logo

వైకాపా ఎమ్మెల్యే గోపిరెడ్డి బరితెగింపు

నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది.

Updated : 07 May 2024 07:10 IST

పోస్టల్‌ బ్యాలెట్‌ కేంద్రం వద్ద హల్‌చల్‌
తెదేపా నేత వాహనంపై దాడులు
వైకాపా మూకలు రెచ్చిపోవడంతో ఉద్యోగుల ఆందోళ

ఈనాడు-అమరావతి, నరసరావుపేట అర్బన్‌ న్యూస్‌టుడే : నరసరావుపేటలో సార్వత్రిక ఎన్నికల పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియలో రెండోరోజు వైకాపా నేతల ఆరాచకం రాజ్యమేలింది. వైకాపా మూకల అఘాయిత్యాలకు హద్దే లేకుండా పోయింది. నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దగ్గరుండి తెదేపా నేతలు, వాహనాలపై దాడి చేయించడం చూసి.. ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగులు ఇదేం సంస్కృతి అంటూ మండిపడ్డారు. పట్టణంలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాలలో ఉద్యోగులకు పోస్టల్‌ బ్యాలెట్‌  ఓటింగ్‌ నిర్వహిస్తున్నారు. సోమవారం ఉదయం 9.30కు కేంద్రానికి వచ్చిన ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్యాహ్నం 12.30 వరకు అక్కడే ఉండి హల్‌చల్‌ చేశారు.  తొలిరోజు ఓటింగ్‌ సరళి తనకు వ్యతిరేకంగా ఉందని గ్రహించిన వైకాపా ఎమ్మెల్యే వైకాపాకు చెందిన మిలటరీ సత్యనారాయణరెడ్డిని పంపి ఉద్యోగులను ప్రలోభ పెట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈక్రమంలో ఓ మహిళా ఉద్యోగిని నుంచి సత్యనారాయణరెడ్డి ఫారం లాక్కునే ప్రయత్నం చేశాడు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించి అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుతో పోలీసులు అక్కడి నుంచి సత్యనారాయణరెడ్డిని బయటికి పంపారు. అదే సమయంలో తెదేపా అభ్యర్థి అరవిందబాబు పోలింగ్‌ కేంద్రంలోకి పరిశీలనకు వస్తున్నారు. ఇది గమనించిన సత్యనారాయణరెడ్డి పోలింగ్‌ కేంద్రంలోకి ఎలా వస్తారంటూ తెదేపా అభ్యర్థిని అడ్డుకున్నారు. అరవిందబాబు వెంట ఉన్న నేతలు సత్యనారాయణరెడ్డిని కారులో ఎక్కించుకుని పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి అప్పగించారు. కొద్దిసేపటికే పోలీసులు అతన్ని వదిలేశారు. ఈక్రమంలో సత్యనారాయణరెడ్డి వైకాపా నేతలకు సమాచారం ఇవ్వగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు అనుచరులు, కార్యకర్తలు పెద్దఎత్తున పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నారు.

అరవిందబాబుపై కేసు పెట్టాలని గొడవ

ఎమ్మెల్యే పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లి తెదేపా అభ్యర్థిని కేంద్రంలోకి ఎలా అనుమతించారంటూ వాదనకు దిగి రిటర్నింగ్‌ అధికారిని నిలదీశారు. అరవిందబాబుపై కేసు పెట్టాలని గొడవకు దిగారు. అనంతరం బయటికి వచ్చిన ఎమ్మెల్యే, ఆయన అనుచరులు అటుగా వస్తున్న కుంకులగుంటకు చెందిన తెదేపా నేత వాహనాన్ని చూసి దాన్ని ధ్వంసం చేసి కారు డ్రైవర్‌ను చితకబాదారు. విషయాన్ని తెలుసుకున్న తెదేపా నేతలు లాంకోటేశ్వరరావు తదితరులు మూడు వాహనాల్లో పోలింగ్‌ కేంద్రం వద్దకు వచ్చారు. ఈ సమయంలో రాళ్లు, కర్రలతో మూడు వాహనాలపై వైకాపా మూకలు దాడి చేసి ధ్వంసం చేసి ఇద్దరు కార్యకర్తలను తీవ్రంగా కొట్టారు. సమాచారం తెలుసుకున్న ఎంపీ అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలు పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అదనపు బలగాలు వచ్చి మూకలను చెదరగొట్టగా వివాదం సద్దుమణిగింది. ఎమ్మెల్యే కనుసన్నల్లో వాహనాల ధ్వంసం, దాడులు జరగడం గమనార్హం. ఎమ్మెల్యే దగ్గరుండి దాడులు చేయించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. పోస్టల్‌ బ్యాలెట్‌ రోజే పరిస్థితి ఇలాగుంటే నియోజకవర్గంలో ఎన్నికల విధులు ఎలా నిర్వర్తించాలో అని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేశారు. స్వయంగా ఎమ్మెల్యే సమక్షంలోనే దాడులు చేస్తున్నా పోలీసులు తక్కువమంది ఉండటంతో దాడులను అడ్డుకోలేకపోయారు. పట్టణంలో సుమారు మూడుగంటల పాటు వాదనలు, దాడులు, వాహనాల విధ్వంసం జరుగుతున్నా పోలీసులు అడ్డుకోవడంలో విఫలమయ్యారు. జిల్లా కేంద్రంలోనే ఈ పరిస్థితి ఏర్పడితే పోలింగ్‌ రోజు గ్రామాల్లో ప్రశాంతంగా ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్షనేతలు ప్రశ్నిస్తున్నారు. పోలీసుస్టేషన్‌కు కిలోమీటరు దూరంలో గొడవ జరుగుతున్నా సకాలంలో పోలీసులు అడ్డుకోలేకపోవడం, పోలింగ్‌ ప్రశాంతంగా చూడాల్సిన పోలీసు యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం.


‘ఈనాడు’ విలేకరి ఎక్కడున్నాడో చూడండి

వైకాపా మూకలు తెదేపా నేతల వాహనాలు, కార్యకర్తలపై తెగబడి దాడులు చేస్తున్న వైనాన్ని మీడియా ప్రతినిధులు చిత్రీకరిస్తున్నారు. దీన్ని గమనించిన వైకాపా నేతలు వీడియోలు, చిత్రాలు తీయొద్దంటూ మీడియా ప్రతినిధులను బెదిరించారు. ఈక్రమంలో ‘ఈనాడు’ విలేకరి ఎక్కడున్నారో గుర్తించి ఫొటోలు, వీడియోలు తీస్తే ఊరుకోవద్దని హెచ్చరించారు. దీంతో ‘ఈనాడు’ ప్రతినిధి అక్కడి నుంచి వెళుతుండగా ఎక్కడికి వెళుతున్నారో చూడండంటూ గట్టిగా అరిచారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో వ్యతిరేకంగా ఓట్లు పడుతున్నాయన్న అక్రోశంతో వైకాపా నేతలు, కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉద్యోగులకు ప్రలోభాలు ఎరవేయాలని చూసినా వారు వ్యతిరేకించడంతో దాడులకు తెగబడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని