logo

లక్ష్మీకటాక్షం ఉంటేనే దస్త్రం కదిలేది

జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్‌ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి

Published : 28 Mar 2024 06:08 IST

రెవెన్యూ డివిజన్‌ కార్యాలయంలో ఇదీ సంగతికలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: జిల్లాలో కీలకమైన రెవెన్యూ డివిజన్‌ ఇది. రూ.కోట్ల విలువైన భూముల దస్త్రాలు పరిష్కారానికి వస్తుంటాయి. వాటిని పరిశీలించి దరఖాస్తుదారులకు అనుకూలంగా రాయాలన్నా.. అన్నీ సక్రమంగా ఉన్నా ఉన్నతాధికారికి పంపాలన్నా పైకం ముట్టజెప్పితే కానీ ముందుకు కదలని పరిస్థితి. కార్యాలయంలో కీలకమైన విభాగాలకు సంబంధించి అన్నింటినీ పరిష్కరించే బాధ్యతను ఒక ఉద్యోగి తీసుకున్నారు. ఆ ఉద్యోగి కార్యాలయంలో అన్నీ తానై చక్రం తిప్పుతున్నారు. ఉన్నతాధికారి అండ ఉందన్న ధీమాతో అందరినీ నియంత్రణ చేస్తున్నారు. దీనిని గుర్తించిన తోటి ఉద్యోగులు కూడా కీలక బాధ్యతలన్నీ ఒక్కరికే అప్పజెప్పుతున్నా మిన్నకుండిపోతున్నారు. ప్రతి పనికి దాని విలువ ఆధారంగా ధర నిర్ణయిస్తూ ముడుపులు రాబడుతున్నారు. భూములకు సంబంధించి కీలకమైన భూముల మార్పిడి, ఆర్‌వోఆర్‌, నిషేధిత భూములకు సంబంధించిన పత్రాలు పరిశీలించి ఉన్నతాధికారికి పంపుతుండడంతో కార్యాలయంలో ఆ ఉద్యోగి మాటకు ఎదురుచెప్పేవారు లేకుండా పోయారు. క్షేత్ర స్థాయిలో భూములకు సంబంధించిన దస్త్రం డివిజన్‌ కార్యాలయంలోనే పరిశీలించి ఉన్నతాధికారులు ధ్రువీకరిస్తారు. ఈ క్రమంలోనే చిన్న దస్త్రం ఆమోదం పొందాలన్నా.. నిర్దేశించిన పైకం చెల్లిస్తే తప్ప ఉన్నతాధికారికి వెళ్లదు. సదరు ఉద్యోగి పంపినవన్నీ ఆమోదం పొందుతుండడంతో దరఖాస్తుదారులు కూడా చెప్పినంత ముట్టజెప్పి పని చేయించుకుంటున్నారు. అడిగినంత ఇవ్వకపోతే ఏదో ఒక కొర్రీ వేసి తిరిగి వెనక్కి పంపేస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక దరఖాస్తుదారులు వారు చెప్పినట్లు నడుచుకోవాల్సి వస్తోంది. సాధారణంగా ఎన్నికల షెడ్యూల్‌ వచ్చిన తర్వాత యంత్రాంగం మొత్తం ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతుంది. అందుకు విరుద్ధంగా సదరు ఉద్యోగి భూముల దస్త్రాల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఒకేచోట విధులు నిర్వహించడం, ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు మారుతుండడంతో ఉద్యోగి పర్యవేక్షణలోనే కార్యాలయం నడుస్తోందన్న విమర్శలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని