నిల్వలు లేక నిరుపయోగంగా మారిన వైనం
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాములకు సరకు రాకపోవడంతో రెండేళ్లుగా బోసిపోయాయి.
నిర్వహణకూ సమకూరని సొమ్ము..
సరకు నిల్వ లేక ఖాళీగా గిడ్డంగి
ఈనాడు-నరసరావుపేట, బాపట్ల: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాములకు సరకు రాకపోవడంతో రెండేళ్లుగా బోసిపోయాయి. లక్షల టన్నుల సామర్థ్యంతో పెదకాకాని, దుగ్గిరాల, వడ్లమూడి, సత్తెనపల్లి, గుంటూరు నగరంలో ప్రధాన రహదారుల వెంబడి భారీ గోదాములను నిర్మించారు. భారత ఆహార సంస్థ ఆధ్వర్యంలో ఆహార ధాన్యాలు నిల్వ చేయడానికి ప్రారంభంలో వీటిని నిర్మించారు. ధాన్యం, అపరాలు, జొన్నలు, మొక్కజొన్నలు, పసుపు పంట ఉత్పత్తులను శాస్త్రీయంగా నిల్వచేసేవారు. క్రమంగా ఆహారధాన్యాల సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి రావడంతో వీటిని ప్రత్యామ్నాయాలకు వాడుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఆహారధాన్యాల సేకరణ మొదలైన తర్వాత రాష్ట్ర గోదాముల సంస్థ గోదాములు నిర్మించడం, కొంత సరకును ప్రైవేటు గోదాములకు మళ్లించడంతో కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని గోదాములకు సరకు రాక తగ్గిపోయింది. దీంతో ప్రస్తుతం భారీ గోదాముల్లో 15 శాతం కూడా ఆక్యుపెన్సీ(నిల్వ) లేని పరిస్థితి ఏర్పడింది.
మారుతున్న ముఖచిత్రం
ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారత ఆహార సంస్థ ధాన్యం, బియ్యం నిల్వ చేయడానికి అనుకూలంగా నిర్మించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వాలు ఏ జిల్లా అవసరాలకు అదే జిల్లాలో ధాన్యం సేకరణ, నిల్వ, సరఫరా చేస్తుండటంతో గోదాముల అవసరం బాగా తగ్గింది. అపరాలు మొత్తం శీతల గోదాముల్లోనే నిల్వ చేస్తున్నారు. దీంతో కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాములకు సరకు వచ్చే మార్గాలు మూసుకుపోతున్నాయి. మరోవైపు ప్రైవేటు గోదాములతో పోల్చితే కేంద్ర గోదాముల్లో ఎత్తుడు, దించుడు కూలీ కొంత ఎక్కువగా ఉంటుంది. కేంద్ర గిడ్డంగులు సంస్థ కూలీలకు బీమా, ఆరోగ్యానికి సంబంధించి కొంత ఖర్చు పెడుతున్నందున హమాలీ కూలీ కింద ప్రైవేటుతో పోల్చితే కొంత అదనంగా వసూలు చేస్తారు. ఇది కూడా వ్యాపారులకు కొంత ప్రతిబంధకంగా మారింది.
నిర్వహణకు గడ్డుకాలం
కేంద్ర గిడ్డంగుల సంస్థ పరిధిలోని గోదాముల్లో సరకు ఉన్నా, లేకపోయినా అనుమతులు తీసుకోవడం, లైసెన్సు ఫీజులు చెల్లించడం, అగ్నిమాపక, స్థానిక ప్రభుత్వాల నుంచి అనుమతి తప్పనిసరి. ఇందుకు కొంత మొత్తం చెల్లించాల్సి ఉంది. దీంతోపాటు గోదాముల వద్ద వాచ్‌మెన్‌లు, సహాయకులు, నిర్వహణ ఉద్యోగులకు వేతనాలు చెల్లించాలి. 36 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న గోదాములకు సంబంధించి ఏడాదికి పెదకాకాని పంచాయతీకి రూ.5లక్షలు పన్ను చెల్లిస్తున్నారు. ఇక్కడ కొందరు శాశ్వత ఉద్యోగులతోపాటు 300 మంది హమాలీలు పని చేస్తున్నారు. రెండేళ్లుగా సరకు రాకపోవడంతో హమాలీలు ప్రత్యామ్నాయంగా పనులు వెతుక్కోవాల్సిన దుస్థితి నెలకొంది. పెదకాకానిలో 75వేల టన్నుల నిల్వ సామర్థ్యం ఉండగా 15వేల టన్నులు మాత్రమే ప్రస్తుతం నిల్వలు ఉన్నాయి. దుగ్గిరాలలో 80 శాతం, సత్తెనపల్లిలో 60 శాతం నిల్వలు ఉండగా, గుంటూరు, వడ్లమూడిలో నిల్వలు 15శాతం మించడం లేదు. గోదాముల్లో రోజూ వందల సంఖ్యలో రాకపోకలు సాగించే లారీలకు కూడా కష్టకాలం ఎదురైంది.
రైతులకు అద్దెలో 30 శాతం రాయితీ
కేంద్ర గిడ్డంగుల సంస్థ ఆధ్వర్యంలోని గోదాముల్లో రైతులు, వ్యాపారులు సరకు నిల్వ చేస్తే పలు ప్రయోజనాలు కల్పిస్తున్నాం. ఇక్కడ నిల్వచేసే సరకుకు బ్యాంకు నుంచి రుణం పొందవచ్చు. రైతులకు అయితే అద్దెలో 30 శాతం రాయితీ ఇస్తున్నాం. నిల్వ చేసిన వ్యవసాయ ఉత్పత్తులకు బీమా సౌకర్యం ఉంది. క్రిమికీటకాలు, ఎలుకల బారి నుంచి శాస్త్రీయ పద్ధతుల్లో రక్షణ కల్పిస్తాం.
అంబేద్కర్, మేనేజరు, కేంద్ర గిడ్డంగుల సంస్థ, పెదకాకాని
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
India News
Panaji: 10ఏళ్ల బాలుడి సాహసం.. నీటిలో మునుగుతున్న స్నేహితులను కాపాడి..
-
Politics News
MP Laxman: కేసీఆర్ కుటుంబ కలలు కల్లలుగానే మిగిలిపోతాయ్: ఎంపీ లక్ష్మణ్
-
Politics News
Modi - Rahul: కాంగ్రెస్ ర్యాలీ వాయిదా..ఒకేరోజు మోదీ, రాహుల్ మీటింగ్స్
-
Politics News
CM KCR: నా రాజకీయ జీవితమంతా పోరాటాలే: సీఎం కేసీఆర్
-
Politics News
Andhra News: రూ.లక్షల కోట్ల ప్రజాధనం తీసుకొచ్చి అమరావతి గోతుల్లో పోయాలా?: మంత్రి బొత్స