logo

విద్యార్థుల జీవితాల్లో ‘జగనాంధకారం’!

ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్‌దే. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్‌ ఆరితేరిపోయారు.

Updated : 26 Apr 2024 06:03 IST

బోధన రుసుములు చెల్లించలేని ప్రభుత్వం
కోర్సులు పూర్తయినా చేతికి రాని ధ్రువపత్రాలు
ఉన్నత విద్య, కొలువులకు వేల మంది దూరం
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, మేడికొండూరు, తెనాలి టౌన్‌

ఇలా.. వేల మంది విద్యార్థుల పొట్టకొట్టిన పాపం సీఎం జగన్‌దే. సకాలంలో ఫీజు రీయింబర్స్‌మెంటు సొమ్ము విడుదల చేయకుండానే వారిని తానే ఉద్ధరిస్తున్నట్లు సొంత డబ్బా కొట్టుకోవడంలో జగన్‌ ఆరితేరిపోయారు. అసలు వేల మంది విద్యార్థుల ఉపాధిని దూరం చేసిన జగన్‌ను ఏమనాలి?

‘మీ పిల్లల చదువులకు పూర్తి భరోసా నాది. వారు ఇంజినీరింగా? మెడిసినా? ఏమైనా చదువుకోమనండి. అందుకయ్యే ఫీజులను పూర్తిగా ప్రభుత్వమే చెల్లిస్తుంద’న్న మీ మాటలు గుర్తున్నాయా? సీఎంగారూ!

ధికారంలోకి వచ్చాక మీరేం చేశారు? అసలు బోధనా రుసుములను ఎప్పుడు విడుదల చేస్తున్నారో మీకు తెలుసా? అసలు ఎంత మందికి జమవుతున్నాయి? అదీ ఎన్నాళ్లకో.. ఏనాడైనా ఆరా తీశారా? పేద విద్యార్థుల చదువుల బాధ్యతను మీ అన్న జగన్‌ తీసుకున్నాడని సభల్లో చేతులు ఊపుతూ చెప్పడమే తప్ప ఆచరణలో ఏం చేశారో గుండె మీద చేయి వేసుకుని ఆలోచించండి సీఎంగారూ! జగన్‌ చెప్పారంటే... అసలు చేయరనే అర్థం అంటూ విద్యార్థులు చెబుతున్నారంటే మీ నిర్వాకాలెలాంటివో తెలుస్తూనే ఉందిగా! ఫీజుల సొమ్ము మీరూ ఇవ్వక.. ఏం చేయాలో పాలుపోని నిరుపేద కుటుంబాలవారూ చెల్లించలేక.. వివిధ కళాశాలల యాజమాన్యాలు సూటిపోటి మాటలతో వారినెంత హింస పెట్టాయో ఏనాడైనా గమనించారా?


అప్పు చేసి కట్టాల్సి వచ్చింది..

- గాయత్రి, ఓ కళాశాలకు చెందిన బీటెక్‌ విద్యార్థిని

డిజిటల్‌ సైన్స్‌ రెండో ఏడాది చదువుతున్నా. ఈ ఏడాది బోధన రుసుము డబ్బులు ప్రభుత్వం విడుదల చేయలేదు. కళాశాల యాజమాన్యాం ఒత్తిడి చేయడంతో ఇంట్లో వాళ్లు అప్పు చేసి మొదటి విడత ఫీజు రూ.8,750 కట్టారు. ప్రభుత్వం ఏడాదికి ఒక్కో విద్యార్థికి మొత్తంగా బోధన రుసుం పేరుతో రూ.35వేలు జమ చేస్తుంది. నాలుగు విడతలుగా సాయం అందిస్తుంది. ఈ సంవత్సరానికి  సంబంధించి కళాశాల పది రోజుల్లో ముగుస్తుంది. ఫీజు రీమెంబర్స్‌ మెంట్‌ విషయం అర్థం కావడం లేదు.


నగర శివారులోని ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో బీటెక్‌ మూడో సంవత్సరం విద్యార్థి గుంటూరు నెహ్రూనగర్‌కు చెందిన మానం శ్రీనివాసరావును అప్రంటీస్‌కు పంపాలంటే బోధనా రుసుముల బకాయిలు లేకుండా చూసుకోవాలని కళాశాల యాజమాన్యం ఆదేశించింది. రెక్కాడితేగానీ డొక్కాడని అతని కుటుంబం ఆ మొత్తం చెల్లించలేకపోయింది. దీంతో కళాశాల యాజమాన్యం అతన్ని అప్రంటీస్‌షిప్‌నకు పంపలేదు.


ఒక్క విడత డబ్బులూ చెల్లించలేదు

- తేజ, విద్యార్థి

బీటెక్‌ రెండో ఏడాది చదువుతున్నా. ప్రభుత్వం ఏటా ఒక్కో కళాశాల విద్యార్థికి ఫీజు తిరిగి చెల్లింపు (బోధన రుసుము) పేరిట రూ.35వేలు ఉచితంగా అందిస్తోంది. మొత్తం 4 విడతల్లో సొమ్ము విడుదల చేస్తారు. అవి తిరిగి కళాశాలకు చెల్లిస్తాం. ఈ ఏడాది ఇంత వరకూ ఒక్కసారి కూడా జమ చేయలేదు. ఈ నెల 29వ తేదీ నుంచి చివరి పరీక్షలు నిర్వహించనున్నారు. మరో పది రోజుల్లో కళాశాలకు సెలవు ప్రకటిస్తారు. ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో సొంత డబ్బులు కట్టాం. మొదటి విడతగా కళాశాలకు రూ.8,750 ఫీజు చెల్లించాల్సి వచ్చింది. బోధన రుసుము ఎప్పుడు అందుతుందో లేదో కూడా అర్థం కావడం లేదు.


సుమారు 350 మంది విద్యార్థులు ఉన్న డిగ్రీ కళాశాల నిర్వహణకు కనీసం నెలకు  రూ.4లక్షల నుంచి రూ.5లక్షల వరకు ఖర్చవుతోంది. విద్యార్థులు ఫీజులు చెల్లిస్తేనే కదా? ముందుకు నడిచేది. వారిని అడిగితే మాకు జగన్‌ ఇంకా వేయలేదని చెబుతారు? మా పరిస్థితి ఏమిటి? కళాశాల ఎలా నడుస్తుంది. ఈ రంగంపై ఆధారపడిన వారు ఎలా బతుకుతారు? ఈ ప్రభుత్వం అందరికీ అన్ని రకాలుగా అన్యాయం చేసింది. 25 సంవత్సరాల నుంచి విద్యారంగంలో ఉన్నా.. ఏనాడూ ఇంతటి దయనీయస్థితి చూడలేదు.

తెనాలిలోని ఓ కళాశాల పర్యవేక్షకుడు


బాపట్ల జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో 2023లో బీటెక్‌ పూర్తి చేసిన పొన్నూరుకు చెందిన శ్రావ్య రూ. 30వేల ఫీజు చెల్లించాల్సి ఉంది. ఇది కడితేనే మార్కుల ధ్రువపత్రాలు ఇస్తామని కళాశాల యాజమాన్యం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు రాగానే చెల్లిస్తామని, హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ కొలువు అవకాశం వచ్చిందని ప్రాథేయపడినా యాజమాన్యం దిగిరాలేదు. దీంతో ఆమె కొలువును కోల్పోవాల్సి వచ్చింది.


ఇప్పటికీ జమ కాలేదు..

  • ప్రస్తుత విద్యా సంవత్సరం మరికొద్ది రోజుల్లోనే ముగియబోతోంది. ఎప్పుడో జూన్‌, జులై నెలల్లో విడుదల కావాల్సిన మొదటి వాయిదా రుసుముల సొమ్ముకు ఈ ఏడాది మార్చి 1న జగన్‌ బటన్‌ నొక్కారు. ఆ తరువాత పది రోజులకు కొద్ది మంది విద్యార్థులకే ఆ మొత్తం జమైంది. బటన్‌ నొక్కి 55 రోజులు గడిచినా ఇప్పటి వరకూ మొదటి వాయిదా ఫీజులే అత్యధిక విద్యార్థులకు జమ కాలేదంటే ప్రభుత్వ నిర్లక్ష్యం అర్థం చేసుకోవచ్చు.
  • కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి ఫీజులు చెల్లించి ధ్రువపత్రాలు తీసుకెళ్తున్నారు. రుణం పుట్టనివారు వేచి చూడాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు.
  • కొవిడ్‌ కాలంలో రెండేళ్లపాటు క్లాసులు జరగలేదని బోధనా రుసుములు ఇవ్వలేదు. ఆ తర్వాత మూడేళ్ల నుంచి ఇబ్బందులు పడుతున్నామని పలువురు విద్యార్థులు చెప్పారు. కళాశాలల యాజమాన్యాలు సైతం తమపై విపరీతమైన ఒత్తిడి తెస్తున్నాయని వాపోయారు.
  • గుంటూరు జిల్లాలోని 25 వరకు ఇంజినీరింగ్‌, ఇతర పీజీ కళాశాలల్లో దాదాపు 10 వేల మంది విద్యార్థులున్నారు. మరో 10వేల మంది డిగ్రీ, ఇతర కోర్సుల విద్యార్థులు ఉన్నారు. ఏడాదిలో ప్రతి మూడు నెలలకోసారి నాలుగు వాయిదాల్లో రుసుములు చెల్లిస్తామని చెప్పిన జగన్‌ సర్కారు.. ఈ అయిదేళ్లలో కచ్చితమైన సమయానికి జమ చేసిన సందర్భం లేదని కళాశాలల యాజమాన్యాలు పెదవి విరుస్తున్నాయి.

కోర్సుల ఫీజులు తగ్గించడంతో

  • బోధనా రుసుముల విషయంలో విద్యార్థులను ఇబ్బంది పెట్టడమే కాకుండా ఆయా కోర్సుల ఫీజులను తగ్గించేసి అయిదేళ్లుగా తమనూ యాతన పెట్టిందని కళాశాలల యాజమాన్యాలు ఆవేదన చెందుతున్నాయి. ఫీజులను తగ్గించేయడం వల్ల కళాశాలల నిర్వహణ భారంగా మారడంతో తన వాటా అమ్మేసుకుని బయటకు వచ్చేశానని అమరావతి రోడ్‌లో ఉన్న ఓ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వాహకుడు చెప్పారు.2004 నుంచి బోధనా రుసుముల చెల్లింపు విధానం ఉన్నా ఏ ప్రభుత్వ హయాంలోనూ ఇలా జాప్యం కాలేదు.
  • నాలుగేళ్ల కిందట ఇవ్వాల్సిన పీజీ విద్యార్థుల రుసుములను నేటికీ జగన్‌ సర్కారు చెల్లించలేదు. ఈ కారణంగా కోర్సులను పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు తమ ధ్రువపత్రాలను తీసుకెళ్లలేదని ప్రత్తిపాడు రోడ్‌లో ఉన్న ఓ కళాశాల నిర్వాహకులు తెలిపారు.
  • విద్యార్థుల చదువులపై జగన్‌ సర్కారుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వారి ఉన్నత చదువులకు, ఉపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా రుసుములను విడుదల చేసి ఉండేది. కానీ అలా చేయలేదు. ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సులు పూర్తి చేసిన వారికి కూడా ఇప్పటికీ బకాయి పెట్టింది. దీంతో చాలా మంది తమ ధ్రువపత్రాలను తీసుకెళ్లలేక కొలువులకు, ఉన్నత చదువులకు దూరమయ్యారని కళాశాలల యాజమాన్యాలు సైతం చెబుతున్నాయి.
  • అంతేకాదు.. అకడమిక్‌ క్యాలెండర్‌ అమల్లోనూ పూర్తి నిర్లక్ష్య వైఖరే. ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు సమయపాలన పాటించకపోవడంతో వేల మంది విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని