logo

సకాలంలో పూర్తయ్యేనా?

జిల్లాలో 216ఎ జాతీయ రహదారి విస్తరణ అభివృద్ధి పనులను 68 కి.మీ మేర ఈ ఏడాది ఆగస్టు చివరకు పూర్తి చేయాల్సి ఉంది. వీటిలో దాదాపు 90శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి.

Published : 07 Jun 2023 04:32 IST

జాతీయ రహదారి అభివృద్ధి పనులపై సందేహం
కనగాల, గుళ్లపల్లి (చెరుకుపల్లి గ్రామీణ), న్యూస్‌టుడే

ఇటీవల కురిసిన వర్షానికి చెరుకుపల్లిలో రహదారి ఇలా..

జిల్లాలో 216ఎ జాతీయ రహదారి విస్తరణ అభివృద్ధి పనులను 68 కి.మీ మేర ఈ ఏడాది ఆగస్టు చివరకు పూర్తి చేయాల్సి ఉంది. వీటిలో దాదాపు 90శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. మిగిలిన పది శాతం పనులే కీలకంగా మారాయి. వీటిలో చెరుకుపల్లి ఒకటి. తీర ప్రాంతంలో ప్రముఖ వాణిజ్య, మండల కేంద్రమైన చెరుకుపల్లిలో విస్తరణ పనులు నిర్వహించడానికి అధికారులకు దాదాపు 26 నెలల పైగా సమయం పట్టింది. ఇటీవలే తొలగించిన కట్టడాల శిథిలాలను తొలగించారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులను అధికారులు నిర్వహిస్తున్నారు. ఐలాండ్‌ కూడలి నుంచి ఖాదర్‌ఖాన్‌ ఆసుపత్రి కూడలి మీదుగా లూథర్‌పేట వరకు ఈ పనులు జరగనున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా పనులు నిర్వహించడం అధికారులకు సవాలుగా మారింది.

సంతబజారు సమీపంలో తారు రోడ్డు తొలగించాక..

వర్షం వస్తే నష్టమే : ఐలాండ్‌ సెంటర్‌ నుంచి రహదారికి ఒక పక్క విస్తరణలో భాగంగా సేకరించిన భూమిని తవ్వి పనులకు అధికారులు శ్రీకారం చూట్టారు. మే నెల తొలి వారంలో కురిసిన వర్షాలకు పక్కా కాల్వలు పొంగాయి. వర్షపు నీటితో పలు ప్రాంతాలు మునిగాయి. పనులు నిర్వహిస్తున్న చోట్ల నీరు నిలిచింది. దీంతో పనులకు తీవ్ర అంతరాయం కలిగింది. అధికారులు నీటిని తోడిపోస్తూనే పనులు చేపట్టారు. ప్రస్తుతం ఐలాండ్‌ కూడలి నుంచి సంతబజారు, ఖాదర్‌ఖాన్‌ ఆసుపత్రి కూడలి వరకు ఉన్న తారురోడ్డును యంత్రసాయంతో తొలగించారు. ఈ సమయంలో వర్షం పడితే తీవ్ర ఇబ్బందే కాదు నష్టం ఉంటుందని అధికారులు అంటున్నారు. దీంతో వర్షాలు కురిసే లోపు సాధ్యమైనంత త్వరగా పనులను త్వరగా పూర్తిచేయాలని అధికారులు భావిస్తున్నారు.

ఏకమార్గంతో మొదలు పెట్టి

ప్రస్తుతం ఐలాండ్‌ సెంటర్‌ నుంచి నూతన రహదారిని ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాన్ని తవ్వి మట్టి తొలగించారు. రబ్బీస్‌తో చదును చేస్తున్నారు. ఇందులో తొలుత ఒక వరస మార్గాన్ని అభివృద్ధి చేసి వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూస్తారు. తరువాత రెండో వరస రోడ్డు నిర్మించి, తుది మెరుగుల దిద్ది విద్యుత్తు స్తంభాలను ఏర్పాటు చేస్తారు. అయితే కి.మీ మేర ఉన్న చెరుకుపల్లి గ్రామంలో ఈ రోడ్డుపై సగటున గంటకు 250కిపైగా వాహనాలు రాకపోకుల సాగిస్తుంటాయి. ఏకమార్గం ఏ మేరకు ట్రాఫిక్‌ సమస్యలను తగ్గిస్తుందో తెలియని దుస్థితి.

గ్రామంలో ప్రజల అవస్థలు

మురుగంతా  రోడ్డుపైనే..

విస్తరణ పనుల్లో భాగంగా గ్రామంలో ప్రధాన మురుగు కాల్వలను తొలగించారు. మట్టి కాల్వలతో ప్రస్తుతం నెట్టుకొస్తున్నా, మురుగు పారుదల లేకపోవడం వల్ల మట్టి కట్టలు కోతకు గురై మురుగంతా తారు తొలగించిన రహదారి గుంతల్లోకి చేరుతోంది. దీన్ని తోడిపోయడం ఎన్‌హెచ్‌ అధికారులకు భారంగా మారింది. ఇన్ని సమస్యల మధ్యలో పనులు సకాలంలో పూర్తి అవుతాయా అనే సందేహాన్ని చెరుకుపల్లి గ్రామస్థులు వ్యక్తం చేస్తున్నారు.

లూథర్‌పేట వద్ద పక్కా కాల్వ నిర్మాణం


నెలాఖరుకు పూర్తి చేస్తాం

చెరుకుపల్లిలో జాతీయ రహదారి విస్తరణ, అభివృద్ధి పనులను వేగంగా నిర్వహిస్తున్నాం. జూన్‌ చివరకు పనులు పూర్తిచేస్తాం. తొలుత ఒక వరస రహదారిని అందుబాటులోకి తీసుకొస్తాం. తరువాత మరొక వరస పూర్తిచేస్తాం. దీనివల్ల ప్రజలు, వాహనదారులకు ఇబ్బంది ఉండదు. పక్కా కాల్వల ఏర్పాటు కూడా వేగంగా చేపడుతున్నాం. వానలు పడకుండా ఉంటే అనుకున్న సమయానికి ముందే రహదారిని అందుబాటులోకి తీసుకొస్తాం.

పురుషోత్తమరాజు, ఏఈ, ఎన్‌హెచ్‌, రేపల్లె

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు