logo

ఎన్నికల సామగ్రికి పంచాయతీ నిధులు

సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఎప్పటి నుంచో వస్తుంది. ఈసారి జగన్‌ సర్కారు గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక సంస్థలపై ఎన్నికల నిర్వహణ  భారం వేస్తోంది.

Published : 08 May 2024 06:11 IST

ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న సర్పంచులు

సత్తెనపల్లి, శావల్యాపురం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లకు అయ్యే ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వం భరించడం ఎప్పటి నుంచో వస్తుంది. ఈసారి జగన్‌ సర్కారు గతంలో ఎన్నడూలేని విధంగా స్థానిక సంస్థలపై ఎన్నికల నిర్వహణ  భారం వేస్తోంది. అసలే నిధుల కొరతతో సాధారణ పౌరసేవలకు ఇబ్బందిపడుతున్న పంచాయతీలపై తాజాగా వీల్‌ఛైర్‌ల కొనుగోలు భారం వేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్‌ కేంద్రాల వద్ద వృద్దులు, వికలాంగులను కేంద్రాల లోపలకు తీసుకుని వెళ్లడానికి అవసరమయ్యే మూడు చక్రాల సైకిల్‌ను కొనుగోలు చేయాలని జిల్లా పంచాయతీ అధికారి ఎం.వి. భాస్కరరెడ్డి గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీ సాధారణ నిధుల నుంచి వీల్‌ఛైర్‌లు కొనుగోలు చేసి ఈవోపీఆర్‌డీలు నియోజకవర్గ ఎన్నికల అధికారికి వాటిని అప్పగించాలన్నారు. ఒక్కో వీల్‌ఛైర్‌ను రూ.5,049కి మార్కాపురానికి చెందిన ఫర్నిచర్‌ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలని  నిర్ణయించారు. వీల్‌ఛైర్‌లను సమకూర్చే బాధ్యత గతంలో రెవెన్యూశాఖ పరిధిలో ఉండేది. ఆ శాఖకు ప్రభుత్వం నిధులు అందజేసి కొనుగోలు చేయించేది. అసలే గ్రామాల్లో తాగునీరు, పారిశుద్ధ్యం పనులు చేపట్టడానికి నిధులు లేక నానా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఎన్నికల ప్రక్రియకు అవసరమైన సామగ్రి కొనుగోలుకు పంచాయతీ నిధులు కేటాయించడంపై సర్పంచులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  ఏడు నియోజకవర్గాల పరిధిలో మొత్తం 500 వీల్‌ఛైర్‌ల కొనుగోలు రూపంలో జిల్లాలోని పంచాయతీలపై రూ.25.24 లక్షల భారం పడబోతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని