Janasena: ఉపాధ్యాయ బదిలీల్లో రూ.వందల కోట్ల కుంభకోణం: నాదెండ్ల మనోహర్‌

రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు.

Updated : 29 Mar 2024 16:21 IST

అమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై 8,03,612 ఫిర్యాదులు వస్తే ఏసీబీ అధికారులు ఏం చర్యలు తీసుకున్నారని జనసేన పీఏసీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రశ్నించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

‘‘కింది స్థాయి ఉద్యోగులపై దాడులు చేసేందుకు మాత్రమే ఏసీబీని ఉపయోగించారు. మంత్రులు, వారి పేషీలపై, అధికార పార్టీ నాయకులపై వచ్చిన ఫిర్యాదుల గురించి మాత్రం పట్టించుకోలేదు. రాష్ట్రంలో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదని సీఎం జగన్‌ తనకు తానే సర్టిఫికెట్‌ ఇచ్చుకుంటున్నారు. ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్‌ 14400కు 8.03లక్షల ఫిర్యాదులు వచ్చాయి. మంత్రులు, వారి పేషీలపై 2.06 లక్షలు, ఎమ్మెల్యేల అవినీతిపై 4.39లక్షల ఫిర్యాదులు వస్తే ఏం చర్యలు తీసుకున్నారు?

ముఖ్యమంత్రి నిర్వహించే అధికారిక సమీక్షలో ఏసీబీ డీజీ ఎవరని అడిగారు. ఏసీబీ గురించి ముఖ్యమంత్రే.. మర్చిపోయారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడున్న యాక్టింగ్‌ డీజీపీనే ఏసీబీ డీజీగా కూడా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో అవినీతి తాండవిస్తుంటే.. ఒక్క రూపాయి అవినీతి జరగలేదని మీకు మీరే సెల్ఫ్‌ సర్టిఫికెట్‌ ఎలా ఇచ్చుకుంటారు? ఐదేళ్లుగా అవినీతి జరగలేదని ఏసీబీ అధికారులు ఎలా చెబుతారు? ఫిర్యాదులపై ఏటా మీడియాకు చెప్పే ఏసీబీ.. కొన్నాళ్లుగా చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్‌లో అవినీతిపై అహ్మదాబాద్‌ ఐఐఎం నివేదికను బుట్టదాఖలు చేశారు. మా ప్రభుత్వం వచ్చాక కుంభకోణాలపై చర్యలు తీసుకుంటాం’’ అని నాదెండ్ల తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని