logo

ఏకోపాధ్యాయ పాఠశాలలు.. దిగజారిన విద్యా ప్రమాణాలు

రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారకుండా చూస్తాం.. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలును విస్మరించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయకుండానే అయిదేళ్ల పాలన పూర్తి చేశారు.

Published : 01 May 2024 05:40 IST

అమలు కాని జగన్‌ పాదయాత్ర హామీలు
గుంటూరు విద్య, న్యూస్‌టుడే

రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారకుండా చూస్తాం.. ఏకోపాధ్యాయ పాఠశాలలు లేకుండా చేస్తామని పాదయాత్రలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీల అమలును విస్మరించారు. ఉపాధ్యాయ నియామకాల కోసం ఒక్క డీఎస్సీ కూడా వేయకుండానే అయిదేళ్ల పాలన పూర్తి చేశారు. దీనికితోడు జీవో 117తో ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ అడ్డదిడ్డంగా చేయడంతో కొన్ని బడులు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మారాయి. దీంతో ఆయా పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పడిపోయి బోధన ముందుకు సాగక విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. జాతీయ విద్యావిధానం అమలుపేరుతో 3, 4, 5 తరగతులను దగ్గరలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయడంతోపాటు ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు పంపారు. ప్రాథమిక స్థాయిలో అనేక పాఠశాలల్లో 1, 2 తరగతులకు ఒక ఉపాధ్యాయుడుతోనే నెట్టుకొస్తున్నారు. విలీనం కానీ పాఠశాలల్లోనూ అయిదు తరగతులను ఏకోపాధ్యాయుడితోనే నిర్వహిస్తున్నారు.


విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు

పాఠశాలలను అసంబద్ధంగా విలీనం చేయడం, ప్రాథమిక తరగతుల ఉపాధ్యాయులను ఉన్నత పాఠశాలలకు మార్చడంతో ఏకోపాధ్యాయ బడులు పెరుగుతున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్క ఉపాధ్యాయుడే తరగతులన్నీ చెప్పడంతో బోధన ప్రమాణాలు తగ్గి విద్యార్థులు చదువులో వెనుకబడుతున్నారు. జీవో 117 రద్దు చేయాలని పలుమార్లు ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు.

మధుసూదన్‌, ఉపాధ్యాయుడు


ప్రయివేటు పాఠశాలలకు వెళ్తున్నారు

పాఠశాలల విలీనంతో 3, 4, 5 తరగతులు ఉన్నత పాఠశాలల్లో కలిశాయి. ప్రాథమిక స్థాయిలో 1, 2 తరగతుల విద్యార్థులు అక్కడే ఉండిపోయారు. చిన్నారి విద్యార్థుల అక్క, అన్నలు వేరే పాఠశాలలకు వెళ్లడంతో కొందరు బడికి వెళ్లమని మారం చేస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు ఆర్థిక భారమైనా ప్రయివేటు పాఠశాలల్లో చేర్చి చదివిస్తున్నారు. విలీనం కాకుండా అయిదు తరగతులున్న పాఠశాలల్లో ఏకోపాధ్యాయుడున్న చోట్ల సమస్య మరింత తీవ్రంగా ఉంది. విద్యార్థులందరినీ ఒకే సెక్షన్‌లో కూర్చోబెట్టి చదివించడంతో సామర్థ్యాలు, పరిజ్ఞానం సాధించలేక వెనుకంజలో ఉంటున్నారు.

శేషగిరి, ఉపాధ్యాయుడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని