logo

కొలిక్కి రాని కుక్కర్‌ కూపన్ల కథ.. ఆర్డర్‌ ఇచ్చిన వ్యక్తి కోసం గాలింపు

నందమూరినగర్‌లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్‌లో పెద్ద మొత్తంలో పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్ల కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీటిని ఆర్డర్‌ ఇచ్చాడని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్‌ యజమాని గురుప్రసాద్‌ చెబుతున్నారు.

Updated : 01 May 2024 07:09 IST

కుక్కర్‌ కూపన్లు ఇవే...

విజయవాడ నేరవార్తలు, న్యూస్‌టుడే : నందమూరినగర్‌లోని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్‌లో పెద్ద మొత్తంలో పట్టుబడిన వైకాపా కుక్కర్ల కూపన్ల కేసు దర్యాప్తు ఇంకా కొలిక్కి రాలేదు. పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తి వీటిని ఆర్డర్‌ ఇచ్చాడని లక్కీ క్వాలిటీ ప్రింటర్స్‌ యజమాని గురుప్రసాద్‌ చెబుతున్నారు. సంబంధిత చిరునామాను అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు పరిశీలిస్తే.. అది తప్పుడు చిరునామాగా నిర్ధారించారు. ప్రింటింగ్‌ ప్రెస్‌ యజమాని కాల్‌ డిటైల్స్‌లో శ్రీనివాసరావు ఫోన్‌ నంబర్‌ లేకపోవటంతో.. అసలు శ్రీనివాసరావు అనే పాత్ర ఉందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీనివాసరావు ఇచ్చిన ఫోన్‌ నంబర్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉండడంతో దాని వివరాలు తెలియడం లేదు.

సీడీఆర్‌ వస్తేనే...

శ్రీనివాసరావు ఫోన్‌ నంబరుకు సీడీఆర్‌ (కాల్‌ డిటైల్‌ రికార్డ్‌) కోసం పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ వివరాలు వస్తే తప్ప కూపన్లు ఆర్డర్‌ ఇచ్చిన వ్యక్తికి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయో తెలుస్తాయని అంటున్నారు. అప్పుడే ఒక కొలిక్కి వస్తుందని చెబుతున్నారు.

లక్ష కూపన్లు ఎవరి కోసం...

పోలీసులు స్వాధీనం చేసుకున్న 1,26,000 వైకాపా గుర్తు ఉన్న కుక్కర్‌ కూపన్లు ఒక్క నియోజకవర్గానికి చెందినవి కాకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పల్నాడు జిల్లా నుంచి విజయవాడకు వచ్చి కూపన్లు ఆర్డర్‌ ఇచ్చారంటే.. సదరు వ్యక్తి వివరాలు తెలియకూడదని ఇలా చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు ఎన్టీఆర్‌ జిల్లాలోని నాలుగు ముఖ్యమైన నియోజకవర్గ నాయకులు కలిసి ఈ కూపన్లు ఆర్డర్‌ ఇచ్చారంటూ సర్వత్రా వినిపిస్తోంది. దీనిపై పోలీసులు నిఘా ఉంచారు. కూపన్‌లో నంబర్‌ ఉన్న చోట ఖాళీగా ఉంది. ఆ ఖాళీలో మాన్యువల్‌గా నంబరు ముద్రిస్తారని, ఈ లోగా ఎన్నికల అధికారుల తనిఖీల్లో పట్టుబడ్డాయని తెలుస్తోంది. లక్షకు పైగా ఉన్న కూపన్లు ఒకే నియోజకవర్గానికి ఉండకపోవచ్చని.. కనీసం నాలుగు నియోజకవర్గాలకు కలిపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఆ నియోజకవర్గాలు ఏవి అనేది తెలియరాలేదు. పోలీసులు సైతం కుక్కర్లు ఎక్కడ దాచి ఉంచారో అని వెతుకుతున్నారు. వన్‌టౌన్‌ తదితర ప్రాంతాల్లో ఉన్న డీలర్ల గురించి ఆరా తీశారు. ఇప్పటి వరకు చిన్న పాటి క్లూ కూడా లేకపోవటంతో అజిత్‌సింగ్‌నగర్‌ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇటీవల ముఖ్యమంత్రిపై రాయి దాడి ఘటన.. ఇదే పోలీస్‌స్టేషన్‌ పరిధిలోనే జరిగింది. తాజాగా కుక్కర్‌ కూపన్ల కేసుతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని