logo

నేటితో ముగియనున్న నామినేషన్ల ఉపసంహరణ

సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రిజిస్టర్‌ పార్టీలు,

Published : 29 Apr 2024 06:30 IST

జిల్లాపరిషత్తు (గుంటూరు), న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం సోమవారంతో ముగియనుంది. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంతో పాటు జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులతో పాటు రిజిస్టర్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు గడువు ఉంది. గుంటూరు పార్లమెంట్‌కు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. వైకాపా నుంచి కిలారి వెంకటరోశయ్య, ఇండియా కూటమి అభ్యర్థిగా జంగాల అజయ్‌కుమార్‌తో పాటు మొత్తం 47 నామినేషన్లు దాఖలయ్యాయి. పలు రాష్ట్రాలు, జిల్లాలకు చెందిన అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఈనెల 26న రిటర్నింగ్‌ అధికారి, జిల్లా కలెక్టరు ఎం.వేణుగోపాల్‌రెడ్డి వాటిని పరిశీలించగా నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 13 నామినేషన్లు తిరస్కరించారు. మిగిలినవి ఆమోదించారు.

బరిలో నిలిచేదెవరో తేలిపోతుంది..

ప్రధాన పార్టీల నుంచి ముగ్గురితో పాటు మరో 33 మంది అభ్యర్థులు ఉండగా వీరిలో ఎంత మంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఆయా అభ్యర్థులతో రాజకీయ పార్టీల నాయకులు చర్చలు జరుపుతున్నారు. నామినేషన్లను ఉపసంహరించుకోవాలని వారిని కోరుతున్నారు. రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు వేయడంతో అందరి దృష్టి ఇటు వైపు కేంద్రీకృతమైంది. గుంటూరు పార్లమెంట్‌ నియోజకవర్గంలోని తాడికొండ, మంగళగిరి, పొన్నూరు, తెనాలి, ప్రత్తిపాడు, గుంటూరు పశ్చిమ, తూర్పు అసెంబ్లీ నియోజకవర్గాలకు మొత్తం 181 నామినేషన్లు దాఖలయ్యాయి. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 40 తిరస్కరించారు. సక్రమంగా ఉన్న 141 మందివి ఆమోదించారు. వీరిలో ఎంత మంది ఉపసంహరించుకుంటారనేది సోమవారం తేలనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది.

మంగళగిరిపై ఆసక్తి...

మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 44 నామినేషన్లు దాఖలు కాగా.. రెండు తిరస్కరించారు. ఇక్కడి నుంచి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పోటీలో ఉన్నారు. వైకాపా నుంచి మురుగుడు లావణ్య నామినేషన్‌ వేశారు. స్వతంత్ర అభ్యర్థిగా మురుగుడు లావణ్య పేరుతో ఉన్న మరో మహిళ నామినేషన్‌ వేయడంతో ఆమెను పోటీ నుంచి విరమించేందుకు వైకాపా నాయకులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. జాతీయ, రాష్ట్ర పార్టీలకు గుర్తింపు చిహ్నాలు కేటాయిస్తారు. రిజిస్టర్‌, స్వతంత్ర అభ్యర్థులు ఎన్నికల కమిషన్‌ ఆమోదించిన గుర్తులు కేటాయిస్తారు. అభ్యర్థులు ఎవరనేది స్పష్టత వచ్చాక ఎన్నికల ప్రచారం మరో ఎత్తుకు తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌కల్యాణ్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఓ విడత జిల్లాలో ఎన్నికల ప్రచారం చేశారు. సోమవారం పొన్నూరుకు సీఎం జగన్‌ రానున్నారు. మేలో తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. దాంతో అభ్యర్థుల తరఫున ప్రచారం కోసం ఆయా పార్టీల అధినేతలతో పాటు స్థానిక నాయకులు ప్రచారాన్ని ముమ్మరం చేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు