logo

లెక్కలో తేడా రావొద్దు

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసింది.

Updated : 26 May 2024 04:30 IST

ఓట్ల లెక్కింపునకు  పకడ్బందీ ఏర్పాట్లు
విధి విధానాలపై యంత్రాంగానికి శిక్షణ

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను జీహెచ్‌ఎంసీ ప్రారంభించింది. జిల్లా పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్‌ పార్లమెంటు స్థానాలు, కంటోన్మెంట్‌ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు 16 కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఇందులో 15 కేంద్రాలు మామూలు ఓట్ల లెక్కింపునకు సంబంధించినవి కాగా ఒకటి తపాలా ఓట్లకు చెందింది. ఉదయం 5 గంటల నుంచే అధికార యంత్రాంగం ఏర్పాట్లను ప్రారంభిస్తుందని, 7 గంటలకు అన్ని కేంద్రాల్లో లెక్కింపు మొదలవుతుందని బల్దియా వెల్లడించింది. గతానికి భిన్నంగా తపాలా ఓట్ల లెక్కింపును ఈసారి వేగంగా పూర్తి చేయనున్నట్లు యంత్రాంగం తెలిపింది. ఉదయం 7 గంటలకు మొదలై, 7.30కి తపాలా ఓట్ల లెక్కింపు పూర్తవుతుందని అధికారులు స్పష్టంచేశారు.  

ఈనాడు, హైదరాబాద్‌

జూబ్లీహిల్స్‌లో 20 టేబుళ్లు..

జిల్లాలో 15 అసెంబ్లీ స్థానాలుండగా, వాటన్నింటికీ వేర్వేరు చోట్ల ఓట్ల లెక్కింపు కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో పార్లమెంటు స్థానం పరిధిలో ఏడు చొప్పున అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న విషయం తెలిసిందే. ఏడు అసెంబ్లీ స్థానాల ఫలితాలను సంబంధిత రిటర్నింగ్‌ అధికారి ఆయా కేంద్రాల నుంచి సేకరించి, రౌండ్ల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లు ప్రకటిస్తారు. గతంలో మాదిరి అసెంబ్లీల వారీగా 14 టేబుళ్లపై చేపడుతున్నామని, పోలింగ్‌ కేంద్రాలు ఎక్కువ ఉన్నందున జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో మాత్రం 20 టేబుళ్లు ఉంటాయని అధికారులు తెలిపారు. ప్రతి టేబుల్‌ వద్ద ఓ సూపర్‌వైజరు, ఇద్దరు సహాయకులు, సూక్ష్మ పరిశీలకుడు ఉంటారు. ఈ ప్రక్రియను ప్రత్యక్షంగా చూసేందుకు పోటీలోని అభ్యర్థులు, వారి ఏజెంట్లకు పరిమిత సంఖ్యలో అనుమతి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియను సీసీ కెమెరాలు రికార్డు చేస్తుంటాయి. టేబుళ్ల వద్ద రౌండ్ల వారీగా వెల్లడయ్యే ఓట్ల వివరాలను ఆయా ఏజెంట్లు సైతం ధ్రువీకరించాల్సి ఉంటుంది. అలా ధ్రువీకరించిన నివేదికను సూక్ష్మ పరిశీలకులు సంబంధిత ఏఆర్‌వో, ఎన్నికల పరిశీలకులకు అందజేస్తారు. అలా వచ్చిన సమాచారాన్ని ఏఆర్‌వోలు ఎన్నికల సంఘం సర్వర్‌ ద్వారా రిటర్నింగ్‌ అధికారికి చేర వేస్తారు. ఆయన అధికారికంగా వెల్లడిస్తారు.

పారదర్శకంగా ప్రక్రియ: రోనాల్డ్‌రాస్‌ 

పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా ఉంటుందని, అందుకోసం అధికారులు, సిబ్బందికి పూర్తి స్థాయి శిక్షణ ఇస్తున్నట్లు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్‌ రాస్‌ స్పష్టం చేశారు.  శనివారం బంజారాహిల్స్‌ ఆదివాసీ భవన్‌లో శిక్షణ తరగతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘అధికారులు, సిబ్బంది ఓట్ల లెక్కింపు విధులను సమర్థంగా నిర్వర్తించాలి. అసెంబ్లీ స్థానాల వారీగా  పర్యవేక్షణ ఉంటుంది. ఈవీఎంల్లో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తితే సంబంధిత నిపుణులు అందుబాటులో ఉండి సరి చేస్తారు. రౌండ్ల వారీ ఓట్ల వివరాలను ఆయా కేంద్రాల్లో ఉండే ఎన్నికల పరిశీలకులకు ఇవ్వాలి. లెక్కింపులో సమస్య ఎదురైతే సంబంధిత ఏఆర్‌వో (సహాయ రిటర్నింగ్‌ అధికారి)కి తెలపాలి. లెక్కింపు కేంద్రంలోకి ఫోన్లు అనుమతించం’’ అని తెలిపారు.  హైదరాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్, సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ జాయింట్‌ సీఈవో సునందరాణి పాల్గొన్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని