logo

ఇసుకాసురుల దాహానికి ప్రాణాలు బలి

ఇసుకాసురుల కాసుల దాహానికి ప్రాణాలు గాలిలో కలుస్తూ బాధిత కుటుంబాలకు ఆవేదన మిగులుతోంది. ఇసుక తవ్వకాల కోసం అడ్డగోలుగా కృష్ణానదిలో దారులు ఏర్పాటు చేస్తున్నారు.

Published : 31 Mar 2023 05:34 IST

మృత్యుకూపాలుగా ఇసుక గోతులు
నదికి అడ్డంగా దారి నిర్మించి రవాణా
ఈనాడు, నరసరావుపేట, న్యూస్‌టుడే, అమరావతి

మట్టి వంతెనకు ఇరువైపులా ప్రమాదకర గుంతలు

సుకాసురుల కాసుల దాహానికి ప్రాణాలు గాలిలో కలుస్తూ బాధిత కుటుంబాలకు ఆవేదన మిగులుతోంది. ఇసుక తవ్వకాల కోసం అడ్డగోలుగా కృష్ణానదిలో దారులు ఏర్పాటు చేస్తున్నారు. నదిలో మట్టి, ఇసుక తవ్వి భారీ లారీలతో తరలిస్తున్నారు. దీంతో నదిలో ఎక్కడపడితే అక్కడ భారీగోతులు ఏర్పడుతున్నాయి. విషయం తెలియక అమాయకులు నదిలో స్నానానికి దిగి విగత జీవులవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నదీ ప్రవాహానికి అడ్డంగా దారులు నిర్మించి ప్రవాహ దిశను మార్చి ఇసుక తరలించి జేబులు నింపుకొంటున్నారు. అధికారం అండతో బరితెగిస్తున్నారు. పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురం, ముత్తాయపాలెం, మల్లాది, అమరావతి ఇసుకరీచ్‌ల్లో తవ్వకాల తీరిది.

కిలోమీటర్ల మేర నదిలో మట్టి  వంతెనలు

అనుమతి తీసుకున్నవారు కృష్ణానదిలో అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతున్నారు. నదిలో నీటి ప్రవాహం ఉండటంతో పాయలు దాటి లంకల్లో ఉన్న ఇసుకను తవ్వి తరలించేందుకు వాహనాల రాకపోకలకు, నదీపాయల ప్రవాహం వెళ్లడానికి సిమెంటు పైపులు వేసి వాటిపై మట్టితో దారి ఏర్పాటు చేసుకుని లారీల ద్వారా ఇసుక తరలిస్తున్నారు. దీనివల్ల నదీ ప్రవాహ దిశ సైతం మారుతోంది. సహజ సిద్ధమైన నదిలో ఇష్టారాజ్యంగా మార్గాలు ఏర్పాటు చేస్తుండటంతో ఏం ప్రమాదం ముంచుకొస్తుందోనని నదీతీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అధికారం అండగా ఉండటంతో ఆయా అంశాలను పర్యవేక్షించాల్సిన అధికారులు అటువైపు వెళ్లడం లేదు.


తీరని శోకం

నెల వ్యవధిలో అమరావతి మండలంలో ఇసుక తవ్వకాలతో ఏర్పడిన గోతుల్లో పలువురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరు రెండేళ్ల బాలుడు కాగా మరో ఇద్దరు 17ఏళ్ల విద్యార్థులు. ఉన్నత చదువులు చదివి కుటుంబానికి పేరు తీసుకురావడంతోపాటు అండగా ఉంటారనుకున్న పిల్లలు అర్ధంతరంగా తనువు చాలించడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. కళ్లెదుటే విగతజీవులుగా మారిన పిల్లలను చూసి విలపిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కంటతడి పెట్టిస్తోంది. ఇసుక గుంతల్లో పడి కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధితులు లోలోనే కుమిలిపోతున్నారు.

2020 మార్చిలో సాయి, గోవర్దన్‌ అనే యువకులు శుభకార్యానికి ధరణికోట వచ్చి ధ్యానబుద్ధ వెనకాల ఉన్న ఇసుక గుంతల్లో పడి మృతిచెందారు. 

2021 మార్చి 11న అమరావతికి చెందిన పఠాన్‌బాజీ(13), పఠాన్‌మీరా హుస్సేన్‌(13) అమరేశ్వర ఘాట్‌ సమీపంలో సరదాగా స్నానానికి దిగి విగతజీవులయ్యారు.

2022 నవంబరు 12న ధరణికోటకు చెందిన రెండో తరగతి చదివే తొండపు మణికంఠ(9) ఇంటి నుంచి ఆడుకోవడానికి వెళ్లి కృష్ణానదిలోని ఇసుక గుంతల్లో శవమై తేలాడు.

మార్చి 17న మండల పరిధిలోని దిడుగులో శుభకార్యానికి వచ్చి బంధువులతో కలసి సరదాగా ఈతకు వెళ్లిన షేక్‌ పెద్దబాజీ(25)  మృతి చెందాడు. మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబానికి ఆధారంగా ఉన్న కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులకు తీరని శోకం మిగిలింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని