logo

నేతలు.. ‘మేత’లు

జేపీ కంపెనీ ఇసుక తవ్వకాల నుంచి తప్పుకున్న తర్వాత ఇసుక వ్యాపారాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేజిక్కించుకున్నారు.

Published : 02 May 2024 06:39 IST

జిల్లాలో సహజవనరులు యథేచ్ఛగా దోపిడీ 
అయిదేళ్లలో రూ.వందల కోట్లు స్వాహా

వైకాపా అయిదేళ్ల పాలనలో పల్నాడు జిల్లాలో సహజ వనరులు యథేచ్ఛగా దోపిడీకి గురయ్యాయి. రూ.వందల కోట్ల ఇసుక, మట్టి, సున్నపురాయి వంటి వాటిని అక్రమంగా తవ్వుకుని సొమ్ము చేసుకున్నారు. ప్రజల సమస్యలు మాత్రం పక్కన పెట్టి వారిని కష్టాల్లోకి నెట్టారు. అధికారం అండతో వ్యవస్థలను జేబు సంస్థలుగా మార్చుకుని ప్రజాప్రతినిధులు బరితెగించారు. ఈ క్రమంలోనే రూ.కోట్లు వెనకేసుకున్నారు. ఎన్నికల వేళ ప్రజలారా ఆలోచించండి. పోలింగ్‌ రోజు సరైన నిర్ణయం తీసుకోండి. మీ చేతుల్లోనే మీ భవిష్యత్తు.. రాష్ట్ర పురోభివృద్ధి ఉందని గమనించండి.  

 ఈనాడు డిజిటల్‌, నరసరావుపేట

ఇసుకతో రూ.కోట్లు

మల్లాది రీచ్‌లో ఇసుక తవ్వకాలు

జేపీ కంపెనీ ఇసుక తవ్వకాల నుంచి తప్పుకున్న తర్వాత ఇసుక వ్యాపారాన్ని పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేజిక్కించుకున్నారు. నియోజవర్గానికి సంబంధంలేని నలుగురు వ్యక్తులను అనుచరులుగా పెట్టుకొని వారి అండతో ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడుతూ రూ.కోట్లకు పడగలెత్తారు. ప్రతిరోజు వెయ్యి లారీల్లో ఇసుక తరలిస్తూ అక్రమ సంపాదనకు తెరతీశారు. పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా కృష్ణానదిలో అడ్డుగా రహదారులు వేశారు. నదిపై మట్టి వంతెనల నిర్మాణానికి పెద్ద బండరాళ్లను, కంకరను ఉపయోగించారు. నదీ ప్రవాహానికి అడ్డకట్ట వేసి ప్రవాహం గతిని మార్చి కృష్ణమ్మకు సైతం గర్భశోకం మిగిల్చారు. రోజూ వందల లారీల్లో ఇసుక తరలించారు. తవ్వకాలకు అనుమతులు లేకపోయినా నదీ గర్భంలో నుంచి లక్షల టన్నుల ఇసుకను తరలించారు. వైకుంఠపురం, కోనూరు ఇసుక రీచ్‌ల నుంచి తరలించిన ఇసుకతో కృత్రిమ ఇసుక కొండలను తయారు చేశారు. ఈ క్రమంలోనే సదరు ప్రజాప్రతినిధి రూ.కోట్లలో వెనకేసుకున్నారు.
ఎర్రమట్టిని దోచారు : సత్తెనపల్లిలో ప్రజాప్రతినిధి అల్లుడి ఆధ్వర్యంలో అక్రమ మైనింగ్‌, ఎర్రమట్టి తవ్వకాలు సాగినా అధికారులెవ్వరూ చర్యలు తీసుకోవడానికి సాహసం చేయలేదు. నకరికల్లు, త్రిపురాపురం, గొల్లపల్లిలో కొండల్ని పీల్చి పిప్పిచేశారు. నకరికల్లు మండలంలో ఎక్కడైనా మంత్రి అనుచరులే మట్టి తవ్వకాలు చేపట్టాలి. ట్రాక్టర్‌ ఎర్రమట్టి రూ.వేలల్లో అమ్ముకుంటూ భారీగా సొమ్ముచేసుకున్నారు. రాజుపాలెం మండలం వీరవల్లిపాయ, ఉప్పలపాడు శివారుల్లో డీకే పట్టాభూములను లీజుకు తీసుకుని అనుమతులు లేనిచోట కూడా మట్టి తవ్వకాలు చేపట్టారు. త్రిపురాపురం కొండను ఆనవాలు లేకుండా మింగేశారు. కొండమోడులో అక్రమంగా మైనింగ్‌ తవ్వకాలు, కోట నెమలిపురిలో సున్నపురాయిని అక్రమంగా తవ్వుకుంటూ ప్రజాప్రతినిధికి వాటాలు అంద జేశారు.

అమ్మవారి ఆలయ సమీపంలోనూ..

మాచర్లలో అక్రమ తవ్వకాలు అడ్డుకున్న వారు లేరు. ప్రజాప్రతినిధి అండ చూసుకుని నియోజకవర్గంలోని వైకాపా నేతలు దుర్గి మండలంలో నిదానంపాటి అమ్మవారి ఆలయానికి సమీపంలో మట్టితవ్వకాలు చేపట్టారు. ఆత్మకూరు చెరువులోనూ భారీగా మట్టిని తవ్వి సొమ్ముచేసుకున్నారు. కొత్తపల్లి-కొప్పునూరులో కొండ తవ్వి ఎర్రమట్టిని అమ్ముకున్నారు. కారంపూడి మండలం పేటసన్నిగండ్లకు సమీపంలో భారీగా క్వార్ట్జ్‌ ఖనిజం తవ్వకాలు చేపట్టి వందల కోట్లు కొల్లగొట్టారు.

మట్టి తవ్వకాలతో గోతులు  

నరసరావుపేట మండల పరిధిలోని ములకలూరు, పెట్లూరివారిపాలెం, ఇసప్పాలెం, కోటప్పకొండ, గోనెపూడి పరిసర ప్రాంతాల్లో మట్టి తవ్వకాల ద్వారా వైకాపా నేతలు రూ.కోట్లలో సొమ్ము చేసుకున్నారు. మట్టి తవ్వకాల నుంచి ముఖ్యనేతకు వాటాలు వెళ్లాయి.  ఆయన అండదండలతోనే వైకాపా నేతలు బరితెగించారు. గొనేపూడి పరిసరాల్లో తవ్వకాలతో పెద్దపెద్ద గోతులు ఏర్పడ్డాయి.  

నాపరాయిని సొమ్ము చేసుకున్నారు

గురజాల నియోజకవర్గంలో నాపరాయి భూములు ఎక్కువ.  వైకాపా నేతలు అయిదేళ్లలో వాటితో పండగ చేసుకున్నారు. పిడుగురాళ్ల, దాచేపల్లి పరిసర ప్రాంతాల్లో భూముల్లోంచి అక్రమంగా నాపరాయి తవ్వకాలు చేపట్టారు. గురజాల మండలం మాడుగులలో ఎర్రమట్టి తవ్వకాలతో చారిత్రక నేపథ్యం ఉన్న స్తంభాలబోడు కొండను ఆనవాళ్లు లేకుండా చేశారు. మొన్నటివరకూ ఇక్కడ రంగురాళ్ల తవ్వకం చేపట్టారు. ఎరుపు, తెలుపు రాళ్లు బయటపడుతుండడంతో వాటిని అమ్మి సొమ్ముచేసుకున్నారు. నెల్లూరుకు తరలించి అక్కడి నుంచి విదేశాలకు పంపుతూ రూ.కోట్లు వెనకేసుకున్నారు. అనుమతుల్లేకుండా భారీగా ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టారు.

చారిత్రక మట్టికట్ట మాయం

చిలకలూరిపేటలోనూ యథేచ్ఛగా సహజవనరుల దోపిడీ సాగింది. యడ్లపాడు మండలం సంఘం గోపాలపురంలో అసైన్డ్‌భూములు 600 ఎకరాలున్నాయి. ఇక్కడ భారీస్థాయిలో 50 నుంచి 100 ఎకరాల మట్టి తవ్వకాలు చేపట్టి సొమ్ముచేసుకున్నారు. కొండవీడులో చారిత్రక మట్టికట్టను     ఆనవాళ్లు లేకుండా చేశారు.

బలపాల కొండ మింగారు

రాష్ట్రంలో నాణ్యమైన బలపాల రాయి వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలంలో దొరుకుతుంది. రేమిడిచర్ల గ్రామంలో సర్వే నంబరు 585లో వంద ఎకరాల్లో బలపాల కొండ విస్తరించింది. నియోజకవర్గ వైకాపా నాయకుల కన్ను దీనిపై పడింది. కొంతకాలం ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపట్టడంతో అప్పట్లోనే ‘ఈనాడు’ వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు చర్యలు తీసుకోవడానికి సిద్ధపడడంతో కొంతకాలం వెనకడుగువేశారు. కొన్నాళ్లకు మళ్లీ తవ్వకాలు షురూ అయ్యాయి. ఈసారి కేవలం రాత్రి వేళల్లోనే తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించుకుని ఆ విధంగా కొండను కొల్లగొట్టారు. స్థానిక వైకాపా నేతలు తవ్వుకుని అందులో వాటాలను ముఖ్యనేతకు నెలవారీ పంపేవారు. అలా బలపాలకొండను కొంత మింగేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని