logo

దస్త్రాల్లో తప్పులు.. అర్జీదారులకు తిప్పలు

భూములకు సంబంధించి ప్రతి పని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే తహసీల్దార్లు కేవలం రిజిస్ట్రేషన్‌లకే పరిమితం కావడం,.....

Published : 28 May 2022 02:58 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌


దరఖాస్తుకు రైతుల బారులు

భూములకు సంబంధించి ప్రతి పని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే తహసీల్దార్లు కేవలం రిజిస్ట్రేషన్‌లకే పరిమితం కావడం, పోర్టల్‌లో సమర్పించే దరఖాస్తులు కలెక్టర్‌ లాగిన్‌కు చేరడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. భూ విలువలు రోజురోజుకూ పెరిగిపోతున్న దృష్ట్యా రికార్డుల్లో చోటు చేసుకుంటున్న చిన్న తప్పులు హక్కుదారుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పరిష్కారానికి మీసేవ కేంద్రాల ద్వారా అర్జీలు సమర్పిస్తున్నా తిరస్కరణతో అవాక్కవుతున్నారు. రూ.వేలు చలానాలు చెల్లించి సమాధానం చెప్పేవారు కరవయ్యారు. సీసీఎల్‌ నుంచి ఆదేశాలు వస్తే ఫోన్‌కు మెసేజ్‌ వస్తుందని తమ చేతిలో ఏమీ లేదని అధికారులు పేర్కొనడం అయోమయానికి గురిచేస్తోంది.

జిల్లాలోని 19 మండలాల్లోని 566 పంచాయతీల పరిధిలో భూ సమస్యల పరిష్కారానికి ధరణి గ్రివెన్స్‌కు 4 వేలకు పైగా దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. ఇందులో వెయ్యి వరకు మాత్రమే పరిష్కారమయ్యాయి. తహసీల్దార్‌ కార్యాలయంలో పని ఒత్తిడితో పాటు అవసరమైన సిబ్బంది లేకపోవడంతో దరఖాస్తులు క్షేత్రస్థాయి పరిశీలనలో తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీఆర్‌వోలను భూ సమస్యల పరిష్కారానికి వినియోగించవద్దనే ఆదేశాలతో ప్రస్తుతం వీఆర్‌ఏ, రెవెన్యూ పరిశీలకుల ఆధ్వర్యంలోనే ప్రక్రియ సాగుతోంది. వీరికి క్షేత్రస్థాయిలో అవగాహన కొరవడటం, దరఖాస్తులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారిందని రెవెన్యూశాఖ అధికారులు చెబుతున్నారు.

మూడంచెల విధానంలో పరిశీలన..

భూ సమస్యల పరిష్కారానికి గ్రివెన్స్‌ ల్యాండ్‌ మ్యాటర్స్‌ పేరుతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రవేశపెట్టింది. పలువురు రైతులు మీ సేవ ద్వారా ఇందులో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు 8 వేలకు పైగా వచ్చాయి. ఇందులో అధికంగా పరిష్కరించినప్పటికీ ప్రతీరోజు వస్తూనే ఉన్నాయి. నిషేధిత జాబితాలో చేర్చినవి సవరించాలని కోరుతూ ఎక్కువ అర్జీలు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వీటి పరిష్కారానికి అధికారులు మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నారు. మొదటగా కలెక్టర్‌ సమక్షంలో పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని తిరస్కరిస్తున్నారు. రెండో దశలో గత రికార్డులను చూసి వాస్తవాలు తెలుసుకుంటున్నారు. చివరగా తహసీల్దార్‌కు పంపి క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలని సూచిస్తున్నారు. ఈ విధానంతో ఆలస్యం అవుతుందనే వాదన వినిపిస్తోంది.


తక్కువగా నమోదైంది..: రామయ్య, అల్లీపూర్‌

నా పేరిట పేరిట అల్లీపూర్‌ శివారులో సర్వే నెం.141లో 1.02 ఎకరాల పొలం ఉంది. ధరణిలో మాత్రం 0.10 గుంటలుగా తప్పుగా నమోదైంది. మిగతా 0.32 గుంటలు నమోదు చేయించేందుకు అధికారుల చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా ఐచ్ఛికాలు రాలేదని బదులిస్తున్నారు.


పురుషునికి బదులుగా స్త్రీ అని..: నవీన్‌కుమార్‌, గంగారం

నా పేరిట వారసత్వంగా సంక్రమించిన సర్వే నెం.16/ఇలో 1.25 ఎకరాల పొలం ఉంది. ఈ- పాసు పుస్తకం వచ్చింది. అయితే పురుషునికి బదులుగా స్త్రీ అని తప్పుగా నమోదు కావడంతో క్రయవిక్రయాలు చేసే వీల్లేకుండా పోయింది. చిన్నపాటి తప్పును కూడా సవరించే అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా.


త్వరలో సమస్యలకు పరిష్కారం..: విజయకుమారి, ఆర్డీవో, వికారాబాద్‌

ప్రభుత్వం జారీ చేసిన ఐచ్ఛికాలు అమల్లోకి రానున్నాయి. పాసుపుస్తకంలో దొర్లిన పొరపాట్లు, ఇతరుల పేర్లు వచ్చినా, అక్షర దోషాలు ఉన్నా సవరించుకునే వెసులుబాటు కలుగుతుంది. రిజర్వేషన్‌ కేటగిరీ, ఆధార్‌ సంఖ్య తప్పుగా నమోదైతే, పట్టా, సీలింగ్‌, భూదాన్‌, దేవాదాయ, వక్ఫ్‌బోర్డు, అసైన్డ్‌మెంట్‌, నిషేధిత జాబితాలో ఉంటే సరి చేసుకోవచ్ఛు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని