icon icon icon
icon icon icon

Robert Vadra: ‘నాకోసం దేశం ఎదురుచూస్తోంది’: అమేఠీలో పోటీపై రాబర్ట్ వాద్రా వ్యాఖ్యలు

వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా (Robert Vadra) ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన స్పందిస్తోన్న తీరే అందుకు కారణం.

Published : 27 Apr 2024 12:30 IST

దిల్లీ: కాంగ్రెస్‌ (Congress) అగ్ర నాయకురాలు సోనియాగాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్‌ వాద్రా (Robert Vadra) ఎన్నికల్లో పోటీచేసే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఆయన యూపీలోని అమేఠీ నియోజకవర్గం నుంచి పోటీపై పదేపదే మాట్లాడటం అందుకు ఊతమిస్తోంది. తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. తాను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోందని వ్యాఖ్యానించారు.

‘‘నిత్యం ప్రజల మధ్య ఉండే నేను క్రియాశీల రాజకీయాల్లోకి రావాలని దేశం మొత్తం కోరుకుంటోంది. తాను ఎప్పుడూ వారి ప్రాంతంలోనే ఉండాలని ఆశిస్తున్నారు. 1999 నుంచి నేను అమేఠీలో ప్రచారం చేస్తున్నాను. సిటింగ్ ఎంపీ స్మృతి ఇరానీ తానిచ్చిన హామీలను నెరవేర్చలేదు’’ అని అన్నారు. ‘‘అమేఠీ నుంచి మీ పోటీ ఉంటుందా..?’’ అని అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చారు. రెండు దశల పోలింగ్ సరళిని గమనించిన తర్వాత భాజపా కంటే కాంగ్రెస్ ముందంజలో ఉందన్నారు. ‘‘ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. కేంద్రదర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోన్న భాజపాను వదిలించుకోవాలని అనుకుంటున్నారు. రాహుల్, ప్రియాంక శ్రమిస్తోన్న తీరును చూసిన వారు గాంధీ కుటుంబానికి అండగా ఉన్నారు’’ అని వాద్రా వ్యాఖ్యానించారు.

‘ఓటు వేయండి - లడ్డూ, దోశ ఉచితంగా తినండి’!

గతంలో కూడా ఆయన ఇదే తరహాలో స్పందించారు. ‘‘ఒకవేళ నేను పోటీలోకి అడుగుపెడితే అమేఠీని ఎంచుకుంటా. రాజకీయాల్లో నా మొదటి అడుగు అమేఠీతోనే ఉండాలని భావిస్తున్నా. ఆ నియోజకవర్గ ప్రజలు కూడా గాంధీ-నెహ్రూ కుటుంబసభ్యులే కావాలని కోరుకుంటారు’’ అని అన్నారు. అమేఠీ నియోజకవర్గానికి సుదీర్ఘకాలం పాటు రాహుల్‌గాంధీ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే. అయితే, 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి స్మృతి ఇరానీపై ఓటమి పాలయ్యారు. అయితే రాహుల్‌ అక్కడ పోటీ చేస్తారా..? లేదా..? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఇప్పటికే స్మృతిఇరానీ అభ్యర్థిత్వాన్ని భాజపా ఖరారు చేయగా.. కాంగ్రెస్‌ మాత్రం ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img