logo

విద్యుత్తు అధికారుల నిర్లక్ష్యంతో జేఎల్‌ఎం మృతి

విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్‌ఎం (జూనియర్‌ లైన్‌మెన్‌) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్‌ (27) ఇదే గ్రామంలో జేఎల్‌ఎంగా పనిచేస్తున్నారు.

Published : 20 Apr 2024 05:05 IST

రాజేశ్‌ (పాతచిత్రం)

పెదకాకాని, న్యూస్‌టుడే: విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా జేఎల్‌ఎం (జూనియర్‌ లైన్‌మెన్‌) మృతి చెందిన ఘటన ఇది. విద్యుత్తు శాఖ ఉద్యోగులు, బాధితుల కథనం ప్రకారం... పెదకాకాని మండలం వెంకటకృష్ణాపురానికి చెందిన అడుసుమల్లి సుబ్రహ్మణ్యం, చిలకమ్మ దంపతుల పెద్దకుమారుడు రాజేశ్‌ (27) ఇదే గ్రామంలో జేఎల్‌ఎంగా పనిచేస్తున్నారు. పెదకాకానిలోని విద్యుత్తు ఉపకేంద్రంతో పాటు శివారు ప్రాంతంలో మరమ్మతు పనులు చేసేందుకు శుక్రవారం మండలంలోని జేఎల్‌ఎంలను ఏఈ బత్తుల శ్రీనివాసరావు పిలిపించారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ కాలనీ సమీపంలో 11కేవీ విద్యుత్తు సరఫరా లేకుండా ఉన్న తీగలు కత్తిరించుకొని రావాలని ఏఈ సిబ్బందిని ఆదేశించారు. దీంతో లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, లైన్‌మెన్‌ శేషావలి, జేఎల్‌ఎంలు రాజేశ్‌, మస్తాన్‌, గోపి, సబ్‌స్టేషన్‌ వాచ్‌మెన్‌ కురిమాల ప్రవీణ్‌కుమార్‌ అక్కడికి వెళ్లారు. విద్యుత్తు సరఫరా లేదని ఏఈ చెప్పడంతో స్తంభం ఎక్కి తీగలు కత్తిరించాలని మస్తాన్‌కు లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు, లైన్‌మెన్‌ శేషావలి చెప్పారు. తనకు చేయి నొప్పిగా ఉందని మస్తాన్‌ చెప్పడంతో రాజేశ్‌ స్తంభం ఎక్కడంతో విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. అతను అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో మార్గమధ్యలో మృతి చెందాడు.రాజేశ్‌ మృతదేహాన్ని చూసిన తల్లి చిలకమ్మ దేవుడా ఇక మా బాధలు ఎవరికి చెప్పుకోవాలి, ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న బిడ్డ మమ్మల్ని విడిచిపోయాడంటూ రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. 11కేవీ విద్యుత్తు స్తంభాలను లైన్‌మెన్‌ ఎక్కి పనిచేయాలని నిబంధన ఉన్నా పాటించలేదని తోటి ఉద్యోగులు చెప్పారు.  

బాధితుల పక్షాన ధూళిపాళ్ల.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైందని మాజీ ఎమ్మెలే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 10 గంటలకు జేఎల్‌ఎం రాజేశ్‌ మృతి చెందినా 12 గంటల వరకు ఉన్నతాధికారులకు ఏఈ బత్తుల శ్రీనివాసరావు సమాచారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మృతదేహాన్ని సందర్శించి రెండు గంటలు ఆయన అక్కడే ఉన్నారు. కొద్ది సేపటికి డీఈ శ్రీనివాసరావు వచ్చి బాధిత కుటుంబంలో ఒకరి ఉద్యోగంతో పాటు నష్టపరిహారం అందేలా చూస్తానని, చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.


 లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ సస్పెన్షన్‌

 పెదకాకాని, న్యూస్‌టుడే: పెదకాకాని మండల లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ రంగారావు విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు సస్పెన్షన్‌ చేసినట్లు డీఈ శ్రీనివాసరావు తెలిపారు. 11కేవీ విద్యుత్తు తీగల్లో సరఫరా నిలిపివేయకుండా నిర్లక్ష్యం వహించి జేఎల్‌ఎం అడుసుమల్లి రాజేశ్‌ను మరమ్మతుల కోసం స్తంభం ఎక్కించి మృతికి కారణమైనందుకు ఈ వేటు పడింది. త్వరలో ఏఈ బత్తుల శ్రీనివాసరావుపై సైతం చర్యలు ఉంటాయని డీఈ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని