logo

సూపర్‌6 తో సమగ్ర ప్రగతి

‘రైతులకు ఆదాయం, గౌరవం పెంచేలా సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో వారి జీవన ప్రమాణాలు పెంచుతాం. రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రగతికి అవకాశాలు విస్తృతమవుతాయి.

Updated : 08 May 2024 07:19 IST

పింఛను రూ.4వేలు ఏప్రిల్‌ నుంచే వర్తింపు
పొదుపు సంఘాలకు రూ.10లక్షల వడ్డీ లేని రుణం
రాజధాని పునర్నిర్మాణంతో విస్తృత అవకాశాలు
తెదేపా గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌
ఈనాడు-అమరావతి

‘రైతులకు ఆదాయం, గౌరవం పెంచేలా సాగును లాభసాటిగా తీర్చిదిద్దుతాం. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన మౌలిక వసతులతో వారి జీవన ప్రమాణాలు పెంచుతాం. రాజధాని అమరావతి నిర్మాణంతో ఈ ప్రాంత ప్రగతికి అవకాశాలు విస్తృతమవుతాయి. నాణ్యమైన విద్య, ఉపాధి కల్పనకు అవసరమైన నైపుణ్యాలు అక్కడే పెంపొందించుకునే విధానానికి శ్రీకారం చుడతాం. ఎన్నారైల సహకారంతో పాటు సొంత నిధులు వెచ్చించి ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తా. ఎన్నికల ప్రణాళికలో కూటమి ప్రకటించిన సూపర్‌-6 పథకాల ద్వారా మహిళలు, రైతులు, యువత స్వయం సంవృద్ధికి మార్గం సుగమం అవుతుంది. కష్టం, తెలివిని నమ్ముకుని పూర్తి సామర్థ్యంతో పనిచేసి గుంటూరు పార్లమెంటును ప్రగతిబాట పట్టిస్తానని’ తెదేపా ఎంపీ అభ్యర్థి డాక్టర్‌ పెమ్మసాని చంద్రశేఖర్‌ ‘ఈనాడు’ ప్రత్యేక ముఖాముఖిలో వివరించారు.

రాయితీలు అందిస్తాం.. పరిశ్రమలు తెస్తాం..

అన్ని వర్గాల ప్రజలు తమ పిల్లలకు ఉద్యోగాలు కావాలని కోరుతున్నారు. గౌరవప్రదమైన ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. ప్రపంచంలో వివిధ దేశాలు తిరిగి పరిశ్రమలు తీసుకొచ్చేందుకు కృషి చేస్తా. ఇక్కడ పత్తి, మిర్చి, పసుపు విస్తృతంగా పండుతున్నాయి. వీటిని శుద్ధి చేసి విలువ ఆధారిత ఉత్పత్తులుగా చేసేలా ప్రోత్సాహం అందిస్తాం. ఇందుకు శీతల గిడ్డంగులు, రవాణా సౌకర్యాలు కల్పిస్తాం. పరిశ్రమలు, మార్కెటింగ్‌, ఇతర అంశాలను సమన్వయం చేసుకుని ముందుకెళ్లాలి. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థల ఏర్పాటుకు ప్రాజెక్టు వ్యయంలో రూ.10లక్షల వరకు రాయితీ ఇస్తాం. ఔత్సాహికులైన యువకులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రత్యేక నైపుణ్య శిక్షణ కేంద్రాలను తెరిచి పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా నైపుణ్య శిక్షణ అందిస్తాం. పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు డిజిటల్‌ లైబ్రరీలు తీసుకొస్తాం. 

3 సిలిండర్లు ఉచితం.. ఛార్జీల భారం తగ్గిస్తాం

వైకాపా పాలనలో నిత్యావసరాల ధరలు రెట్టింపయ్యాయి. విద్యుత్తు, బస్సు ఛార్జీలతో తెలియకుండానే బాదేశారు. మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ధరలు అదుపులో ఉంచుతాం. కేంద్రం ప్రవేశపెట్టిన సోలార్‌ పథకాన్ని ఎక్కువ మంది  వినియోగించుకునేలా చేస్తే బిల్లుల భారం తగ్గుతుంది. ప్రతి ఇంటికి ఏడాదికి మూడు గ్యాస్‌ సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. జిల్లాలో లక్షల కుటుంబాలకు దీని ద్వారా లబ్ధి చేకూరుతుంది.

విద్యా, వైద్యానికి ప్రత్యేక ప్రణాళిక

జిల్లా నుంచి వెళ్లి వివిధ దేశాల్లో స్థిరపడినవారు జన్మభూమికి ఎంతో కొంత చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామాల వారీగా ఎన్‌ఆర్‌ఐల సమాచారం సేకరిస్తా. వారి సహకారంతో ప్రత్యేక ప్రణాళికతో విద్య, వైద్య రంగాలను బలోపేతం చేస్తాం. ఆస్పత్రుల నిర్మాణం చేపట్టి వైద్యులను నియమిస్తాం. పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం.

మైనార్టీలకు రూ.5లక్షల వడ్డీలేని రుణం

వైకాపా వచ్చాకనే చాలాచోట్ల ముస్లింలపై దాడులు జరిగాయి. ఆ విషయం వారికీ అర్థమై కూటమికి ఆదరణ పెరుగుతోంది. మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా రూ.5లక్షల వరకు వడ్డీ లేని రుణాలిస్తాం. ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్‌ ఇస్తాం. ఈద్గా, ఖబరస్థాన్‌లకు స్థలాలు కేటాయిస్తాం. ఇమామ్‌లకు ప్రతి నెలా రూ.10 వేలు, మౌజమ్‌లకు రూ.5వేలు గౌరవ వేతనం ఇస్తాం. క్రిస్టియన్‌ మిషనరీల ఆస్తుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు చేస్తాం.

అమరావతితోనే వైభవం

రాజధాని బృహత్తర ప్రణాళిక ప్రకారం జోన్‌ల వారీగా అభివృద్ధి మళ్లీ మొదలుపెడతాం. గతంలో ఇక్కడికి వస్తామని ఆసక్తి చూపిన 130 సంస్థలు వెళ్లిపోయాయి. వాటిలో కొన్నింటినైనా తిరిగి రప్పించి కార్యకలాపాలు ప్రారంభిస్తాం. ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో నిర్మాణాలు ప్రారంభమైతే రాజధాని నిర్మాణం రూపుదిద్దుకుంటుంది. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలిగించి ఇక్కడికి రప్పిస్తాం. ఇందుకు ఎంత కష్టమైనా భరిస్తాం. సాంకేతిక అడ్డంకులు తొలగించి గుంటూరు నగరంలో యూజీడీ పనులు పూర్తి చేస్తాం.

జగన్‌ ఓట్లకు ఉరితాడుగా భూచట్టం..

ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ కేంద్రం చెప్పిన విధంగా కాకుండా వైకాపా వారికి నచ్చిన విధంగా తీసుకొచ్చారు. భూమి పత్రాలు జిరాక్స్‌లు ఇవ్వడంతో భూ యజమానులు తమ భూమికి రక్షణ ఏమిటనే భయంతో ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ చట్టాన్ని ఎవరూ సమర్థించరు. ఈ చట్టమే జగన్‌కు ఓట్ల ఉరితాడుగా మారుతుంది.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..

మహిళలకు ఇంటి వద్దే ఉపాధి పొందడానికి ఉన్న అవకాశాలు గుర్తిస్తాం. నా సతీమణి భాగస్వామ్యంతో మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తా. సొంత నిధులతోనైనా వృత్తి నైపుణ్య శిక్షణ ఇస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తాం. జిల్లాలో 8లక్షల మందికి పైగా మహిళలు ఉన్నారు. స్వయం సహాయ సంఘాలకు ప్రస్తుతం రూ.2లక్షల వరకు ఇస్తున్న వడ్డీ లేని రుణాన్ని రూ.10 లక్షలకు పెంచుతాం. విద్యార్థినుల చదువులకు రుణాలు ఇప్పిస్తాం.

ప్రతి రైతుకు ఏటా రూ.20 వేలు

రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తాం. మార్కెట్‌కు అనుగుణంగా వారు పంటలు సాగు చేసేలా అధ్యయనం చేసి సూచనలు ఇస్తాం. పెట్టుబడి వ్యయం తగ్గించి రైతుకు ఆదాయం, గౌరవం పెరిగేలా చేస్తాం. బీ ఉత్పత్తుల నిల్వకు శీతల గిడ్డంగులు నిర్మిస్తాం. బీ గుంటూరు వాహిని పనులు రూ.250 కోట్లతో గత ప్రభుత్వంలో ప్రారంభిస్తే జగన్‌ రద్దు చేశారు. మేం అధికారంలోకి రాగానే గుంటూరు వాహిని సహా పెండింగులో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తాం.బీ రైతులకు ఏడాదికి రూ.20వేలు సాయం అందిస్తాం. బీ రాయితీపై సోలార్‌ పంపుసెట్లు ఇచ్చి మిగులు విద్యుత్తును వారి నుంచి కొనుగోలు చేస్తాం.బీ 9గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తాం.బీ కౌలు రైతులకు గుర్తింపు కార్డులిచ్చి ఆదుకుంటాం. బీ పంటలకు బీమా వర్తింపజేసి నష్టపోయిన రైతులకు సొమ్ము అందేలా చూస్తాం.

ప్రతినెలా 1నే జీతాలు, పింఛన్లు చెల్లిస్తాం

ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లిస్తాం. వారికి రావాల్సిన బకాయిలు కూడా ఇచ్చేస్తాం. ఉద్యోగులు, ఉపాధ్యాయుల గౌరవాన్ని పునః ప్రతిష్ఠించి అనుకూల వాతావరణం కల్పిస్తాం. ఉద్యోగులకు మెరుగైన పీఆర్‌సీ అమలు చేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్‌ ప్రకటిస్తాం. సీపీఎస్‌/జీపీఎస్‌ విధానాన్ని పునః సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం.

ఎన్నారైల సహకారంతో వివిధ వర్గాలకు చేయూత

నేను డబ్బుపై ఆశతో రాజకీయాల్లోకి రాలేదు. జిల్లా పరిధిలోని ఎన్‌ఆర్‌ఐలకు వారధిలా ఉంటా. వారిచ్చిన సొమ్ముకు సొంత నిధులు జోడించి వివిధ వర్గాల అభివృద్ధికి బాటలు వేస్తా.  బీ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే నెలకు రూ.4వేల పింఛన్‌ ఇస్తాం. బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెస్తాం. బీ బీసీలకు స్థానిక సంస్థలు, నామినేటెడ్‌ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. రూ.5వేల కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరించి పరికరాలు ఇస్తాం.

దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25వేల గౌరవ వేతనం ఇస్తాం. వడ్డెర్లకు క్వారీల్లో 15శాతం రిజర్వేషన్‌ కల్పించి రాయల్టీ, సీనరేజి ఛార్జీల్లో మినహాయింపు ఇస్తాం.బీ రజకులకు దోబీఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహమిస్తాం. వైకాపా రద్దు చేసిన సంక్షేమ పథకాలు ఎస్సీ, ఎస్టీల పథకాలను పునరుద్ధరిస్తాం. బీ కాపు సంక్షేమానికి రూ.15వేల కోట్లు కేటాయించి ఐదేళ్లలో ఖర్చు చేస్తాం. కాపు భవనాల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తాం. బీ ఆర్యవైశ్య కార్పొరేషన్‌కు నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. బీ చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణాలిస్తాం. బీ కమ్మ, రెడ్డి వెలమ ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు నిధులు కేటాయించి వారి సాధికారత, అభివృద్ధికి చర్యలు తీసుకుంటాం. బీ వార్షిక ఆదాయం రూ.50వేలకు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలకు పెంచుతాం.

పేదలకు ఇళ్లు.. సామాజిక పింఛన్లు

సామాజిక భద్రత పింఛను నెలకు రూ.4వేలకు పెంచుతాం. దీన్ని ఏప్రిల్‌ నుంచే వర్తింపజేస్తాం. దివ్యాంగుల పింఛను రూ.6వేలకు పెంచుతాం. కిడ్నీ, తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులకు నెలకు రూ.10వేల పింఛను అందిస్తాం. పేదలందరికీ పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు ఇంటి స్థలం ఇస్తాం. ఇప్పటికే పట్టాలు పొందిన వారికి పక్కా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని