logo

సమస్యలే ముందుమాట

విజ్ఞాన భాండాగారాలు నిర్వహణ లేక శిథిల దశకు చేరుకుంటున్నాయి. నిర్వహణ, అభివృద్ధి తదితరాలకు ప్రజల నుంచి లైబ్రరీ సెస్‌ వసూలు అవుతున్నా.. ఎక్కడా సరైన నిర్వహణ కనిపించడం లేదు. నగరంలో మొత్తం

Published : 20 Jan 2022 04:15 IST

నిర్వహణ లేక శిథిలమవుతున్న గ్రంథాలయాలు


పుస్తకాల సరిగా పెట్టక ఇలా

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే బేగంబజార్‌, కవాడిగూడ: విజ్ఞాన భాండాగారాలు నిర్వహణ లేక శిథిల దశకు చేరుకుంటున్నాయి. నిర్వహణ, అభివృద్ధి తదితరాలకు ప్రజల నుంచి లైబ్రరీ సెస్‌ వసూలు అవుతున్నా.. ఎక్కడా సరైన నిర్వహణ కనిపించడం లేదు. నగరంలో మొత్తం 82 గ్రంథాలయాలుండగా ఇందులో చాలా వరకు పేపర్‌పాయింట్లుగా మాత్రమే ఉన్నాయి. కొన్ని చోట్ల సిబ్బంది లేక నిర్వహణ సరిగా లేదు. పోటీ పరీక్షల నేపథ్యంలో నగర కేంద్ర గ్రంథాలయంతోపాటు రాష్ట్ర కేంద్ర గ్రంథాలయంలో అభ్యర్థులు సన్నద్ధమవుతుంటారు. అయితే ఇక్కడా కొన్ని మౌలిక సదుపాయాలు కరవయ్యాయి. అఫ్జల్‌గంజ్‌లోని 130 ఏళ్ల చరిత్ర ఉన్న రాష్ట్ర కేంద్ర గ్రంథాలయం పరిస్థితి ఇదే.. పెచ్చులూడిపోయి శిథిల స్థితికి చేరినా పట్టించుకునేవారే కరవయ్యారు. ఏటా వసూలు చేసే ఆస్తిపన్నులో జీహెచ్‌ఎంసీ లైబ్రరీ సెస్‌ కలిపి వసూలు చేస్తోంది. ఇలా వసూలు చేసిన పన్నులను గ్రంథాలయాలకు నిధులుగా వెచ్చించాలి. కానీ గతేడాది ఒక్కో లైబ్రరీకి కేవలం రూ.18,300 మాత్రమే చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటిలోంచే విద్యుత్తు బిల్లులు, నిర్వహణ ఖర్చులు, తాగునీరు తదితరాలు ఏర్పాటు చేయాలి. పుస్తకాలకు ప్రత్యేక నిధులు లేక కొత్తవి కొనలేని పరిస్థితి. నగర పౌరులు సభ్యత్వం కోసం శాఖ గ్రంథాలయంలో రూ.100, నగర కేంద్ర గ్రంథాలయంలో రూ.150 చెల్లిస్తున్నారు. నగరవ్యాప్తంగా ఇప్పటి వరకు సభ్యత్వం తీసుకున్నవారి సంఖ్య 2లక్షలకు చేరింది.


పేరుకు పెద్ద..

లక్షల పుస్తకాలు అందుబాటులో ఉండటంతో అఫ్జల్‌గంజ్‌లోని రాష్ట్ర కేంద్ర గ్రంథాలయానికి ఎక్కువ మంది పోటీపరీక్షల అభ్యర్థులు వస్తుంటారు. వీరికి కనీస తాగునీటి సదుపాయం లేకపోవడం గమనార్హం. ఉర్దూ, తెలుగు, ఆంగ్లంతో పాటు మరో 9 సెక్షన్లలో అన్ని రకాల పుస్తకాలు, పత్రికలు లభిస్తుంటాయి. 130 ఏళ్ల చరిత్ర ఉన్న గ్రంథాలయం పెచ్చులూడిపోతూ శిథిలమవుతోంది. నిజాం కాలం నాటి ప్రాచీన పుస్తకాలు, పరిశోధన పత్రాలను పరిరక్షించేందుకు డిజిటలైజేషన్‌ ప్రక్రియ మొదలుపెట్టి 18 ఏళ్లు గడుస్తున్నా సరైన నిధులు లేక ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పటి వరకు సుమారు 17,500 ఆంగ్ల పుస్తకాలు, 6,250 ఉర్దూ పుస్తకాలు, 6,500 అరబిక్‌, 10వేలు తెలుగు, 3,700 పర్షియన్‌, 1,500 సంస్కృతం, 280 హిందీ పుస్తకాలు, 1977 వరకు ఉన్న ప్రాచీన పత్రికలను మాత్రమే డిజిటలైజ్‌ చేశారు.

పెచ్చులూడుతున్న అఫ్జల్‌గంజ్‌లోని గ్రంథాలయం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని