బత్తుల అనురాధ, భట్టిప్రోలు జడ్పీటీసీ సభ్యురాలు ఉదయభాస్కరి ఫిర్యాదు చేశారు. విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచి అన్నం తెచ్చుకుని స్కూళ్లలో వండిన కూరలు వేసుకుని తింటున్నారన్నారు. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని గుంటూరు, బాపట్ల జిల్లాల డీఈవోలకు ఛైర్‌పర్సన్‌ క్రిస్టినా సూచించారు. చెరుకుపల్లి జడ్పీటీసీ సభ్యురాలు వెంకటపావని మాట్లాడుతూ విద్యార్థులకు పంపిణీ చేసిన ట్యాబ్‌ల పంపిణీకి తనను విద్యాశాఖ అధికారులు ఆహ్వానించలేదని ఫిర్యాదు చేశారు. మూడు జడ్పీ పాఠశాలల హెచ్‌ఎంలకు నోటీస్‌లు జారీ చేస్తామని బాపట్ల జిల్లా డీఈవో చెప్పారు.

అధిక ధరలపై చర్యలేవీ?

నకిలీ మిర్చి విత్తనాలు సాగు చేసి నష్టపోయిన బాధిత రైతులకు పరిహారం చెల్లించేలా కంపెనీలపై ఒత్తిడి తీసుకురావడంతో పాటు వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు జిల్లా కలెక్టరును కోరారు. యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్న వ్యాపారులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఆత్మ ప్రాజెక్టు డైరెక్టరు రామాంజనేయులు మాట్లాడుతూ రైతులు పరిమితికి మించి ఎక్కువ యూరియా వినియోగిస్తున్నారని, ఇతర అంశాలను చెపుతుండటంతో ఆయనపై లక్ష్మణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

కళాతపస్వి విశ్వనాథ్‌కు నివాళి

ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన కళాతపస్వి కె.విశ్వనాథ్‌ మృతికి సంతాపంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. సమావేశం ఉదయం 10.30 గంటలకు ఏర్పాటు చేసినప్పటికీ 11.25 గంటలకు ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు ముగించారు. ఇతర శాఖలపై చర్చ లేకుండానే ముగించారు.


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని